పవన విద్యుత్‌ కొనుగోలుతో నష్టాలే

Losses with wind power purchase - Sakshi

కేంద్ర సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు

చౌక విద్యుత్‌ ఆపేయాల్సి వస్తోంది..థర్మల్‌కు గండి పడుతోంది  

పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3.50 పరిహారం ఇవ్వాలని డిమాండ్‌   

27వ తేదీన చెన్నైలో సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం  

11 అంశాల అజెండాపై చర్చ

పవన విద్యుత్‌ కొనుగోలు వల్ల డిస్కంలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని దక్షిణాది రాష్ట్రాలు ఏకాభిప్రాయానికొచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.3.50 చొప్పున కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు అవసరమైన లైన్లు వేయడానికి డిస్కంలు అప్పులు చేసి, వడ్డీలు కట్టాల్సి వస్తోందని, చివరకు ఆ భారం వినియోగదారులపైనే పడుతోందని కేంద్రానికి తెలపాలని నిర్ణయించాయి.  

సాక్షి, అమరావతి: యూనిట్‌ రూ.2కే లభించే కరెంటును వదిలేసి, రూ.6.04 చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటే అది ఎంత నష్టదాయకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన విద్యుత్‌(విండ్‌ పవర్‌) కొనుగోలు వ్యవహారంలో అక్షరాలా ఇదే జరుగుతోంది. పవన విద్యుత్‌కు పెద్దపీట వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల వల్ల విద్యుత్‌ పంపిణీ సంస్థలు(డిస్కంలు) భారీగా నష్టపోతున్నాయని కేంద్రానికి తెలియజేయాలని నిర్ణయించాయి.

పవన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సి వస్తే రాష్ట్ర డిస్కంలకు కేంద్రం పరిహారం చెల్లించాల్సిందేనని గట్టిగా డిమాండ్‌ చేయాలని భావిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల(సదరన్‌) జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం ఈ నెల 27వ తేదీన చెన్నైలో జరగనుంది. కేంద్ర ప్రభుత్వం విధించిన పవన విద్యుత్‌ కొనుగోలు షరతుపైనే ప్రధానంగా చర్చించాలని కౌన్సిల్‌ తీర్మానించింది. ఇందుకు సంబంధించిన 11 అంశాల అజెండాను ఆంధ్రప్రదేశ్‌ ఇంధనశాఖతో పాటు అన్ని దక్షిణాది రాష్ట్రాలకు పంపింది. ఈ ఎజెండాతో ఏపీ ఇంధన శాఖ పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి చెప్పారు. పవన విద్యుత్‌పై కమిటీ సమావేశంలో చర్చించి, తీర్మానాన్ని కేంద్రానికి పంపేందుకు అన్ని విధాలా తోడ్పాటునిస్తామని స్పష్టం చేశారు. 

ఒక్కో యూనిట్‌ ధర రూ.6.04 
దేశంలో పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రతిఏటా పెంచాలని కేంద్రం 2015లో నిర్ణయించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాలు కూడా పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. ఏపీలో దీని ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. వాస్తవానికి ఇండియన్‌ ఎనర్జీ ఎక్ఛ్సేంజ్‌ లెక్కల ప్రకా>రం బహిరంగ మార్కెట్‌లో యూనిట్‌ విద్యుత్‌ రూ.2 లోపే లభిస్తోంది. కానీ ముందే కుదుర్చుకున్న పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల(పీపీఏ) కారణంగా పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీ ట్రాన్స్‌కో పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు ట్రాన్స్‌మిషన్‌ లైన్లు కూడా అవసరమైన మేర వేయలేకపోయింది. దీంతో పూర్తిస్థాయిలో ట్రాన్స్‌మిషన్‌ లైన్లు లేకుండానే పవన విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేశారు.

ఫలితంగా సబ్‌ స్టేషన్లపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు రాష్ట్ర వినియోగంలో 21 శాతం సంప్రదాయేతర ఇంధన వనరులుంటున్నాయి. మార్కెట్‌లో యూనిట్‌ రూ.2కే లభించే విద్యుత్‌ను పవన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల కారణంగా తీసుకోలేకపోతున్నారు. మరోవైపు యూనిట్‌ రూ.4.20కే లభించే థర్మల్‌ విద్యుత్‌ను కూడా ఆపేయాల్సి వస్తోంది. పైగా పీపీఏలున్న పవన విద్యుత్‌ కేంద్రాలకు యూనిట్‌కు రూ.1.20 చొప్పున ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పవన విద్యుత్‌ ధర యూనిట్‌కు ఏకంగా రూ.6.04 వరకూ పడుతోంది. రూ.2కే లభించే విద్యుత్‌తో పోలిస్తే దాదాపు ఇది రూ.4 అదనం కావడం గమనార్హం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top