భూ చిక్కులకు చెక్‌ పెట్టేలా.. | Land Records Rectification Checks Land Disputes | Sakshi
Sakshi News home page

భూ చిక్కులకు చెక్‌ పెట్టేలా..

Sep 13 2019 11:38 AM | Updated on Sep 13 2019 11:40 AM

Land Records Rectification Checks Land Disputes - Sakshi

రెవెన్యూ రికార్డులు

సాక్షి, విజయనగరం గంటస్తంభం: ఏళ్లు తరబడుతున్నాయి.. భూములు చేతులు మారుతున్నాయి.. హక్కుదారులూ మారుతున్నారు... కానీ రికార్డులు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. దీంతో అసలైన భూ హక్కుదారులకు చిక్కులు తప్పడంలేదు. స్పందన కార్యక్రమంలో రెవెన్యూ సమస్యలపైనే అధిక ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్‌ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపికచేసింది. దీనికోసం ప్రత్యేక అధికారులను, సర్వే బృందాలను సన్నద్ధం చేస్తోంది.

నియోజకవర్గం ప్రత్యేకాధికారి
కురుపాం సబ్‌ కలెక్టరు, పార్వతీపురం
పార్వతీపురం ఐసీడీఎస్‌ పీడీ
సాలూరు డీఆర్‌డీఏ పీడీ
బొబ్బిలి ఎస్డీసీ, భూసేకరణ, బొబ్బిలి
చీపురుపల్లి ఎస్డీసీ, భూసేకరణ, చీపురుపల్లి
గజపతినగరం ఆర్డీవో విజయనగరం
నెల్లిమర్ల ఎఫ్‌ఎస్‌వో, విజయనగరం
విజయనగరం ఎస్డీసీ, కేఆర్‌ఆర్‌సీ
శృంగవరపుకోట ఎస్డీసీ, భూసేకరణ, యూనిట్‌–3

ఆరు సమస్యలపై ఫోకస్‌
రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలంటే ముందుగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మాన్యువల్‌ రికార్డులతో పాటు వెబ్‌ల్యాండ్‌ రికార్డులు సరిచేయాలని నెలరోజుల కిందట సంయుక్త కలెక్టర్లతో జరిగిన సమావేశంలో రెవెన్యూ మంత్రి పిల్లి సుబాస్‌ చంద్రబోస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆరు అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. భూములు వారసత్వంగా పిల్లలకు సంక్రమించినా రికార్డుల్లో ఇప్పటికి చాలామంది తల్లిదండ్రులు పేర్లు ఉన్నాయి.

అలాగే, భూములు క్రయవిక్రయాలు జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్‌ చేసినప్పటికీ కీలకమైన రెవెన్యూ రికార్డుల్లోకి వారి పేర్లు రావడం లేదు. పట్టాదారుపాసు పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ జారీ చేసిన రికార్డులు పరంగా వారి పేర్లు నమోదు కావడం లేదు. ఒక రైతుకు వేర్వేరు ఖాతాలు కింద భూములు ఉన్నాయి. ఇవన్నీ ఒకే ఖాతా పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. సాగులో ఉన్న రైతులు, ఇతర వివరాలు తెలియక నోషనల్‌ ఖాతాల్లో ఆ భూములను నమోదు చేశారు. ఏళ్ల తరబడినా అవి అలాగే ఉన్నాయి. మాన్యువల్, ఆన్‌లైన్‌ ఎస్‌ఎల్‌ఆర్‌ సరి చేయాలని,  వెబ్‌ల్యాండులో భూ విస్తీర్ణం చూసి తేడా ఉంటే సరి చేయాలని సూచించారు.

ప్రయోగాత్మక అమలుకు చర్యలు
ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. జిల్లాలో కూడా దాదాపుగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, అన్ని గ్రామాల్లో ఒకేసారి చేపట్టడం వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా ఒక రెవెన్యూ గ్రామంలో ఈ సమస్యలపై దృష్టిసారించి రెవెన్యూ రికార్డులు ఫ్యూరిఫికేషన్‌ చేయాలని నిర్ణయించారు. దీనికి మండలానికి ఒక గ్రామం ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆగ్రామంలో గ్రామసభ పెట్టి ఈ ఆరు అంశాలపై వివరాలు సేకరించి ఒక్కో అంశంపై వచ్చిన లోపాలను గుర్తించి రికార్డులు సరి చేసేందుకు వివరాలు తయారు చేయాలని సూచించింది. ఇందులో భాగంగా ఇప్పటికే మండలానికి ఒక గ్రామాన్ని జిల్లా రెవెన్యూ అధికారులు గుర్తించారు.

జిల్లాలో గుర్తించిన రెవెన్యూ గ్రామాలు

మండలం గ్రామం
కురుపాం గోటికుప్ప
గుమ్మలక్ష్మీపురం కుడ్డతాళ్లవలస
జియ్యమ్మవలస అక్కందొరవలస
కొమరాడ చీడిపల్లి
గరుగుబిల్లి సీతానగరం
పార్వతీపురం నిశ్శణ్ముకపురం
బలిజిపేట శివరాంపురం
సాలూరు కూర్మరాజుపేట
పాచిపెంట మిర్తివలస
మెంటాడ గురమ్మవలస
మక్కువ బంగారువలస
బొబ్బిలి జయరంగరాయపురం
రామభద్రపురం మర్రివలస
బాడంగి రామచంద్రపురం
తెర్లాం పూనువలస
మెరకముడిదాం వాసుదేవపురం
గరివిడి విజయరాంపురం
చీపురుపల్లి అర్దివలస
గుర్ల గొర్లె సీతారాంపురం
దత్తిరాజేరు లక్ష్మీపురం
గజపతినగరం టి.ఎస్‌.కె.పురం
బొండపల్లి ఐ.వి.అగ్రహారం
గంట్యాడ జగ్గాపురం
నెల్లిమర్ల పూతికపేట
పూసపాటిరేగ పాలంకి
డెంకాడ చిట్టిగుంకలాం
భోగాపురం కోటభోగాపురం
విజయనగరం సిర్యాలపేట
ఎస్‌.కోట మామిడిపల్లి
వేపాడ జమ్మాదేవిపేట
ఎల్‌.కోట కూర్మవరం
కొత్తవలస రాయపురాజుపేట
జామి సోమయాజులపాలెం

ఈనెల 16వ తేదీలోగా రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించి ఆరు అంశాలకు సంబంధించి రైతులు నుంచి సమస్యలు తెలుసుకుంటారు. దీనికోసం ఆరు రకాల నమూనా పత్రాలు అధికారులు డిజైన్‌ చేసి పంపించారు. వాటి ఆధారంగా రైతులు నుంచి వివరాలు సేకరిస్తారు. ఇలా సేకరించిన వివరాలతో మండల తహసీల్దారు, డీటీ, గ్రామ రెవెన్యూ అధికారులతో ఈనెల 17వ తేదిన కలెక్టరేట్‌లో అధికారులు సమావేశం నిర్వహిస్తారు. జిల్లాలో ఉన్న 34 రెవెన్యూ గ్రామాలు నుంచి వచ్చిన వివరాలతో ఆరు అంశాలపై ఒక నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదికలో అంశాలు ఈ నెల 20వ తేదీన విజయనగరంలో రెవెన్యూ అధికారులతో రెవెన్యూ మంత్రి నిర్వహించే సదస్సులో వివరిస్తారు. దీనికి పరిష్కార మార్గాలు గురించి చర్చిస్తారు. ఇలా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి వచ్చిన లోపాలు ఆధారంగా రికార్డులు ఫ్యూరిఫికేషన్‌పై దృష్టిసారిస్తారు.

పర్యవేక్షణకు ప్రత్యేకాధికారుల నియామకం
గ్రామ సభలు, భూమి రికార్డుల ఫ్యూరిఫికేషన్‌ కోసం నియోజకవర్గానికి ఒక ప్రత్యేకాధికారిని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ నియమించారు. జిల్లాలో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ఈ బాధ్యతలు అప్పగించారు. వీరు గ్రామాల్లో జరుగుతున్న సభలు తీరును పర్యవేక్షించి జిల్లా అధికారులకు నివేదిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement