అర్ధరాత్రి తరువాతే తుది ఫలితం

Last Result Announced After Midnight in Election Counting Day - Sakshi

ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం

పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు

తూర్పుగోదావరి, కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్కింపు పూర్తిచేసి అధికారికంగా విజేతను  ప్రకటించేందుకు కనీసం 14 నుంచి 16 గంటల సమయం పడుతుందని అధికారులు  అంచనా వేస్తున్నారు. ఈనెల 23వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైతే అర్ధరాత్రి తరువాత తుది ఫలితం ప్రకటించే అవకాశం ఉంది.  2014 ఎన్నికల నాటి లెక్కింపు ప్రక్రియతో పోల్చితే ఈసారి అనేక మార్పులు వచ్చాయి. అప్పట్లో వీవీ ప్యాట్‌ ప్రక్రియ లేదు. ఈసారి వాటిని ప్రవేశ పెట్టారు. వాటి లెక్క తేల్చడానికే అధిక సమయం పడుతుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రతి రౌండులో రెండు యంత్రాలను ర్యాండమ్‌ పద్ధతిలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎంపిక చేసి లెక్కిస్తారు. ఈ ప్రక్రియలో ఎలాంటి గందరగోళం లేకుండా సంబంధిత రౌండుఫలితం ప్రకటిస్తారు. దీనివల్ల ఒక్కో ఈవీఎం ఓట్ల రౌండు లెక్కింపును పూర్తిచేయడానికి 30 నుంచి 45 నిమిషాలు పడుతుందని అధికారుల అంచనా. జిల్లాలో ఇంత వరకూ 40,145 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. గణన సమయానికి ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పూర్తిచేస్తే కానీ ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టడానికి అవకాశం లేదు. ఈ రెండూ పూర్తి చేసిన తర్వాతే వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు చేపట్టాలి.

వీవీ ప్యాట్‌లకు ఆరు గంటలు
ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీ ప్యాట్‌ల చొప్పున లెక్కిస్తారు. వీటిని ఒకదాని తరువాత మరొకటి లెక్కించాలి.  వీటి లెక్క పూర్తిచేయడానికి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. పోస్టల్‌ బ్యాలెట్లు, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాయంత్రం ఆరు గంటలకు పూర్తి చేయగలిగితే, తర్వాత వీవీ ప్యాట్‌ల  లెక్కింపు ముగించడానికి మరో ఆరు గంటల సమయం పడుతుంది. అంటే అర్ధరాత్రి దాటిన తరువాత విజేత పేరును అధికారికంగా ప్రకటించి, ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.

గంటలో తొలి రౌండ్‌ ఫలితం
ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తొలి రౌండు లెక్కింపు పూర్తయి ఫలితం అధికారికంగా ప్రకటించే సరికి ఉదయం 9.30  అవుతుందని భావిస్తున్నారు. అక్కడి నుంచి ప్రతి రౌండు 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో ముగుస్తుంది. ఈ లెక్కన 17 రౌండ్లు ఉండే సెగ్మెంట్ల ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తి చేయడానికి దాదాపు 9 గంటల సమయం పడుతుంది. జిల్లాలో మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈవీఎం ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 నుంచి 7 గంటల లోపు పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఈ అంశాలు కీలకం
అనుకోని అవాంతరాలు, ఇబ్బందులు ఎదురైతే  మరింత సమయం పట్టే అవకాశం ఉంది.∙వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు పూర్తయిన తరువాతే ఈసీ అనుమతితో అధికారికంగా విజేత పేరు ప్రకటిస్తారు.
మధ్యాహ్నం, రాత్రి భోజన విరామ సమయాలను కలుపుకుంటే మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపునకు ప్రత్యేకంగా బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. తొలుత అభ్యర్థుల వారీ వచ్చిన ఓట్లను ›వేరు చేస్తారు. దీనివల్ల ఒక్కో వీవీ ప్యాట్‌లలో స్లిప్పుల లెక్కింపునకు గంటకు పైగా సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఉన్న ఓట్లు,పోలైన ఓట్లు వివరాలు ఇలా ఉన్నాయి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top