సర్కారీ చదువుకు సెలవు?

Leave to public education? - Sakshi

ఐటీడీఏలో జెడ్పీ పాఠశాలల విలీనానికి చర్యలు

పది జెడ్పీ ఉన్నత పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలుగా మార్పు

గిరిజనేతర విద్యార్థులకు తప్పని తిప్పలు

రంపచోడవరం : ఏజెన్సీలోని మండల పరిషత్, జిల్లా పరిషత్‌ యాజమాన్యంలోని పాఠశాలలకు మంగళం పాడేందుకు రాష్ట్ర స్థాయిలో విద్యాశాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి సెలవుల అనంతరం ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరంలో రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఉన్న పది జెడ్పీ ఉన్నత  పాఠశాలలను మూసివేస్తున్నారు. వీటిలో మారేడుమిల్లిలోని మండల పరిషత్‌ యాజమాన్యంలో ఉన్న మోడల్‌ పాఠశాలను కూడా కాలగర్భంలో కలిపేస్తున్నారు.

దాదాపు అర్ధశతాబ్దం పైగా ఏజెన్సీలో విద్యార్థులకు అందుబాటులో విద్యాబోధన అందించిన పాఠశాలలను ఐటీడీఏ యాజమాన్యానికి అప్పజెప్పడంపై తల్లిదంద్రుడలు స్థానిక సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏ పరిపాలన కేంద్రం రంపచోడవరంలో ఉన్న ఏజెన్సీలోని ఏకైక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సైతం ఐటీడీఏకి అప్పగించి చేతులు దులుపుకొనేందుకు విద్యాశాఖ సమాయత్తం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది.

విలీనమయ్యే పాఠశాలలు ఇవే

వై.రామవరం మండలంలోని వై.రామవరం, డొంకరాయి జెడ్పీ ఉన్నత పాఠశాలలు, అడ్డతీగల మండలం రాయపల్లి, రాజవొమ్మంగి మండలం జడ్డంగి, గంగవరం మండలం గంగవరం జెడ్పీ పాఠశాల, రంపచోడవరం మండలంలోని రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గెద్దాడ జెడ్పీ పాఠశాల, మారేడుమిల్లి మండలంలోని మారేడుమిల్లి జెడ్పీ పాఠశాల, చింతూరు మండలంలో మోతుగూడెం జెడ్పీ పాఠశాల, దేవీపట్నం మండలం దేవీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాలలను ఐటీడీఏకు అప్పగించేందుకు క్షేత్రస్థాయిలో పరిపాలనాపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ పాఠశాలలు అన్నీ ఈ వేసవి సెలవుల అనంతరం ఐటీడీఏ యాజమాన్యంలో ఆశ్రమ ఉన్నత పాఠశాలలుగా నామాంతరం చెందుతాయని  గిరిజన సంక్షేమ శాఖ డీడీ సరస్వతి తెలిపారు. ఈ పది జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సొంత యాజమాన్యానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలుగా మారిన తరువాత గిరిజన సంక్షేమ యాజమాన్యానికి చెందిన ఉపాధ్యాయులను నియమిస్తామని డీడీ తెలిపారు.

గిరిజనేతర విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకం

ఏజెన్సీలో ఎక్కువ మంది గిరిజనేతరులు చదువుల కోసం జెడ్పీ ఉన్నత పాఠశాలలు, మండల పరిషత్‌ పాఠశాలలపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిలో ఆయా విద్యార్థులకు తిప్పలు తప్పవు. ఎందుకంటే ఆశ్రమ పాఠశాలల్లో చదువుకునేందుకు గిరిజనేతర విద్యార్థులను చేర్పించుకున్నా ఇప్పటి వరకు జెడ్పీ పాఠశాలల ద్వారా అందే సౌకర్యాలు విద్యార్థులు కోల్పోతారు. గిరిజన సంక్షేమ శాఖ కేవలం గిరిజన విద్యార్థుల ప్రయోజనాలు కోసం మాత్రమే నిధులు ఖర్చు చేస్తుంది.

ఇలాంటి పరిస్థితిలో గిరిజనేతర విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం వంటి వాటికి దూరం కావాల్సిందే. ప్రస్తుతం పది పాఠశాలలను విలీన చేస్తున్నా, వచ్చే విద్యా సంవత్సరానికి మిగతా జెడ్పీ పాఠశాలలను కూడా గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలుగా మార్చనున్నట్టు సమాచారం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top