ఆత్మలకూ ‘ఉపాధి’! | Sakshi
Sakshi News home page

ఆత్మలకూ ‘ఉపాధి’!

Published Sun, Nov 5 2017 3:45 AM

Irregularities in the Employment Guarantee Scheme - Sakshi

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పాలనలో ఆత్మలకు ప్రాణమొస్తోంది. ప్రాణం రావడమే కాదు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాయి. బిల్లులు కూడా తీసుకుంటున్నాయి. కావాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి వెళ్లి చూడండి. ఈ గ్రామానికి చెందిన పాముల గంగరాజు 2010లో ఉపాధి హామీ పథకంలో కూలీగా నమోదు చేసుకున్నారు. గంగరాజు, భార్య చింటమ్మ పేరిట ఆ కుటుంబానికి 050681324014010959 నెంబరుతో జాబ్‌కార్డును ప్రభుత్వం జారీ చేసింది. గంగరాజు అనారోగ్యం పాలై 2013లో మరణించారు.

అతడి మరణాన్ని ధ్రువీకరిస్తూ తెలికిచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి అదే ఏడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. కానీ చనిపోయిన గంగరాజు ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో 48 రోజులు పాటు పనిచేసినట్టు ఉపాధి హామీ పథకం రికార్డులో పేర్కొన్నారు. ఆ మేరకు బిల్లులు కూడా తీసుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై గ్రామంలో ఉన్న మరో పాముల గంగ రాజు పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి, దాని ద్వారా డబ్బులు డ్రా చేశారని సమాచారం. చనిపోయిన గంగరాజు తండ్రి పేరు రాముడు అని ఉపాధి పథకం జాబ్‌ కార్డులో ఉండగా... డబ్బులు తీసుకున్న గంగరాజు తండ్రి పేరు నాగేశ్వరరావు కావడం గమనార్హం. అయినా అవేమీ పట్టించుకోకుండా బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరుకు అద్దం పడుతోంది. 

రాష్ట్రమంతటా దొంగమస్టర్ల దందానే
చనిపోయిన గంగరాజు పేరుతో బిల్లులు తీసుకున్నట్లే దొంగ మస్టర్ల దందా రాష్ట్రమంతటా యధేచ్చగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇప్పుడు పరోక్షంగా ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్ల ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని అధికార యంత్రాంగం ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో కూలీ డబ్బులు చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం... కూలీలు జిల్లాల వారీగా చేసిన పని విలువను బట్టి రాష్ట్రానికి మెటీరియల్‌ నిధులను విడుదల చేస్తోంది. పథకంలో కూలీ ద్వారా రూ.60 పని జరిగినట్టు రికార్డులు చూపితే మరో రూ.40 చొప్పున రాష్ట్రానికి 40 శాతం మెటీరియల్‌ నిధులు మంజూరు చేస్తోంది. ఈ 40 శాతం మెటీరియల్‌ నిధులతో గ్రామాల్లో పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాట పథకంలో వేసే సిమెంట్‌ రోడ్లు నిర్మాణానికి, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి అందే మెటీరియల్‌ నిధులే దిక్కు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేసిన ప్రతి లబ్ధిదారుడు ఒక్కొక్కరికీ రూ. 55 వేలు ఉపాధి హామీ పథకం నిధులను చెల్లిస్తున్నారు. స్మశానాల చుట్టూ ప్రహరీ గోడ, పాఠశాలల్లో ఆటస్థలాలు, చివరకు మినీ స్టేడియాలకు ఈ రకమైన ‘ఉపాధి’ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. దీంతో సిమెంట్‌ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అవసరమయ్యే ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధులు కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో విడుదల కావాలంటే రాష్ట్రంలో కూలీల ద్వారా ఎక్కువ పని జరిగినట్టు రికార్డులు చూపించాలి.

ఈ నేపథ్యంలో ఉపాధి పథకం 40 శాతం మెటీరియల్‌ నిధులను కేంద్రం నుంచి అధిక మొత్తం రాబట్టుకునేందుకు కూలీల పని కల్పనకు ప్రభుత్వం గ్రామాల్లో ఫీల్డు అసిస్టెంట్లకు టార్గెటు విధించింది. ప్రతి రోజూ ప్రతి జిల్లాకు లక్షల మంది చొప్పున కూలీలకు పని కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో టార్గెట్లు పూర్తి చేసే ప్రక్రియ సులభమైన దొంగ మస్టర్ల నమోదు దందా ఊపందుకుంది. 

రెండురకాల ప్రయోజనాలతో నేతలదే హవా!
గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మంది పనిచేసిన దాని ప్రకారమే ఆ జిల్లా పరిధిలోని గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లకు నిధులు కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అంతర్గత సమావేశాల్లో ప్రచారం చేశారు. దీంతో గ్రామ స్థాయి టీడీపీ నేతలు తమ పరిధిలోని ఫీల్డు అసిస్టెంట్ల ద్వారా దొంగ మస్టర్లతో ఎక్కువ పనిచేసినట్టు చూపించే ప్రక్రియకు తెరతీశారు. తమకు అనుకూలమైన వారి పేరిట పంట కుంట (ఫామ్‌ ఫాండ్‌)లను మంజూరు చేసి, వాటిని పొక్లెయిన్‌ మెషీన్ల ద్వారా తవ్వించి, అదే పనిని కూలీలతో చేయించినట్టు రికార్డులు నమోదు చేయిస్తున్నారు. రూ.5 వేలు ఖర్చు పెట్టి పొక్లెయిన్ల ద్వారా చేసిన పనికి రూ. 30–40 వేల పనిని కూలీల ద్వారా చేసినట్టు చూపి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా రెండు రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. 

నెల్లూరు జిల్లాలో పోలీసు కేసు
పొక్లెయిన్ల సహాయంతో తవ్విన పంట కుంటకు తమకు తెలిసిన కూలీల పేర్లతో పనిచేసినట్టు చూపి బిల్లు చేసుకోవడంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల పోలీసు కేసు కూడా నమోదైంది. దుత్తలూరు మండలంలో కొందరు టీడీపీ నేతలు తమ గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్‌ సహాయంతో పొక్లెయిన్ల ద్వారా తవ్విన దాదాపు 10 పంట కుంటలకు కూలీల పేరుతో బిల్లు చేసుకున్నట్టు నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సోషల్‌ ఆడిట్‌లో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సిబ్బంది నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో కొందరు టీడీపీ నేతలు పొక్లెయిన్ల ద్వారా తవ్విన దానికి కూలీల ద్వారా చేయించినట్టు మోసగించి తమ ద్వారా బిల్లు చేసుకున్నారంటూ సంబంధించిన సిబ్బంది మండల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. 

Advertisement
Advertisement