‘రేషన్’ కష్టమే..! | 'Levi' collection in new process | Sakshi
Sakshi News home page

‘రేషన్’ కష్టమే..!

Aug 13 2014 1:46 AM | Updated on Sep 2 2017 11:47 AM

ఇకనుంచి రేషన్ సరకుల సరఫరా కష్టమవనుందా..? అవునంటున్నారు పౌరసరఫరాల శాఖ అధికారులు.

 సాక్షి, ఒంగోలు: ఇకనుంచి రేషన్ సరకుల సరఫరా కష్టమవనుందా..? అవునంటున్నారు పౌరసరఫరాల శాఖ అధికారులు. ఇప్పటికే అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాల సరుకుల పంపిణీలో ప్రభుత్వం చేతులెత్తేసింది. రానున్న రోజుల్లో పేదలకు దక్కాల్సిన బియ్యం కూడా గగనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కేంద్రం నిర్ణయించిన నూతన ‘లెవీ’ సేకరణ విధానం నేపథ్యంలో భవిష్యత్‌లో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపట్ల నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై సర్వత్రా విమర్శిస్తున్నారు. నూతన లెవీ సేకరణ విధానంతో పేదలకు అందాల్సిన బియ్యం నిల్వలు తగ్గిపోతాయని సామాజిక, పౌరసంస్థలు ఇప్పటికే ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ప్రైవేటు మార్కెట్‌లో బియ్యం కొనుగోలు చేసి ప్రజాపంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం మీనమేషాలు లెక్కించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 కొత్త విధానం ఇదీ...
 ప్రస్తుతం అమలులో ఉన్న లెవీ విధానం ప్రకారం మిల్లర్ల నుంచి 75 శాతం బియ్యాన్ని ప్రభుత్వమే లెవీగా సేకరించి..25 శాతంను మిల్లర్లు బయట ప్రైవేటుగా అమ్ముకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ప్రభుత్వం (ఎఫ్‌సీఐ) సేకరించిన లెవీ బియ్యాన్ని గోడౌన్‌లకు తరలించి నిల్వపెట్టి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేస్తోంది. అలాంటిది, తాజాగా కేంద్రం అమలు చేయాలనుకుంటున్న లెవీ విధానం ప్రకారం 25 శాతమే లెవీకింద సేకరించి..మిగిలిన 75 శాతం బియ్యంను బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చని మిల్లర్లకు అవకాశమివ్వనుంది.

ఈ విధానంతో ప్రభుత్వం అవసరమైతే బయట మార్కెట్‌లో బియ్యం కొనుగోలు చేసి ప్రజాపంపిణీకి అందజేయాల్సి ఉంటుంది. మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ కిలోబియ్యాన్ని రూ.22.50 కొనుగోలు చేసి వివిధ పథకాలకు అమలు చేస్తోంది. తాజా మార్పులతో బియ్యం బయట కొనుగోలు చేస్తే ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. జిల్లాలో ప్రతీనెలా 12,102  టన్నుల బియ్యాన్ని ప్రజాపంపిణీకి కేటాయిస్తున్నారు.

 తగ్గిపోనున్న ‘లెవీ’..
 జిల్లాలో గతేడాది ఖరీఫ్‌లో 50 వేల టన్నులు లెవీ లక్ష్యంగా నిర్దేశించారు. మిల్లర్లు కేవలం 48 వేల టన్నులు మాత్రమే లెవీకింద ఇచ్చారు. అంతకు ముందు ఏడాది 62 వేల టన్నులు లక్ష్యం కాగా, సుమారు 52 వేల టన్నులే సేకరించారు. ఇకపై లెవీ చెల్లింపులు గణనీయంగా పడిపోనున్నాయి. జిల్లాలో సుమారు 300 మిల్లులున్నాయి. ఇప్పటికే విద్యుత్ కోతతో పాటు ఇతర సమస్యలతో సుమారుగా 60 వరకు మూతపడే దశకు చేరుకున్నాయి.

ప్రస్తుతం ఎఫ్‌సీఐ నుంచి నెలవారీ బిల్లులు రావడంతో మిల్లర్లు అంతంతమాత్రంగా వ్యాపారం చేస్తున్నారని.. పెద్ద మొత్తంలో బియ్యం ప్రైవేటుగా విక్రయించుకోవడం ఆర్థిక భారంతో కూడుకున్నదని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. కొత్త లెవీ విధానం అమలుచేస్తే మరో 100కు పైగా మిల్లులు మూతపడే ప్రమాదం ఉందని మిల్లర్లు పేర్కొంటున్నారు. రెండేళ్లుగా ప్రజాపంపిణీ సరుకుల కొరత తీవ్రంగా ఉండటంతో.. జిల్లాకు కేటాయించినంత నిల్వలనే లబ్ధిదారులకు సర్దుబాటు చేయడంలో పౌరసరఫరాల శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. భవిష్యత్‌లో ఈ పరిస్థితి మరింత పెరిగినట్లయితే, పేదలకు నెలవారీ బియ్యం అందించలేమనే ఆందోళనలో ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement