రేపు దేశవ్యాప్తంగా లారీల బంద్‌ 

Lorries band across the country on 19-09-2019 - Sakshi

డిమాండ్ల పరిష్కారానికి ఒక్కరోజు సమ్మె    

చమురు, అత్యవసర సరుకుల రవాణాకు మినహాయింపు  

సాక్షి, అమరావతి బ్యూరో: లారీ ఇండస్ట్రీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేలా కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న భారీ జరిమానాలకు నిరసనగా ఈ నెల 19న దేశవ్యాప్తంగా లారీల సమ్మెకు ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. సవరించిన భారత మోటారు వాహన చట్టం–2019 ప్రకారం కేంద్ర ప్రభుత్వం దూరప్రాంతాలకు తిరిగే లారీలపై పెను భారం మోపింది. దీని ప్రకారం చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా పలు రాష్ట్రాల్లో రూ. 30 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానాలు విధిస్తున్నారు.

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా అసలే సంక్షోభంలో ఉన్న లారీ పరిశ్రమకు ఈ కొత్త చట్టం పెను నష్టాన్ని తెచ్చి పెడుతోందని లారీ యజమానులు లబోదిబోమంటున్నారు. దక్షిణాదితో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ జరిమానాలు అమలు చేయకపోవడం వల్ల ఉపశమనం పొందుతున్నారు. కానీ ఒడిశా, గుజరాత్, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు జరిమానాల బాదుడు అధికంగా ఉంటోందని లారీ యజమానులు చెబుతున్నారు. బీమా ప్రీమియం, జీఎస్టీ వంటివి లారీ పరిశ్రమను కుదేలు చేస్తున్నాయని అంటున్నారు. లారీ పరిశ్రమను కాపాడుకోవాలంటే రానున్న ఆరు నెలల పాటు కొత్త లారీలు కొనుగోలు చేయరాదని ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్‌ లారీ యజమానులను కోరుతోంది. 

రాష్ట్ర అసోసియేషన్‌ మద్దతు 
లారీల బంద్‌కు ఆంధ్రప్రదేశ్‌ లారీ ఓనర్ల అసోషియేషన్‌ కూడా మద్దతు ప్రకటించింది. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు లారీలు వెళ్లకుండా నిలువరిస్తామని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల లారీలుండగా వీటిలో నాలుగో వంతు మాత్రమే సరకు రవాణాలో ఉన్నాయి. స్థానికంగా తిరిగే లారీలపై సమ్మె ప్రభావం ఉండదని, అందువల్ల సరుకు రవాణా పాక్షికంగా నిలిచిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. చమురు, పాలు వంటి అత్యవసర సరుకుల రవాణా లారీలకు సమ్మె నుంచి మినహాయింపునిచ్చారు.  

లారీ యజమానుల ప్రధాన డిమాండ్లు 
- లారీ పరిశ్రమను తేరుకోలేకుండా చేసే ఎంవీ యాక్టు–2019 బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలి. 
రవాణా వాహనాలకు థర్డ్‌ పార్టీ ఇన్‌స్యూరెన్స్‌ ప్రీమియాన్ని పెంచరాదు. దీనిపై ఉన్న జీఎస్టీని మినహాయించాలి.
కొత్త/పాత వాహనాల కొనుగోలుపై జీఎస్టీని తగ్గించాలి. 
రవాణా రంగంలో ఏటా రూ. కోటి నగదు విత్‌డ్రాపై 2 శాతం వసూలు నిలిపివేయాలి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top