శ్రీవారిని దర్శించుకున్న కేసీఆర్‌ 

KCR who visited Tirumala Srivaru - Sakshi

టీటీడీ అతిథి మర్యాదలపై కేసీఆర్‌ సంతృప్తి

తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎదగాలని ఆకాంక్ష 

తిరుమల/ తిరుమల రూరల్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు, కుటుంబ సభ్యులు సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించారు. వారికి ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, తిరుమల జేఈఓ కె.ఎస్‌.శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓలు తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని కేసీఆర్‌కు అందించారు. టీటీడీ అతిథి మర్యాదలపై కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి శ్రీవారిని దర్శించుకున్నారు.

కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ప్రజల శ్రేయస్సు కోసం శ్రీవారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు అగ్రగామిగా ఎదగాలని ప్రార్థించానన్నారు. రెండోసారి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం శ్రీకృష్ణా గెస్ట్‌ హౌస్‌కు చేరుకుని అల్పాహారం తీసుకుని, అమ్మవారి దర్శనార్థం తిరుచానూరుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, టీటీడీ చైర్మన్‌ పుట్టాసుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు. కాగా, సోమవారం తిరుమల శ్రీవారు, పద్మావతీ అమ్మవారి దర్శనానంతరం తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంటలోని ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంటికి  తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. మంగళవాయిద్యాలు, మేళతాళాలతో చెవిరెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు.

శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి మేల్‌చాట్‌ వస్త్రాలను బహూకరించారు. అనంతరం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు చెవిరెడ్డి ఇంట్లో ఆత్మీయ ఆతిథ్యాన్ని స్వీకరించారు. చెవిరెడ్డి కుటుంబ సభ్యులను పేరుపేరునా పలకరించారు. అనంతరం ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌కు నియోజకవర్గానికి చెందిన నేతలను, కార్యకర్తలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top