పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 25న జరగనున్న రాష్ట్రస్థాయి కాపు రుణమేళా కార్యక్రమంలో
25న ఏలూరులో కాపు రుణమేళా
రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ
గుంటూరు వెస్ట్: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఈ నెల 25న జరగనున్న రాష్ట్రస్థాయి కాపు రుణమేళా కార్యక్రమంలో ప్రతి లబ్ధిదారుడూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ కోరారు. గుంటూరులోని ఎస్సీ కార్పొరేషన్ మీటింగ్ హాలులో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కులాలకు 50శాతం సబ్సిడీ ద్వారా లక్ష రూపాయల వరకు రాయితీ కల్పించి మొత్తం యూనిట్ విలువ రూ.2 లక్షలుగా నిర్ణయించి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,65,608 దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా వచ్చాయని చెప్పారు. దరఖాస్తులను ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాల ద్వారా పరిశీలించి అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికీ రుణాలు మంజూరు చేస్తుందని ఆయన వెల్లడించారు.