జస్ట్..ఇచ్చేశారు..! | just given lands for private organisations | Sakshi
Sakshi News home page

జస్ట్..ఇచ్చేశారు..!

Feb 21 2014 4:10 AM | Updated on Sep 2 2017 3:55 AM

అధికారుల అవినీతి, రాజకీయ నేతల ఒత్తిళ్ల ఫ లితంగా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి.

నిబంధనలు హుళక్కి. ఉన్నతాధికారుల ఆదేశాలూ బేఖాతర్. తమకు నచ్చితే చాలు రూలు,గీలూ జాన్తానై అంటూ ఎవరికైనా కట్టబెట్టేస్తారు. ఇదీ నాగకర్నూల్ నడిబొడ్డున ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీకి చెందిన స్థలానికి పట్టిన దుర్గతి. సంబంధిత అధికారులు, రాజకీయ పెద్దలూ కలిసి సాగించిన వ్యవహారం.
 
 నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: అధికారుల అవినీతి, రాజకీయ నేతల ఒత్తిళ్ల ఫ లితంగా ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. నాగర్‌కర్నూల్ నడిబొడ్డున కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారు. ప్రభుత్వం తిరస్కరించినా తప్పుడు తేదీలతో లోపాయికా రి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తప్పుడు డాక్యుమెం ట్లతో లావాదేవీలు అధికారుల అవినీతి బరితెగింపునకు నిదర్శనంగా మారింది. వివరాల్లోకెళ్తే.. నాగర్‌కర్నూల్ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ప్రధాన రహదారిని అనుసరించి డీసీఎంఎస్‌కు స్థలం ఉంది.
 
 నిరుపయోగంగా ఉన్న ఈ స్థలాన్ని వినియోగంలోకి తెచ్చి డీసీఎంఎస్‌కు ఆదా యం కల్పిస్తామని బీఓటీ(బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్ధతిన నిర్మాణాలకు అనుమతిచ్చారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నేతృత్వంలో ఈ ప్రక్రియ కొనసాగిం ది. ఇందులో సాయిగార్డెన్స్ పేర నిర్మించిన ఫంక్షన్‌హాల్ ఒకటి. దీని నిర్మాణానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులతో డీసీఎంఎస్ అధికారులు కుదుర్చుకున్న ఒప్పందాలు, ఆ తర్వాత జరిగిన మార్పిళ్లు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా ఉన్నాయి.
 
 పట్టణంలోని డీసీఎంఎస్ స్థలంలో ప్రధాన రహదారి పక్కన నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ వెనక వైపు, పంచాయతీ కార్యాలయం ముందు బీఓటీ పద్ధతిన ఫంక్షన్‌హాల్ నిర్మాణం తలపెట్టి టెండర్లు పిలిచారు.
 
  ముగ్గురు టెండర్లు దాఖలు చేయగా, ఇందులో వాడకంటి సురేష్ అనే వ్యక్తికి  దక్కింది. డీసీఎంఎస్ స్థలాల్లో బీఓటీ పద్ధతిన నిర్మాణాలపై ఎమ్మెల్యే జనార్దన్‌రెడ్డి ‘సహకార’ కమిషనర్,రిజిస్ట్రార్‌కు  ఫిర్యాదు చేయడంతో వీటిపై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఫంక్షన్‌హాల్‌కు సంబంధించి కొన్ని ఒప్పంద పత్రాలు వెలుగుచూశాయి.
 
 ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
 నాగర్‌కర్నూల్‌లో డీసీఎంఎస్ స్థలంలో ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి అనుమతించాలంటూ కోఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు డీసీఎంఎస్ ప్రతి పాదనలు పంపింది. వాటిని తిరస్కరిస్తూ జనవరి 16, 2010న కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. వాటిని ఇక్కడి అధికారులు తుంగలో తొక్కారు. అనుమతి జనవరి 16,2010న తిరస్కరించగా, వాడకంటి సురేష్ అనే వ్యక్తికి జూన్22, 2010న సర్వేనం.331, 334, 335లో 5313 చదరపు గజాలు బీఓటీ పద్ధతిన నిర్మాణానికి అనుమతిస్తూ  రిజిస్టర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.  ప్రభుత్వం తిరస్కరించిన  ఐదునెలలకు బీఓటీ నిర్మాణానికి అగ్రిమెంట్ చేసుకున్న డీసీఎంఎస్ ఆ తర్వాత మరో నెలరోజులకు తాపీగా కార్యవర్గ సమావేశంలో ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి అనుమతిస్తూ తీర్మానం చేసుకోవడం అధికారుల, ప్రజాప్రతినిధుల బరితెగింపునకు పరాకాష్ట.
 రోడ్డు, క్లబ్ స్థలం ఆక్రమణ
 ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా బీఓటీ పద్ధతిన ఫంక్షన్‌హాల్ నిర్మాణం కాగా ఫంక్షన్‌హాల్ నిర్మాణం చేసిన వ్యక్తి మరో అడుగు ముందుకు వేశారు. డీసీఎంఎస్ స్థలంతోపాటు పక్కనే ఉన్న రిక్రియేషన్ క్లబ్ (ప్రస్తుతం టీవీ రిలే స్టేషన్) స్థలం దాదాపు వెయ్యి గజాలు ఆక్రమించి నిర్మాణం చేపట్టారు. దాదాపు రూ. పన్నెండు కోట్ల విలువైన  స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా పొందిన సురేష్  మరో రూ. రెండుకోట్ల విలువైన క్లబ్, రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించి నిర్మాణాలు చేసుకున్నారు. పర్యవేక్షించాల్సిన నగర పంచాయతీ కూడా ఈ ఆక్రమణ గురించి కిమ్మనడం లేదు.
 
 మూసివేయాలన్న
 ఆదేశాలు బేఖాతరు
 నాగర్‌కర్నూల్‌లోని డీసీఎంఎస్ స్థలం బీఓటీ పద్ధతిన ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంలో  అవకతవకలు జరిగాయంటూ నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి సెప్టెంబర్ 10, 2012న సహకార కమిషనర్, రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్‌ని నియామక అధికారిగా నియమించారు.
 
  కొన్ని అవకతవకలు ఉన్నాయని గుర్తించి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే ఈనెల ఐదున విచారణ కోసం హాజరు కావాల్సిందిగా ఫంక్షన్‌హాల్ నిర్మించిన వి.సురేష్‌కు గతనెల 20న డీసీఓ ఎం.ప్రసాదరావు సమన్లు పంపారు.  విచారణ పూర్తిచేసి తుది నిర్ణయం తీసుకునే వరకు ఫంక్షన్ హాల్ మూసేయాలని, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇవేవీ డీసీఎంఎస్ అధికారులు, ఫంక్షన్‌హాల్ యజమాని మాత్రం పట్టించుకోలేదు. మరోసారి ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కేశారు. ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి.
 
 నోటీసులు జారీ చేస్తాం
 సాయిగార్డెన్స్ నిర్మాణం డీసీఎంఎస్ స్థలం కన్నా అధికంగా ఉంది. రోడ్డు, క్లబ్ స్థలం ఆక్రమించి నిర్మించారు. సంజాయిషీ నోటీసు జారీ చేస్తున్నాం.
 -రవికాంత్, కమిషనర్,
 
 నగర పంచాయతీ, నాగర్‌కర్నూల్.
 
  మూసి వేయించే బాధ్యత కమిటీదే
  నిర్మాణం అవకతవకలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరుపుతున్నాం. విచారణ సమయంలో ఫంక్షన్‌హాల్ మూసి వేయాలంటూ నిర్వాహకులకు సమన్లు జారీ చేశా. కమిటీకి కూడా సమాచారమిచ్చా. అయినా  మూసి వేయించలేదు. ఆ బాధ్యత కమిటీదే. విచారణ వరకే నాకు అధికారాలు ఉన్నాయి.
 ఎం.ప్రసాదరావు, విచారణాధికారి
 డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement