దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు అనుచితమని..
సాక్షి, హైదరాబాద్ : దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు అనుచితమని.. ఆయన వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు.
వైఎస్ ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన నాయకుడని.. ఆయన పథకాలు రాష్ట్రంలో ప్రతీ గడపకు వెళ్లినా కనిపిస్తాయని గట్టు గుర్తుచేశారు. కేసీఆర్ మానవత్వం లేని వ్యక్తిగా మాట్లాడారని.. ఉన్మాదిలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆయన భాష మార్చుకోవాలని గట్టు కోరారు. సోమవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సకల జనభేరీలో వైఎస్ మరణంపై హీనంగా మాట్లాడిన కేసీఆర్.. వైఎస్ మరణం తరువాత రవీంద్రభారతిలో జరిగిన సంతాపసభలో ‘రాజశేఖరరెడ్డిగారి మరణం తరువాత రాష్ట్ర ప్రజలందరి హృదయాలు ఘోషిస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తంచేసిన విషయాన్ని గట్టు గుర్తుచేశారు. భేరీ సభలో కేసీఆర్ ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడారని తప్పుపట్టారు.
పది జిల్లాల తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు కేసీఆర్‌ను వ్యతిరేకిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో టీఆర్‌ఎస్ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు బయటకు వచ్చారని, ఎంపీ విజయశాంతి సైతం పార్టీ వీడేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. దీంతో కేసీఆర్ తిట్ల పురాణం మొదలుపెట్టి తెలంగాణలో తన హీరోయిజం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మూడున్నర జిల్లాల్లో ఉన్న పార్టీని పది జిల్లాల్లో విస్తరించుకోవాలన్న తాపత్రయమే కేసీఆర్‌దని గట్టు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కోలేక కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ వంటి పార్టీలు ఒక్కటై పనిచేస్తున్నాయని విమర్శించారు.