మద్య నిషేధం వైఎస్‌ జగన్‌ సాహసోపేత నిర్ణయం

Jana Chaitanya Vedika President Lakshman Reddy Comments On Pawan Kalyan - Sakshi

జన చైతన్య వేదిక రాష్ట్ర  అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి

సాక్షి, విజయవాడ: మంచి పనిని స్వాగతించక పోగా.. వక్రభాష్యాలు చెప్పటం భావ్యం కాదని.. జనసేన తీరును జనచైతన్య వేదిక ఎండగట్టింది. వైఎస్సాఆర్‌సీపీ వంద రోజుల పాలన గురించి జనసేన విడుదల చేసిన నివేదికను జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్‌రెడ్డి తప్పుబట్టారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు జనచైతన్య వేదిక బహిరంగ లేఖ రాసింది. చంద్రబాబు బెల్టుషాపులను ప్రోత్సహించి మద్యాన్ని ఏరులై పారించి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదని పవన్‌ కల్యాణ్‌ను లక్ష్మణ్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. దశలవారీ మద్య నిషేధం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం అని లక్ష్మణ్‌రెడ్డి ప్రశంసించారు.

పవన్‌కు అభ్యంతరం ఎందుకు?
సీఎం వైఎస్‌ జగన్‌ బెల్టుషాపుల భరతం పట్టి గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి బాటలు వేశారన్నారు. ‘చంద్రబాబు మద్యం వ్యసనాన్ని జనం చెంతకు చేరిస్తే.. జగన్ ఆ వ్యసనాన్ని దూరం చేస్తున్నారని’ చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందతో వందల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందన్నారు. అవినీతిపై విచారణ చేస్తామంటే పవన్ అభ్యంతరం చెప్పటం న్యాయం కాదన్నారు. బిహార్, గుజరాత్, మిజోరాం లలో సంపూర్ణ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలు జరుగుతోందని.. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాలని కోరారు.

మద్యపాన నిషేధాన్ని రాజకీయం చేయొద్దు..
మద్యం వల్ల సంసారాలు గుల్ల అవుతున్నాయని.. యువత వ్యసనపరులవుతున్నారని మానసిక వైద్య నిపుణులు ఇండ్ల సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో దశల వారి మద్యనిషేధం, డిఅడిక్షన్ సెంటర్లు పెట్టాలనుకోవటం శుభ పరిణామంగా పేర్కొన్నారు. మద్యపాన నిషేధాన్ని రాజకీయం చేయకుండా ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయ దృక్పథం మాని మద్యనిషేధానికి కృషి చేయాలని కోరారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top