
కర్నూలును రాజధానిగా ప్రకటించాలి
కర్నూలును రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య..
జాతీయ రహదారి దిగ్బంధం
కర్నూలు(రూరల్): కర్నూలును రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య.. రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్.. రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనరసింహ మాట్లాడుతూ గతంలో జిల్లా ప్రజలు రాజధానిని త్యాగం చేశారని.. ఆ నష్టం ఇప్పటికీ పూడ్చుకోలేకపోతున్నారన్నారు. శ్రీభాగ్ ఒప్పందంలో రాయలసీమ వాసులు ఎలాంటి ప్రతిపాదన చేసినా ఆమోదించాలని పేర్కొన్నా పాలకులు పెడచెవిన పెట్టారన్నారు.
ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడంతో పాటు విలువైన ఖనిజ సంపదను దోచుకున్నారన్నారు. విభజన సమయంలో అవలంబించిన విధానాలపై దుమ్మెత్తిపోసిన రాజకీయ పార్టీలు రాజధానిని కోస్తాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తే అయినా రాజధాని విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం తగదన్నారు. కర్నూలును రాజధాని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
చంద్రబాబుకు కోస్తా ప్రజలు మాత్రమే ఓట్లేశారన్నట్లుగా రాజధాని గుంటూరు-విజయవాడ మధ్య ఏర్పాటు చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. రాజధాని సలహా కమిటీలో సీమ నేతలకు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదో సమాధానం చెప్పాలన్నారు. నగర శివారులోని సంతోష్‌నగర్ వద్ద చేపట్టిన జాతీయ రహదారి దిగ్బంధంతో ఇరువైపుల పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో నాల్గో పట్టణ పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఆందోళనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్, రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ నాయకుడు చంద్రశేఖర్, బీసీ కులాల ఐక్యవేదిక నాయకుడు శేషఫణి, రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి విభాగం నాయకుడు శ్రీరాములు, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.