కాపు కార్పొరేషన్ రుణాల కోసం జిల్లాలోని ఆ సామాజికవర్గ నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు.
కాపు కార్పొరేషన్ రుణాల కోసం క్యూ కడుతున్న నిరుద్యోగులుజిల్లావ్యాప్తంగా 44,437
దరఖాస్తుల దాఖలు మరిన్ని దాఖలయ్యే చాన్స్
కిటకిటలాడుతున్న మీ-సేవ,
ఎంపీడీవో కార్యాలయాలు20 వరకూ గడువు
తొలివిడత మంజూరైనయూనిట్లు 2,462 మాత్రమే
ఎన్నికల వేళ చంద్రబాబు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇప్పటివరకూ అమలుకు నోచలేదు. కనీసం రుణమైనా దక్కితే.. సొంతకాళ్లపై నిలబడి.. జీవనరథాన్ని నడపవచ్చని కాపు యువత ఆశ పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా.. కాపు కార్పొరేషన్ రుణాల కోసం.. ఆ సామాజికవర్గానికి చెందిన నిరుద్యోగులు.. దరఖాస్తులు పట్టుకుని కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. రుణాల మంజూరుపై రాష్ర్ట ప్రభుత్వం ఇంతవరకూ బ్యాంకులకు ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల చేయకపోయినా.. కొండంత ఆశతో దరఖాస్తు చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కాపు కార్పొరేషన్ రుణాల కోసం జిల్లాలోని ఆ సామాజికవర్గ నిరుద్యోగులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో దరఖాస్తుకు సుమా రు రూ.400 ఖర్చవుతున్నా.. ఆన్‌లైన్‌తో పాటు, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు చేయాల్సి వస్తున్నా.. మీ- సేవ కేంద్రాలు, ఆయా కార్యాలయాల ముందు బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూలో నిలబడి దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో మంగళవారం నాటికి 44,437 దరఖాస్తులు అధికారులకు అందాయి. ఈ నెల 20 వరకూ గడువుండగా, ఈ నాలుగు రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముంది.
అత్తెసరుగా నిధులు
దరఖాస్తులు వేలల్లో ఉండగా.. కాపు రుణాలకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం జిల్లాకు అత్తెసరుగానే నిధులు ఇస్తోంది. తొలివిడతగా జిల్లాకు 2,462 యూనిట్లు మాత్రమే మంజూరు చేసింది. కాపు కార్పొరేషన్‌కు ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేయగా, ఇందులో జిల్లాకు రూ.7.38 కోట్లు మాత్రమే దక్కనున్నా యి. సబ్సిడీతో కలిపి రూ.14.76 కోట్ల మేర రుణ సహాయం అందనుంది. వస్తున్న దరఖాస్తులతో పోలిస్తే ఈ నిధు లు ఏ మూలకూ చాలవు. కాపు కార్పొరేషన్‌కు మరో రూ.500 కోట్లు కేటాయిస్తామని, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష విరమణ సందర్భంగా రాష్ర్ట మంత్రి కె.అచ్చెన్నాయుడు ప్రకటించారు. కానీ దీనిపై ఇప్పటివరకూ ఉత్తర్వులేవీ రాలేదు. యూనిట్ విలువనుబట్టి రూ.15 వేల నుంచి రూ.2 లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో రుణాలివ్వాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రుణా సహాయం అందిస్తామన్న సీఎం చంద్రబాబు హామీని సంపూర్ణంగా అమలు చేయాలంటే కనీసం రూ.200 కోట్ల సబ్సిడీ నిధులను ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అంతమేర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా? లేక ఏదో ఒక సాకుతో వడపోసి దరఖాస్తుల సంఖ్యను తగ్గించేస్తుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. అధికారులు మాత్రం మిగిలిన వారందరికీ మలివిడతలో రుణాలు మంజూరు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు రుణ సహాయం పొందేందుకు బ్యాంకుల సమ్మతి కూడా అవసరం. అక్కడ నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టినా రుణాలు దక్కకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.