రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం అత్యంత రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది.
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బుధవారం అత్యంత రహస్యంగా భేటీ అయినట్టు తెలిసింది. అధిష్టానం పిలుపు మేరకే ఢిల్లీ వచ్చిన కన్నా సాయంత్రం 6 గంటల తర్వాత సోనియాను ఆమె నివాసంలో కలిసి 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ముసాయిదా బిల్లుపై ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను అధినేత్రికి కన్నా వివరించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా అత్యంత గౌరవ ప్రదంగా అసెంబ్లీ నుంచి బిల్లు బయటకు వచ్చేలా సహకారం అందించాలని, మెజారిటీ సభ్యులచే బిల్లుకు మద్దతు తెలిపేలా చూడాలని సోనియా సూచించారు.
అనంతరం రాష్ర్టపతి తోనూ భేటీ అయిన కన్నా అసెంబ్లీలో జరుగుతున్న ప్రక్రియను వివరించినట్టు తెలిసింది. భేటీ ముగిసిన వెంటనే కన్నా హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు. గతంలో ఒకసారి కిరణ్‌ను మారుస్తారని విస్తృతంగా ప్రచారం జరిగిన తరుణంలో కన్నా లక్ష్మినారాయణ వెళ్లి సోనియాను కలిసి రావడం అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం కూడా ఢిల్లీలో కన్నా కదలికలపై ఆరా తీసినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు కన్నా స్పందిస్తూ... తనకు, సీఎం కిరణ్‌కు మధ్య అంతరాన్ని పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తనకు ముఖ్యమంత్రి కావాలనే ఆశేమీ లేదని పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం గురువారం ఢిల్లీ వెళ్లనున్న తరుణంలో కన్నా ఆకస్మాత్తుగా బుధవారమే ఢిల్లీ వెళ్లి సోనియా, ప్రణబ్‌లను కలవడం పార్టీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.