స్పీకర్‌ కోడెల సైకిల్‌ ర్యాలీలో అపశ్రుతి

kodela siva prasada rao injured in cycle rally at guntur - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్  కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్‌ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోయారు. దీంతో ఆయన తలకు స్పల్పగాయమైంది. ఈ క్రమంలో స్పీకర్‌కు ప్రథమచికిత్స చేశారు. అనంతరం ఆయన సైకిల్‌ యాత్రను ప్రారంభించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టనున్న దీక్షకు సంఘీభావంగా కోడెల శివప్రసాదరావు గురువారం సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. నర్సారావుపేట పట్టణంలోని స్వగృహం నుంచి యాత్ర ప్రారంభించిన ఆయన కోటప్పకొండకు బయలుదేరారు. నాలుగు గంటల్లో 15 కిలో మీటర్ల మేర ఆయన సైకిల్ యాత్ర చేశారు. అనంతరం కోడెల మాట్లాడుతూ.. ‘101 డిగ్రీల జ్వరం, 42 డిగ్రీల ఎండవేడి ఉన్నా కార్యకర్తల ఉత్సాహంతోనే సైకిల్ యాత్ర చేశాను. నా సైకిల్ యాత్ర బాబుకు సంఘీబావం కాదు. బాబుకు ఐదు కోట్ల మంది ప్రజల సంఘీభావం ఉంది. ఐదు కోట్ల ఆంధ్రుల్లో స్పీకర్ కూడా ఒకరు. కేంద్రం తీరుపై నిరసనగానే సైకిల్ యాత్ర చేశాను. దున్నపోతు మీద వాన పడిన చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. 

ఎన్నికల సమయంలో పోటీపడి  హమీల వర్షం కురిపించారు. నాలుగేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ ఊరించారు. కేంద్రం మత్తు దించాలంటే ఆంధ్రుల సత్తా ఏంటో చూపించాల్సిందే. అది పోరాటాలు, ఉద్యమాల ద్వారానే సాధ్యం. తెలుగోడి సత్తా ఏంటో కేంద్రానికి తెలిపే సమయం ఆసన్నమైంది. కుల, మత పార్టీలను పక్కన పెట్టి అందురూ కలసికట్టుగా ఉద్యమించాలి. స్పీకర్‌గా నేను రాజకీయాలు మాట్లాడకూడదు. కానీ ఇప్పడు కూడా నేను రాష్ట్రం కోసం నోరెత్తకపోతే ప్రయోజనం ఉండదు. నేను ఐదు కోట్ల ఆంధ్రులలో ఒకడిగా మాట్లాడుతున్నాను. ఆంధ్రులకు చేసిన అన్యాయంపై విదేశాలలో కూడా ప్రధానికి నిరసన వ్యక్తమౌతుంది. కేంద్రం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుంది.’  అని ఆయన తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top