జేఈఈ మెయిన్స్‌ అంతా ఆన్‌లైన్‌

JEE Mains online all in online - Sakshi

పేపర్‌–2లో డ్రాయింగ్‌ వరకే పెన్, పేపర్‌

తక్కినవన్నీ కంప్యూటరాధారిత పరీక్షలే

ఆంధ్రప్రదేశ్‌లో 19, తెలంగాణలో 7 కేంద్రాల ఏర్పాటు

దేశవ్యాప్తంగా 1.5 లక్షల కామన్‌ సర్వీస్‌ కేంద్రాలు

ఆన్‌లైన్లో టెస్టు ప్రాక్టీస్‌ సెంటర్‌  

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆప్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (జేఈఈ) మెయిన్‌ ఈసారి పూర్తిగా ఆన్‌లైన్లోనే నిర్వహించనున్నారు. బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన జేఈఈ మెయిన్‌లోని పేపర్‌–1 కంప్యూటరాధారిత పరీక్షగా మాత్రమే ఉంటుంది. మాథ్స్, ఫిజిక్సు, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నలుంటాయి. 3 సబ్జెక్టులకు సమాన వెయిటేజీలో ప్రశ్నలు ఇస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పేపర్‌2లో పార్టు 1 మేథమెటిక్స్, పేపర్‌2 యాప్టిట్యూడ్‌లు రెండు కంప్యూటరాధారిత పరీక్షలుగానే ఉంటాయి. డ్రాయింగ్‌ యాప్టిట్యూడ్‌ టెస్టు మాత్రం పెన్, పేపర్‌ ఆధారంగా ఆఫ్‌లైన్లో ఉంటుంది. జేఈఈ మెయిన్‌ పరీక్షల నిర్వహణను కొత్తగా ఏర్పాటు చేసిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా చేపడుతున్న సంగతి తెలిసిందే.

జనవరి, ఏప్రిల్‌లో ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. జనవరిలో జరిగే పరీక్షకు సంబంధించి ఈనెల 1వ తేదీనుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అక్టోబర్‌ 1 వరకు అవకాశముంది. పరీక్షలు రోజుకు రెండు షిఫ్టులలో ఉదయం 9.30 నుంచి 12.30వరకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది. ఇంతకు ముందు జేఈఈ మెయిన్స్‌ను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్లోనూ నిర్వహించేవారు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలకు 12నుంచి 14 లక్షల మంది హాజరవుతుండగా అందులో 12 లక్షలకు పైగా అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ పరీక్షలకే హాజరయ్యేవారు. అయితే ఈసారి పరీక్షలు కంప్యూటరాధారితంగానే జరగనుండడంతో అభ్యర్ధులు అందుకు వీలుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. అడ్మిట్‌కార్డులను డిసెంబర్‌ 17నుంచి ఎన్‌టీఏ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు. దరఖాస్తుల సమర్పణలో అభ్యర్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జేఈఈ మెయిన్స్‌ బులిటెన్‌లో సూచించారు. నిర్దేశిత సమాచారాన్ని పొందుపర్చడంతో పాటు అభ్యర్ధులు తమ ధ్రువపత్రాలు, ఫొటోలను నిర్ణీత సైజుల్లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. లేదంటే దరఖాస్తులు తిరస్కరణ అవుతాయి.  

ఏపీ పరీక్ష కేంద్రాలు ఇవే
ఈ పరీక్షలకు సంబంధించి ఏపీలో 19 నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలలో కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. తెలంగాణలో 7నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఉండగా ఈ పరీక్షలకు దరఖాస్తు సమర్పణతో పాటు ఇతర అంశాల్లో సందేహాల నివృత్తికోసం దేశవ్యాప్తంగా 1.5 లక్షల కామన్‌ సర్వీసు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్లోనే జరగనుండడంతో అభ్యర్ధులు తగిన తర్ఫీదు పొందేందుకు జేఈఈ వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌ టెస్టు ప్రాక్టీస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 2 నుంచి సాయంత్రం 4 వరకు అభ్యర్ధులకు అందుబాటులో ఉంచుతారు. శని, ఆదివారాల్లో మాత్రం ఉదయం 10 నుంచి 4 వరకు ఇది అందుబాటులో ఉంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top