లోకేశ్.. ఓకే అంటేనే..! | Lokesh interferes in Andhra pradesh Government | Sakshi
Sakshi News home page

లోకేశ్.. ఓకే అంటేనే..!

Jul 31 2014 2:00 AM | Updated on Jun 2 2018 2:36 PM

లోకేశ్.. ఓకే అంటేనే..! - Sakshi

లోకేశ్.. ఓకే అంటేనే..!

ఏ మంత్రి పేషీలో నియామకం అయినా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్నీ చినబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

 మంత్రుల పేషీల్లో నియామకాలన్నీ చినబాబు కనుసన్నల్లోనే...
 
 సాక్షి, హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకు ఇసుమంత స్వేచ్ఛ కూడా లేకుండాపోయింది. వారిపై నిఘా ఉంచేలా, ప్రతి కదలికనూ తెలుసుకొనేలా వారి కార్యాలయాల్లో నియామకాలు జరుగుతున్నాయి. చిన్న స్థాయి వారిని కూడా మంత్రులు సిఫార్సు చేసిన వారిని నియమించడంలేదు. అన్నీ చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘అభీష్ట’ం మేరకే జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రులు తమకు అనుకూలురైన, సమర్ధులని భావించిన అధికారులు, సిబ్బందిని పేషీల్లో నియమించుకోవడం సహజమే.ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఏ మంత్రి పేషీలో నియామకం అయినా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్నీ చినబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ మంత్రులు స్వతంత్రించి  నియమించుకున్నా, వారిని ఏదో విధంగా వెనక్కి పంపుతున్నారు. లోకేశ్ సూచించిన వారినే తమ కార్యాలయాల్లో నియమించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రులు ఆవేదన చెందుతున్నారు. జూనియర్లే కాదు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా సీనియర్ మంత్రుల పరిస్థితి కూడా ఇంతే. యనమల గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన పేషీలో ఒఎస్‌డీగా శ్రీనివాసరావు పనిచేశారు. 2004లో టీడీపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి మంత్రి రఘువీరారెడ్డి దగ్గర శ్రీనివాసరావు ఒఎస్‌డీగా చేరారు. అదీ.. యనమల సూచన మేరకే రఘువీరా నియమించుకున్నారు. మళ్లీ ఇప్పుడు యనమల ఆర్థిక మంత్రి కావడంతో, శ్రీనివాసరావును ఒఎస్‌డీగా నియమించుకున్నారు. దీనికి సీఎం అంగీకరించలేదు. కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేసిన వారిని మంత్రులు కార్యాలయాల్లో నియమించుకోవద్దని స్పష్టంచేశారు. సీఎం కార్యాలయం ఆదేశాలకు యనమల  తలొగ్గి శ్రీనివాసరావును వెనక్కి పంపారు.
 
 ఇలా కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేశారనో, మరో కారణంతోనో మంత్రులు నియమించుకున్నవారిని వెనక్కి పంపుతున్నారు. ఈ విధానంపై మంత్రులు, అధికారులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలను పార్టీలో చేర్చుకొని, మంత్రి పదవులిచ్చారని, కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేసిన అధికారులను పేషీల్లో నియమించుకుంటే వచ్చిన నష్టమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి ఆదేశాలను పాటించేది లేదని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్వయంగా బాబు ముందే స్పష్టం చేశారు. గతంలో మంత్రయిన తోట నర్సింహం దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని ఇప్పుడు మాణిక్యాలరావు వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నారు. ఇందుకు అనుమతించాలని సీఎం ను మంత్రి కోరారు. ఆయన అంగీకరించలేదు. ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నామని,అనుసరించాలని చెప్పారు. దీనిపై మాణిక్యాలరావు ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. అదే సమయంలో తోట నర్సింహం కూడా పక్కనే ఉన్నారు. తాను వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకునే వ్యక్తి తోట నర్సింహం పేషీలో పనిచేశారని, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని మాణిక్యాలరావు సీఎంను ప్రశ్నించినట్లు సమాచారం. లోకేష్ ‘అభీష్ట’ం మేరకే అన్నీ జరుగుతుండటంపై అధికారవర్గాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న రాజకీయ నేతలు టీడీపీలోకి వస్తే లేని అభ్యంతరం ఈ విషయంలో ఎందుకుండాలని వారి వాదన. వ్యక్తిగతంగా చెడ్డ పేరు ఉంటే ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుని అలాంటివారిని పక్కన పెట్టడంలో అర్ధం ఉంటుందని, అందరినీ ఒకే గాటన కట్టి పనికిరారని ముద్ర వేయడమే ఆవేదన కలిగిస్తోందని చెబుతన్నారు. మంత్రులపై నిఘా కోసమే ఇదంతా చేస్తున్నారన్న భావన అధికార, ఉద్యోగవర్గాల్లోనూ వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement