మా కుటుంబానికి వైఎస్సార్‌ దైవం : జక్కంపూడి విజయలక్ష్మీ

Jakkampudi Raja Takes Charge As Kapu Corporation Chairman - Sakshi

కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ప్రమాణం

సాక్షి, విజయవాడ : కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా ఆదివారం ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయన చేత కాపు కార్పొరేషన్‌ ఎండీ హరీంద్రప్రసాద్‌ ప్రమాణం చేయించారు. దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్ తమ కుటుంబాన్ని వెన్నంటి ఆదుకున్నారని రాజా అన్నారు. ఆయన మాట్లాడుతూ..  ‘రాజకీయంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మమ్మల్ని ఆదుకున్న వైఎస్‌ జగన్, నన్ను ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజలవల్లే నాకీ పదవి లభించింది. ఇప్పటికీ, ఎప్పటికీ వైఎస్‌ జగన్ వెంటే నడుస్తా. కాపుల సంస్కరణలను మంటకలిపిన వ్యక్తి చంద్రబాబు. కాపుల్ని అయోమయానికి గురిచేస్తూ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాటకాలాడారు. 

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయంచేస్తానని మా నాయకుడు సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. కాపు కార్పొరేషన్‌లో కొత్త సంస్కరణలు తీసుకువస్తాం. ప్రతి కాపు సోదరుడికి అండగా ఉంటాను. ప్రతి రూపాయి కాపులకు అందేలా చూస్తాం’అన్నారు. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మెహన్ తనయుడే రాజా. ఆయన వైఎస్సార్‌సీపీ రాజానగరం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక తొలి బడ్జెట్‌లోనే రూ.2000 కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించి కాపుల అభ్యున్నతికి తొలి అడుగు వేశారు. కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ఆళ్లనాని, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

కాపులు ఎవరికీ వ్యతిరేకం కాదు..
జక్కంపూడి రాజా తల్లి విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దైవం అయితే జక్కంపూడి రమ్మోహనరావు, వంగవీటి రంగా మా ప్రాణం. చెప్పిన మాటను నెరవేర్చుకునే ఏకైక వ్యక్తి జగన్. కాపులు ఎవ్వరికీ వ్యతిరేకం కాదు’అన్నారు. రాజా ఛైర్మన్‌గా రావడం మంచిపరిణామమని కాపు కార్పొరేషన్ ఎండీ హరీంద్రప్రసాద్‌ అన్నారు. కార్పొరేషన్ కింద వచ్చే ప్రతి రూపాయి కాపుల అభ్యున్నతికి ఖర్చు పెడతామని స్పష్టం చేశారు. మాట నిలబెట్టుకునే ఏకైక నేత జగన్ అని మాజీ కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top