మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం కావడం పట్ల వామపక్షాలు, బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశాయి.
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద బుధవారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది సజీవదహనం కావడం పట్ల వామపక్షాలు, బీజేపీ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశాయి. రహదారుల భద్రతను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టాయి. ఆర్టీఏ అధికారుల అవినీతి, ప్రైవేటు ఆపరేటర్ల దుర్నీతి, అతివేగం ప్రయాణీకుల పాలిట శాపంగా మారాయని వేర్వేరు ప్రకటనల్లో దునుమాడాయి.
మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని సీపీఐ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు కె.నారాయణ, బీవీ రాఘవులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ప్రైవేటు ఆపరేటర్ల ఆగడాలను అరికట్టి ఇప్పటికయినా ప్రభుత్వ రంగ రవాణాను పెంపొందించేలా చూడాలని రాఘవులు ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ప్రమాదానికి బాధ్యులయిన బస్సు యాజమాన్యంపైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఓబులేసు సంఘటనా స్థలాన్ని సందర్శించి వచ్చారు. మానవ తప్పిదంతోనే ఈ దుర్ఘటన జరిగిందని చెప్పారు. మరణించిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు కొందరు సొంత సంస్థలను నడుపుతూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని నివారించాలని, వారి ఆగడాలకు కళ్లెం వేయాలని సీపీఎం శాసనసభాపక్ష నాయకుడు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రికి దత్తాత్రేయ లేఖ
ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లకు సంబంధించి జాతీయ రహదారుల క్రమబద్ధీకరణ విధానం ఏమిటో చెప్పాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ రాష్ట్రముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ విధానం లేకపోవడమే ఘోరప్రమాదాలకు కారణమవుతోందని బుధవారం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన 74వ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రైవేటు ఆపరేటర్ల విధివిధానాలకు ఖరారు చేసేందుకు ఇప్పటికయినా అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియోను చెల్లించాలని కోరారు.