ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని దగాకోరు ప్రభుత్వమిది అంటూ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు.
అనంతపురం టౌన్ : ప్రజలను మభ్య పెట్టి అధికారంలోకి వచ్చి.. ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయని దగాకోరు ప్రభుత్వమిది అంటూ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజలను మోసం చేశారని వారు దుమ్మెత్తి పోశారు. ప్రజలను వంచించిన ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని శాపనార్థాలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ‘టీడీపీ ప్రజా వంచన’ దినం పాటించారు. తొలుత నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ ఆధ్వర్యంలో టీడీపీ మేనిఫేస్టోలోని అంశాలతో కూడిన ప్లకార్డులతో పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా సప్తగిరి సర్కిల్ వద్దకు చేరుకున్నారు. అక్కడ టీడీపీ మేనిఫేస్టోని కాళ్లతో తొక్కి తగలబెట్టారు.
కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శంకర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగరాజు, అధికార ప్రతినిధి మాసూలు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ టీడీపీ మేనిఫెస్టోని విడుదల చేసి నేటికి ఏడాది పూర్తయ్యిందన్నారు. నేటికీ అందులోని ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. దీంతో ఆ పార్టీ మేనిఫేస్టోని విడుదల చేసిన రోజును ఆ పార్టీ ‘ప్రజా వంచన’ దినంగా పాటిస్తున్నామన్నారు.
ఇది పూర్తిగా ప్రజలకు ద్రోహం చేయడమేనంటూ మండిపడ్డారు. బాబు వచ్చాడు.. జాబులూ పోతున్నాయని ఎద్దేవా చేశారు. రుణాలు కట్ట వద్దని రైతులు, డ్వాక్రాకు చెప్పారు. ఇప్పుడు వారెవరూ బ్యాంకులకు ముఖం చూపించలేని పరిస్థితి కల్పించారని విమర్శించారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి వశికేరి శివ, నాయకులు లక్ష్మిప్రసాద్, కొండారెడ్డి, వశికేరి రమష్, సాయిగోవర్దన్, హరి, కడియాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.