శాఖలు, విభాగాలవారీగా రెండు రాష్ట్రాలకు పోస్టులు నోటిఫై | Kamalnathan committee declares to distributed cadre posts | Sakshi
Sakshi News home page

శాఖలు, విభాగాలవారీగా రెండు రాష్ట్రాలకు పోస్టులు నోటిఫై

Nov 13 2014 1:43 AM | Updated on Jul 29 2019 5:59 PM

శాఖలు, విభాగాలవారీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను పంపిణీ చేస్తూ నోటిఫై చేయాలని కమలనాథన్‌కమిటీ నిర్ణయించింది.

* కమలనాథన్‌కమిటీ నిర్ణయం  
* ఈ వారం నుంచే ప్రారంభం
* 30 శాఖల సమాచారం వచ్చింది
* ఈ ఏడాది జూన్ 1 నాటికున్న ఖాళీలపై సమాచారంకోసం ఎదురుచూపులు

 
 సాక్షి, హైదరాబాద్:
శాఖలు, విభాగాలవారీగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు రాష్ర్ట స్థాయి కేడర్ పోస్టులను పంపిణీ చేస్తూ నోటిఫై చేయాలని కమలనాథన్‌కమిటీ నిర్ణయించింది. ఒకేసారి అన్ని శాఖల్లోని, విభాగాల్లోని పోస్టుల పంపిణీ చేయకుండా ఒకదాని వెంట ఒకటిగా ఒక శాఖలోని రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. శాఖలవారీగా పోస్టుల పంపిణీపై వారంలోనే నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రాష్ట్ర పునర్విభజన విభాగం కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే 30 శాఖలకు చెందిన పోస్టుల సమాచారం అందిందని, వాటిలో పొరపాట్లు, తప్పులేమైనా ఉన్నాయా అనేదానిపై అధికారులతో పరిశీలన చేయిస్తున్నామని ఆయన బుధవారం తనను కలిసిన సాక్షి ప్రతినిధికి తెలిపారు.
 
  పరిశీలన పూర్తవగానే రెండు రాష్ట్రాలకు చెందిన శాఖాధిపతులతో సంతకాలు చేయించాక ఇరు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులో తెలియజేస్తూ ప్రొవిజనల్ నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. దానిపై అభ్యంతరాలకు సమయమిస్తారు. అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్నాక తుది పోస్టుల కేటాయింపు చేస్తారు. మరోవైపు రాష్ట్రం విడిపోవడానికి ముందురోజు అంటే ఈ ఏడాది జూన్ 1 నాటికి ఏ శాఖలో, ఏ విభాగంలో, ఏ కేడర్‌లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే అంశంపై సంబంధిత శాఖలు సరిగా సమాచారం ఇవ్వలేకపోతున్నాయని ప్రేమచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమాచారాన్ని రాబట్టడంలోనే సమయం పడుతోందన్నారు. కాగా ఒకవైపు పోస్టుల పంపిణీ చేస్తూనే మరోవైపు ఆయా శాఖల్లోని ఉద్యోగులకు ఆప్షన్ పత్రాలను అందచేస్తామని, సమాంతరంగా ఆప్షన్ల సమాచారాన్ని కూడా రాబడుతూ వీలైనంత త్వరగా ఇరురాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ పూర్తి చేయాలనేది కమలనాథన్ కమిటీ అభిప్రాయంగా ఉందని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement