క్షణ క్షణం భయం భయం

Leopord Escape From Tree in East Godavari - Sakshi

చెట్టు దిగి పారిపోయిన చిరుతపులి

అధికారుల పట్టివేతఆపరేషన్‌ ఫెయిల్‌

ర్యాలి, అంకంపాలెం, లొల్ల గ్రామాల్లో భయాందోళన

గాలింపు చర్యలు ముమ్మరం

ఆత్రేయపురం (కొత్తపేట): అంకంపాలెం గ్రామంలో చిరుతపులి బీభత్సం నేపథ్యంలో, మంగళవారం అంకంపాలెంతో పాటు ర్యాలి, లొల్ల గ్రామాల్లో పరిస్థితి క్షణక్షణం భయం భయంగా ఉంది. అంకంపాలెంలో సోమవారం రాత్రి చిరుతపులి బీభత్సం సృష్టించి నలుగురి వ్యక్తులను గాయపర్చి చెట్టుపైకి చేరిన విషయం విదితమే. అంకంపాలెంలో సోమవారం రాత్రి కొబ్బరి చెట్టుపై ఉన్న చిరుతపులిని పట్టుకునేందుకు అధికారులు, ప్రజలు రాత్రంతా పహరా కాశారు. అర్ధరాత్రి దాటిన తరువాత పులి హఠాత్తుగా చెట్టు దిగి పొలాల వైపు పరుగుతీసింది. కటిక చీకటి కావడంతో ఆ పులిని పట్టుకోవడంలో అధికారులు ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ పరిణామానికి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ పొలాలు వైపు చూస్తూ రాత్రంతా గడిపారు. పరారైన పులిని పట్టుకునేందుకు జంతు ప్రదర్శన శాల ఎక్స్‌ఫర్ట్‌ శ్రీనివాసరావు, వెటర్నరీ వైద్య నిపుణులు ఫణీంద్ర ఆధ్వర్యంలో అటవీ, పోలీసు శాఖల అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఎంత ప్రయత్నించినా..
చెట్టుపై ఉన్న చిరుతపులిని బంధించేందుకు సోమవారం రాత్రి అధికారులు విఫలయత్నం చేశారు. ర్యాలి రోడ్డు పక్క వన్యప్రాణుల రక్షణ వాహనంతో బోనును సిద్ధం చేసుకున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నుంచి చెట్లపై నుంచి దించడానికి క్రేన్, లిఫ్టును కూడా సిద్ధం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి నందనీ సలారియా సంఘటనా స్థలానికి చేరుకుని అటవీ శాఖ అధికారులతో చిరుతపులిని బంధించేందుకు సమాయత్తం చేశారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అంకంపాలెం చేరుకుని ప్రజలను అప్రమత్తం చేశారు. జిల్లా అటవీ, రెవెన్యూ, పోలీసు అధికార్లు దృష్టికి చిరుత పులి సంచారం గురించి  తెలిపారు. తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ శాఖ అధికారులు ఒక సమయంలో లైట్లు ఆర్పివేయడంతో చిరుతపులి తప్పించుకుని పొలాల్లోకి పారిపోయిందని ప్రజలు చెబుతున్నారు.

అధికారుల పరుగులు
చెట్టుపై నుంచి పొలాల్లోకి చిరుతపులి పారిపోయిన నేపథ్యంలో, మంగళవారం అధికారులు హడావుడి తీవ్రమైంది. కాకినాడ అటవీ శాఖ రేంజ్‌ బృందం ఆపరేషన్‌ కొనసాగిస్తోంది. అమలాపురం అర్డీఓ వెంకటరమణ, డీఎస్పీ రమణ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీసులు పులి వేటలో పడ్డారు. రావులపాలెం ఆటవీ శాఖ తనిఖీ అధికారి రవి, డిప్యూటీ రేంజ్‌ అధికారి కందికుప్ప సత్యనారాయణ, అటవీ బీట్‌ అధికారులు చంద్రరావు, శ్రీహరి, సత్యనారాయణ, శ్రీను, గోకవరం రేంజ్‌ రంగరావు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

కాన రాని పులి జాడ
మంగళవారం రాత్రి వరకు చిరుతపులి జాడ తెలియలేదు. పంట పొలాలు , కాలువల మధ్య ఎక్కడ ఉందోనని రైతులు పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో వశిష్టా గోదావరి సమీపం నుంచి చిరుతపులి వెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయని అటవీ శాఖ నిపుణులు అంటున్నారు. విశాలమైన పంట పొలాలు, నదీకాలువలు మద్య చిరుతపులిని పట్టుకోవడంలో వివిధ శాఖల అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుత పులిని బంధించేవరకు కంటిపై కునుకు ఉండదని ఈ ప్రాంతంలో ప్రజలు వాపోతున్నారు. పరిసర గ్రామాలు ప్రధానంగా లొల్ల, మెర్లపాలెం తదితర గ్రామాల వైపు చిరుతపులి వెళ్లి ఉంటుందన్న అభిప్రాయాలు రావడంతో ఆ ప్రాంతీయులు హడలిపోతున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం పులి దాడిలో గాయపడిన వారు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

నష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత..
అంకంపాలెం సమీప గ్రామాల్లో చిరుత పులిదాడి వల్ల వచ్చే నష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా చిరుతపులి దాడికి ప్రజలు గురయ్యారని, ప్రత్యేక బృందాలతో చిరుతపులిని పట్టుకోవాలన్నారు. ప్రజలు చిరుత పులి సంచారం వల్ల గ్రామాల్లో సంచరించాలంటే భయపడిపోతున్నారు. అటవీ శాఖ సాంకేతిక సిబ్బందిని సకాలంలో రంగంలోకి దించలేదని విమర్శించారు. అధికారులు సమర్థంగా ఆపరేషన్‌ నిర్వహించకపోవడం వల్లే చిరుతపులి తప్పించుకుని పోయిందన్నారు. ప్రాణనష్టం జరిగినా అందుకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top