నేడు సర్కారుకు రాజధాని మాస్టర్‌ప్లాన్

నేడు సర్కారుకు రాజధాని మాస్టర్‌ప్లాన్


* హైదరాబాద్ చేరిన సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్

* నేడు సచివాలయంలో సీఎం చంద్రబాబుతో ఉన్నతస్థాయి భేటీ

* అభ్యంతరాలు వెలిబుచ్చేందుకు నెలరోజుల గడువిచ్చే అవకాశం


 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగర(కేపిటల్ సిటీ) మాస్టర్‌ప్లాన్ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం చేతికి అందనుంది. ఈ మాస్టర్‌ప్లాన్‌ను తీసుకుని సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈశ్వరన్, ఆయనతోపాటు వచ్చిన సింగపూర్ కంపెనీల ప్రతినిధులు రాత్రికి ప్రైవేట్ హోటల్‌లో బస చేశారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సచివాలయంలో ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలసి ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ కేపిటిల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను ఏపీ సీఎంకు సమర్పిస్తారు. ఆ మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అంశాలపై చర్చిస్తారు. ఇప్పటికే సింగపూర్ కంపెనీలు రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్‌ప్లాన్‌ను రాష్ట్రప్రభుత్వానికి సమర్పించిన విషయం తెలిసిందే. సోమవారం కేపిటల్ సిటీ మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించనుందని ప్రభుత్వ కమ్యూనికేషన్ సలహాదారు పరకాల ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు.

 

 సింగపూర్ సమర్పించిన సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికపై రాష్ట్రప్రభుత్వం సమీక్ష నిర్వహిస్తుందని, అందులో ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సివస్తే సూచిస్తుందని, అందుకు అనుగుణంగా మార్పులు చేశాకనే సిటీ కేపిటల్ మాస్టర్ ప్రణాళికను ప్రజల ముందుంచుతామని పరకాల తెలిపారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్రణాళికను సమర్పించడంతో ఇక స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ ఎంపికపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేశాక ఆ మాస్టర్ డెవలపర్ వివిధ కంపెనీల నుంచి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా పెట్టుబడులను తీసుకువస్తారని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో కంపెనీలు పనిచేస్తాయని పరకాల చెప్పారు. ఇక సింగపూర్ సీడ్ కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌ను మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. సీఎం చంద్రబాబు, ఈశ్వరన్‌లు ఉన్నతస్థాయి సమావేశానంతరం విలేకరులతో మాట్లాడతారన్నారు. కేపిటల్ మాస్టర్‌ప్లాన్‌కు తుది రూపమిచ్చాక దానిపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం నోటిఫై చేయనుంది. నోటిఫై చేసిన తేదీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి నెల రోజులపాటు సమయమివ్వనున్నారు.

 

 ఇరువురు నేతల మధ్య ప్రైవేట్ భేటీ

 ఇదిలా ఉండగా సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య సోమవారం ప్రైవేట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో వారిద్దరే ఉంటారు. స్విస్ చాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ బాధ్యతలను కూడా సింగపూర్ సంస్థలకే అప్పగించాలని నిర్ణయించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు, ఈశ్వరన్ ప్రైవేట్ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. ఈ భేటీలో ఎటువంటి రహస్య అవగాహనలు చేసుకుంటారో ఎవరికీ తెలియదు. వారిద్దరి మధ్య మాత్రమే ఆ రహస్య భేటీ వ్యవహారాలు ఉంటాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top