ఉద్యోగం కావాలా నాయనా... | jobs for sale | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కావాలా నాయనా...

Mar 5 2014 2:46 AM | Updated on Sep 2 2017 4:21 AM

ఉద్యోగం కావాలా నాయనా...

ఉద్యోగం కావాలా నాయనా...

లడ్డూ కావాలా నాయనా..అని ఇటీవల టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనల తరహాలోనే ఏ చిన్న ఉద్యోగ ప్రకటన వెలువడినా దళారులు రంగంలోకి దిగిపోతున్నారు.

 విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: లడ్డూ కావాలా నాయనా..అని ఇటీవల టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనల తరహాలోనే  ఏ చిన్న  ఉద్యోగ ప్రకటన వెలువడినా దళారులు రంగంలోకి దిగిపోతున్నారు. విద్యుత్ శాఖలో  ఖాళీగా ఉన్న   జేఎల్‌ఎం పోస్టుల భర్తీ మళ్లీ తెరపైకి రావడంతో  ఆ శాఖ ఉద్యోగులతో పాటు  అధికార పార్టీ అండదండలు ఉన్న చోటామోటా నేతలు పండగ చేసుకుంటున్నారు.  ఈ పోస్టులకు విద్యార్హతలు పెద్దగా అవసరం లేకపోవడం, వేతనం రూ.15వేల వరకు ఉండడంతో  విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
 
   విద్యుత్ సబ్‌స్టేషన్లలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన  పని చేస్తున్న ఆపరేటర్లకు ఈ పోస్టుల్లో  వెయిటేజీ తగ్గించడంతో సాధారణ అభ్యర్థుల చూపు ఈ పోస్టులపై పడింది.  దీంతో ఆ శాఖలోని కొందరు ఉద్యోగులు, నేతలు తమ పవర్ చూపి  ఉద్యోగాలు ఇప్పిస్తామని   అభ్యర్థులను మభ్యపెడుతున్నట్లు సమాచారం.   ఈ నేపథ్యంలోనే ఒక్కో పోస్టుకు  లక్షల్లో బేరసారాలు సాగిస్తున్నారు.
 
 ఏప్రిల్ 1వరకు దరఖాస్తుల స్వీకరణ...
 జిల్లాలో 127 జూనియర్ లైన్‌మెన్, ఎనిమిది ఎల్డీసీ పోస్టుల భర్తీకి  సంబంధించి 2011లో  విద్యుత్ శాఖ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పట్లో సుమారు 1400 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక వర్గాల సమాచారం. అయితే అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. తాజాగా మళ్లీ విద్యుత్ శాఖ అధికారులు పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలోనే  ఈ పోస్టుల భర్తీపై  విద్యుత్ శాఖ పెద్దగా ప్రచారం చేయకుండానే అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడం గమనార్హం. తాజాగా గతంలో  దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 1వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయితే నియామక ప్రక్రియలో   సబ్‌స్టేషన్లలో కాంట్రాక్ట్ విధానంలో  పని చేస్తున్న ఆపరేటర్లకు 40 శాతం ఉన్న వెయిటేజీని 20 శాతానికి తగ్గించడంతో   ఈ ఉద్యోగాలపై  సాధారణ అభ్యర్థుల కన్నుపడడంతో ఈ పోస్టులకు దళారులు ఎక్కువయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
 పోస్టుకు రూ.లక్షల్లో బేరసారాలు
  ఇదిలా ఉండగా జేఎల్‌ఎం పోస్టులకు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరసారాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్ కోర్సులు చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  సబ్‌స్టేషన్లలో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఏడాదికి కొన్ని మార్కులు చొప్పున వెయిటేజీ  ఇవ్వనున్నారు. ఈ విషయాలు తెలుసుకున్న దళారులు  అభ్యర్థుల నుంచి డబ్బు దండుకునేందుకు  తమదైన శైలిలో ఒప్పందాలు చేసుకుంటున్నారు.  దీంట్లో విద్యుత్ శాఖ అధికారులకు  అధికార పార్టీ అండదండలు ఉన్న నేతలు జతకలిసినట్లు సమాచారం.  ఇందులో భాగంగా అభ్యర్థులు ముందుగా కొంత మొత్తం చెల్లించి, మిగిలిన మొత్తాన్ని  పోస్టు వచ్చిన తర్వాత చెల్లించేలా ప్రాంసరీ నోట్లు రాయిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పలుకు బడితో  సబ్‌స్టేషన్లలో  కాంట్రాక్ట్  ఉద్యోగాలు పొందిన వారికి ఈ పోస్టుల భర్తీకి కావాల్సిన  విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు లేకపోతే నకిలీవి  సంపాదించిపెడతామని చెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.   ఇందుకు అదనంగా  ఖర్చవుతుందని  దరఖాస్తు దాఖలు చేసినప్పటి నుంచి విధుల్లో చేరేంత వరకు అంతా తమదే బాధ్యత అని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది.
 
 పారదర్శకంగానే నియామకాలు: ఎస్‌ఈ
 ఇదే విషయమై విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ దత్తి. సత్యనారాయణ  వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా..జేఎల్‌ఎం పోస్టుల భర్తీ ప్రక్రియ  అంతా పారదర్శ కంగా జరుగుతుందన్నారు.  సబ్‌స్టేషన్‌లో పని చేసే కాంట్రాక్ట్  సిబ్బందికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అభ్యర్థి స్తంభం ఎక్కడం  ఈ నియామకానికి కీలకమని,  ఈ పరీక్షను వీడియో తీయిస్తామని చెప్పారు. నెలాఖరున  ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. దళారుల మాటలు నమ్మొద్దని  ఎస్‌ఈ స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement