సీనియర్ నాయకుల తీరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఏ నాయకుడు బయటకు వెళతారోనని
పార్టీల గుండెల్లో వలసల గుబులు
Nov 29 2013 4:31 AM | Updated on Mar 18 2019 7:55 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :సీనియర్ నాయకుల తీరుతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల గుండెల్లో గుబులు మొదలైంది. ఎప్పుడు ఏ నాయకుడు బయటకు వెళతారోనని ఆ పార్టీల అధిష్టానాలు ఆందోళన చెందుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు పలువురు నేతలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారు. ఎవరి బుజ్జగింపులూ వీరిపై పనిచేయవని తేటతెల్లమైంది. టీడీపీ ముఖ్య నేతలు కొందరు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏకంగా తన పదవికి రాజీనామా చేసి అధిష్టానానికి వణుకు పుట్టించారు. పార్టీలోని మరో ముఖ్య నాయకుడు కూడా బయటకువెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యనేతలు కొందరు ఏ క్షణంలోనైనా పార్టీ మారే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. పార్టీలో తీవ్రస్థాయికి చేరిన వర్గపోరే దీనికి కారణం. పార్టీలో తమకు సరైన న్యాయం జరగటం లేదని ఓ వర్గం నేతలు చంద్రబాబు వద్ద కూడా పంచాయతీ పెట్టారు. అయినా ప్రయోజనం లేకపోవటంతో వారు పార్టీని వీడొచ్చనే చర్చ ఊపందుకుంది.
రాష్ట్ర విభజనతో బయటకు..
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఇక ఏ మాత్రం కొనసాగవద్దని పలువురు నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు త్వరలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నట్లు ఆయన సోదరుడు, పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావుతోపాటు కొందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్‌పీటీసీలు, సర్పంచ్‌లు, ప్రస్తుత సర్పంచ్‌లు వైఎస్‌ఆర్‌సీపీలో చేరనున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయినట్లేనని చెప్పవచ్చు.
మంత్రి కోండ్రులోనూ ఆందోళన..
రాష్ట్ర వైద్యవిద్య శాఖ మంత్రి కోండ్రు మురళీమోహన్ పైకి గంభీర ప్రకటనలు చేస్తున్నా లోలోపల ఆందోళన
చెందుతున్నట్టు సమాచారం. గురువారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి గంటా శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ల తీరును తప్పుబట్టారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించారు. పార్టీలు మారేవారే ఇలాంటి చర్యలకు పాల్పడతారని చెప్పారు. వీరిద్దరిపై చర్య తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. అంటే పార్టీ నుంచి ముఖ్య నాయకులంతా బయటకు వెళుతున్నారనేది మంత్రికి కూడా స్పష్టమైంది. జనం ఎలాగూ వ్యతిరేకిస్తున్నారు..
పార్టీ కేంద్ర నాయకులవద్దయినా మంచి అనిపించుకుంటే పదవులు దక్కుతాయనే ఆలోచనలో కోండ్రు మురళి ఉన్నట్లు స్పష్టమవుతున్నది.
Advertisement
Advertisement