ప్రజా సేవ.. పోలీసు సంక్షేమం | Kadapa Superintendent of Police Attada Babujee special interview | Sakshi
Sakshi News home page

ప్రజా సేవ.. పోలీసు సంక్షేమం

Dec 31 2017 1:26 PM | Updated on Oct 22 2018 2:02 PM

 Kadapa Superintendent of Police  Attada Babujee special interview - Sakshi

సాక్షి, కడప : సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ.. ప్రజా సేవ.. పోలీసు సంక్షేమం.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట.. ఇలా వివిధ అంశాల్లో పోలీసు యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేసి సత్ఫలితాలు సాధిస్తోందని జిల్లా ఎస్పీ బాబూజీ అట్టాడ పేర్కొన్నారు.  కడప పోలీసు పెరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మీడియా సమావేశంలో ఈ ఏడాది సాధించిన పలు విజయాలను ఆయన  వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట..
జిల్లాలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే 1510 మందిని అరెస్టు చేసి  23 టన్నుల దుంగలు, 74 వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. 116 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదు, 22 మంది అంతర్జాతీయ, అంతర్‌ రాష్ట్ర స్మగ్లర్లపై పీడీ చట్టం ప్రయోగించాం.

ఫ్యాక్షన్‌ కనుమరుగు
జిల్లాలో 71 ఫ్యాక్షన్‌ గ్రామాలు ఉన్నాయి. నిత్యం గ్రామస్తులకు కౌన్సెలింగ్‌ ఇవ్వడం..పల్లెనిద్ర చేపట్టడం...ఫ్యాక్షన్‌ గ్రామాల్లో గట్టి నిఘా, బైండోవర్‌ కేసులు, గ్రామ సభలు, వాహనాల తనిఖీ, కార్బన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌.. పోలీసుల ద్వారా 90 కళాజాతా కార్యక్రమాలు నిర్వహించడం.. 13 చోట్ల పోలీసు పికెట్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఫ్యాక్షన్‌ హత్యలు తగ్గిపోయాయి.

రోడ్డు ప్రమాదాలను తగ్గించాం
జిల్లా రవాణాశాఖతో కలిపి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు నిర్వహించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగాం. 2016లో 2030 మంది క్షతగాత్రులుంటే 2017లో 1666 మంది ఉన్నారు. వాహనాల తనిఖీలో రికార్డు స్థాయిలో 2,49,791 మందికి జరిమానాలు విధించాం.  

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో కేసుల నమోదు. శిక్షలు ఖరారు. 
 రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చేపడుతున్నాం. 2016లో 1701 కేసులు నమోదు కాగా, 2017లో 5512 కేసులు నమోదయ్యాయి. మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిలో గత ఏడాది 182 మందికి శిక్ష పడితే 2017లో 362 మందికి శిక్ష పడింది.

పరివర్తనతో మట్కా నిర్మూలన
మట్కా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతున్న వారిని రక్షించేందుకే ప్రత్యేకంగా పరివర్తన లాంటి కార్యక్రమం చేపట్టాం.  గత ఏడాది 239 కేసులు నమోదైతే ఈసారి 106కు తగ్గాయి. పరివర్తన పేరుతో 744 కార్యక్రమాలు నిర్వహించి 25 వేల మందిని కలిసి మార్పు తీసుకు వచ్చేందుకు కృషి చేశాం.

లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో జిల్లా ఫస్ట్‌
లోక్‌ అదాలత్‌ కేసుల పరిష్కారంలో జిల్లా పోలీసుశాఖ  కృషి ఫలితంగా రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 2016లో కేవలం 715 కేసులు మాత్రమే పరిష్కారం కాగా, 2017లో 4042 కేసులు పరిష్కరించి రికార్డు సృష్టించాం.

అసాంఘిక కార్యకలాపాలపై దాడులు
జిల్లాలో మట్కా, క్రికెట్‌ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, కోడిపందేలపై విస్తృతంగా దాడులు నిర్వహించాం. 2016లో రూ.1.72 కోట్లు స్వాధీనం చేసుకోగా, 2017లో రూ. 3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నాం.

గల్ఫ్‌ బాధితులకు అండగా బంధం
ఉపాధి నిమిత్తం గల్ఫ్‌కు వెళ్లి అక్కడి యజమానులు, ఏజెంట్ల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రత్యేకంగా బంధం యాప్‌ను రూపొందించాం. జిల్లాలోని 10078 కుటుంబాలు బంధంలో నమోదయ్యాయి. 33 మంది మహిళలను గల్ఫ్‌ నుంచి విముక్తి కల్పించాం.

ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగాలు, ఉపాధి
రాష్ట్రంలోనే జిల్లాలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్‌జెండర్ల సమస్యలను మానవీయ కోణంలో చూశాం. అందుకు తగ్గట్టుగా వారికి ఆధార్, రేషన్‌కార్డులు, బ్యాంకు అకౌంట్లు, డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఎస్పీ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement