గుండె చెరువు!

Man Drown In Pond In Visakhapatnam District - Sakshi

నీటమునిగి పశువుల కాపరి మృతి

కాశీపురంలో విషాద ఛాయలు

పశువులను మేతకు తీసుకెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కాశీపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గూనూరు మంగునాయుడు (50) ప్రాణాలు కోల్పోవడంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది.

సాక్షి, దేవరాపల్లి: కాశీపురం గ్రామానికి చెందిన గూనూరు మంగునాయుడు ఎప్పటిలాగానే ఆదివారం ఉదయం పశువులను మేతకు తీసుకెళ్లాడు. అయితే పశువులు 11 గంటల ప్రాంతంలో పాకకు వచ్చేయగా మంగునాయుడు మాత్రం రాలేదు. మధ్యాహ్నమైన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు వెతకడం ప్రారంభించారు. పశువులను మేతకు తీసుకెళ్లిన ప్రాంతంతో పాటు పంట పొలాల్లోను, చుట్టు పక్కల వారిని ఆరా తీసిన ఆచూకీ లభించక పోవడంతో కుటుంబీకుల్లో మరింత ఆదోళన నెలకొంది. ఈ క్రమంలోనే సాయంత్రం కాశీపురం –నాగయ్యపేట రహదారిలో గల రాచ చెరువులో మంగునాయుడు టోపీ తేలియాడటాన్ని స్థానికులు గుర్తించి విషయాన్ని అతని కుటుంబీ కులకు చేరవేశారు.

దీంతో చెరువులో గాలించటంతో మృతదేహం బయటపడింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన మంగునాయుడు తిరిగిరాని లోకాలు వెళ్లిపోవడంతో ఆయన భార్య నాగమణి గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడివారిని కంటతడిపెట్టించింది. అందరితో కలిసిమెలిసి ఉండే మంగునాయుడు మృతితో కాశీపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య నాగమణితోపాటు పెద్ద కుమారుడు వెంకటేష్‌ (బీటెక్‌), అప్పలనాయుడు(డిప్లొమో) ఉన్నారు. వీరిద్దరూ విశాఖపట్నంలో చదువుకుంటున్నా రు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఏఎస్సై కె.దేముడునాయుడు, కానిస్టేబుల్‌ గాంధీ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని చెరువులోనుంచి బయటకు తీయించారు.

చెరువులోకి వెళ్లిన పశువులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగునాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం ఆస్పత్రికి తరలించారు.  బాధిత కుటుంబ సభ్యులను స్థానిక వైఎస్సార్‌సీపీ నాయుకులు బొడ్డు పేరునాయుడు, దాసరి మంగునాయుడు, దాసరి గోపి, చలుమూరి మోహన్, ఆదిరెడ్డి వెంకటరావు తదితరులు పరామర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top