
ఏసీబీ వలలో జూనియర్ అసిస్టెంట్
అనకాపల్లి టౌన్: పేదవాడినని కనికరం చూపాలని వేడుకున్నా లంచానికే అలవాటుపడిన ఉద్యోగి ఎప్పటిలాగే తన చేతివాటాన్ని చూపాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
- కాండక్ట్ సర్టిఫికేట్ కోసం 2 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం
అనకాపల్లి టౌన్: పేదవాడినని కనికరం చూపాలని వేడుకున్నా లంచానికే అలవాటుపడిన ఉద్యోగి ఎప్పటిలాగే తన చేతివాటాన్ని చూపాడు. అయితే బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం ఓ జూనియర్ అసిస్టెంట్‌ను లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ఎం. నర్సింహరావు తెలిపిన వివరాలివి. రాంబిల్లి మండలం కొత్తపట్నానికి చెందిన చోడపల్లి రమణ డిగ్రీ వరకు చదువుకున్నారు. 2012లో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగానికి దరఖాస్తు చేయగా ఎంపికైనట్టు 15 రోజుల క్రితం కాల్‌లెటర్ వచ్చింది.
ఈ నెల 14వ తేదీ లోపు విధుల్లో చేరాల్సి ఉండగా సంబంధిత ధ్రువపత్రాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాండక్ట్ సర్టిఫికెట్ కోసం తహసీల్దార్, పోలీసు అధికారుల ధ్రువీకరణ పొందగా ఆర్డీఓ ధ్రువీకరణ పొందాల్సి ఉంది. ఈ మేరకు ఆర్డీఓ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ బి. హరిలక్ష్మికుమార్‌ను ఆశ్రయించారు. ఈనెల 14 తేదీలోపు చెన్నైలో జాబ్‌లో చేరాల్సి ఉందని, ఈ మేరకు 11వ తేదీ లోపు ధ్రువీకరణ పత్రాన్ని అందించాలని జూనియర్ అసిస్టెంట్ హరి లక్ష్మికుమార్‌ను రమణ కోరారు.
అయితే అతని అవసరాన్ని ఆసరాగా తీసుకొని, నిబంధనల ప్రకారం కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే 15 రోజులు పడుతుందని, 11వ తేదీ లోపు ఇవ్వాలంటే 3 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వాడినని అంత డబ్బు ఇచ్చుకోలేనని రమణ వేడుకున్నప్పటికీ జూనియర్ అసిస్టెంట్ వినకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో చివరకు 2 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
అయితే ఆయన ప్రవర్తన పట్ల విసుగు చెందిన రమణ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారు ఆర్డీఓ కార్యాలయంలో పథకం ప్రకారం మాటు వేశారు. రమణ నుంచి జూనియర్ అసిస్టెంట్ 2 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఎం. నర్సింహరావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నారు.
రమణ చెన్నై వెళ్లేందుకు సైతం రవాణా ఛార్జీలకు సొమ్ము లేకపోవడంతో తన తల్లి చెవిదిద్దులను తాకట్టు పెట్టి 5 వేల రూపాయలను తీసుకున్నారు. వీటిలో రూ.2 వేలు జూనియర్ అసిస్టెంట్‌కు ఇచ్చేందుకు తీసుకున్నట్టు రమణ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్‌కు పంపిస్తున్నట్టు ఎసీబీ డీఎస్పీ నర్సింహరావు తెలిపారు. ఈయన వెంట ఏసీబీ సీఐ రామకృష్ణ, రమణమూర్తి, గణేష్ ఉన్నారు.