అక్రమాలకు ‘సహకారం’ | Irregularities 'co-operation' | Sakshi
Sakshi News home page

అక్రమాలకు ‘సహకారం’

Nov 10 2013 3:03 AM | Updated on Sep 2 2017 12:28 AM

వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నం అందుతుందన్న చందంగా మారింది కేడీసీసీ బ్యాంక్ పనితీరు.

 రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడా ల్సిన సహకారం సంఘాల్లో కొన్ని దారితప్పాయి. తమ లక్ష్యాలను మరచి పాలకవర్గాలు అక్రమాలకు తెరలేపాయి. ఇందుకు జిల్లా కేంద్రంలోని కేంద్ర బ్యాంక్ కూడా ‘చే’యూతనందిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.    
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా పంచభక్ష పరమాన్నం అందుతుందన్న చందంగా మారింది కేడీసీసీ బ్యాంక్ పనితీరు. ఖరీఫ్ సీజన్‌లో పంట రుణాల పంపిణీకి సంబంధించి ఆప్కాబ్ నుంచి జిల్లాకు బడ్జెట్ విడులైంది. దీనిని సహకార సంఘాలకు కేటాయించటంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు.
 
 అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ విండోలకే ఈ నిధులను పెద్దఎత్తున మళ్లించారు. అర్హతలేని, అక్రమాలకు పాల్పడిన వాటికి సైతం అడ్డగోలుగా కేటాయించారు. జిల్లాలో 95 సింగిల్ విండోలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు రుణాలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) నుంచి రూ.19.89 కోట్లు నిధులు విడుదల చేసింది. సింగిల్‌విండోల రికవరీ శాతాన్ని బట్టి సంఘాలకు వీటిని పంపిణీ చేయాలి. అవకతవకలు లేకుండా, సక్రమంగా ఆడిట్ జరుగుతూ అభివృద్ధి పథంలో రాణిస్తున్న సంఘాలకు అదనపు బడ్జెట్ కేటాయించవచ్చు. అయితే ఇటువంటి నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా ఓ కాంగ్రెస్ నాయకుడు చెప్పినట్లు నిధులను మళ్లించారు.
 
 అర్హతలేని సహకార సంఘాలకే ప్రాధాన్యం..
 జిల్లాలో అర్హతలేని సహకార సంఘాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని వాటికే పెద్దపీట వేశారు. అందులో వెల్దుర్తి సింగిల్ విండోకు రూ.61.19 లక్షలు, క్రిష్ణగిరి సహకార బ్యాంక్‌కు రూ.33 లక్షలు, మారెళ్లకు రూ.50 లక్షలు, పత్తికొండకు రూ.54.30 లక్షలు, మద్దికెర, బురుజుల చెరో రూ.25 లక్షల చొప్పున మంజూరు చేశారు.
 
 అదే విధంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని దేవనకొండ సహకార బ్యాంక్‌కు రూ.33 లక్షలు, కోడుమూరుకు రూ.38 లక్షలు, నంద్యాల పరిధిలోని దీబగుంట్లకు రూ.34 లక్షలు, గోపవరానికి రూ.34 లక్షలు, గోస్పాడుకు రూ.36 లక్షలు, గడివేములకు రూ.34లక్షల చొప్పున మంజూరు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందిన సహకార సంఘాలకే పెద్దపీట వేశారు. కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్ముక్కై గెలుచుకున్న పత్తికొండ సహకార బ్యాంకుకూ అత్యధిక నిధులు కేటాయించటం గమనార్హం. ఇందులో క్రిష్ణగిరి సొసైటీపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆడిట్ పూర్తికాకపోవటం, విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికి ఈ సహకార సంఘానికి నిధులు మంజూరు చేశారు.
 
 బురుజుల సహకార సంఘం ఒకే గ్రామానికి చెందినది. ఇక్కడ గతంలో రూ.50 లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయనే విమర్శలు ఉన్నాయి. అటువంటి సంఘానికీ భారీగా నిధులు మంజూరు చేయటం కేడీసీసీ బ్యాంక్ పాలక వర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ పరిధిలోని ఉప్పరపల్లి సొసైటీకి నిధులు ఇవ్వటంలో తిరకాసుపెట్టింది. ‘రికవరీ శాతం ప్రకారం రూ.18లక్షలు ఇస్తాం మీరెవరికైనా పంచుకోండి. అదనపు బడ్జెట్ నిధులను మా ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకుంటాం. అందుకు మీరు సంతకం చేయాలి’ అని షరతు పెట్టటంతో ఆ చైర్మన్ అసలు బడ్జెట్టే వద్దని చెప్పేసినట్లు తెలిసింది.
 
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్లకు కొన్నిచోట్ల ఒక్క రూపాయికూడా మంజూరు చేయలేదు. ఆళ్లగడ్డ పరిధిలోని చాగలమర్రి, ఓబులంపల్లి, ఆదోని పరిధిలోని బదినేహాల్, చిన్నతుంబళం, ఎమ్మిగనూరు పరిధిలోని కడిమెట్ల సహకార సంఘాలనే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ అడ్డగోలు నిధుల పందేరంపై సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
 
 రికవరీని బట్టే నిధుల మంజూరు
 సహకార సంఘాలకు రికవరీలను బట్టే నిధులు మంజూరు చేశాం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘాలకు రుణాలు ఇవ్వలేదు. పూర్తిగా నిధులు మంజూరు చేయలేదంటే ఆ సంఘాల వారు 27, 28 లోపు రిజిస్టర్ చేసుకుని ఉండరు. నిధుల కేటాయింపులో మేం పార్టీలను దృష్టిలో పెట్టుకోలేదు.
 -డీసీసీబీ సీఈఓ వీవీ సుబ్బారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement