వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చెరువులో పడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువకులు, మరో చిన్నారి ఉన్నాడు.
షాద్‌నగర్ టౌన్, న్యూస్‌లైన్: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆదివారం జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో చెరువులో పడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువకులు, మరో చిన్నారి ఉన్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఫరూఖ్‌నగర్ మండలం అయ్యవారిపల్లి పంచాయతీ జయరాంతండాకు చెందిన ఓడిత్యావత్ రాజు(22) ఇస్లావత్ తులసీరాం(23) తండాలో ప్రతిష్ఠించిన గణేశ్ విగ్రహాన్ని తమ మిత్రులతో కలిసి ఆదివారం నిమజ్జనానికి తీసుకెళ్లారు. తండా సమీపంలోని దొంతుబావికుంటలో గణనాథున్ని నిమజ్జనం చేసే క్రమంలో చెరువులో పడ్డారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో చెరువులో మునిగిపోయారు. ఎంతసేపటికీ బయటిరాలేదు. నిమజ్జనానికి తరలి వెళ్లిన తోటి మిత్రులు రాజు, తులసీరాం మృతిచెందారనే సమాచారాన్ని స్థానికులకు తెలియజేశారు. తండావాసులు గంటపాటు శ్రమించి మృతదేహాలను బయటకుతీశారు. రాజు హైదరాబాద్‌లోని ఓ క్యాంటిన్‌లో పనిచేస్తుండగా, తులసీరాం షాద్‌నగర్ పట్టణంలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ ఘటనతో జయరాంతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చెరువులో పడి మరో బాలుడు
దౌల్తాబాద్ : మండల కేంద్రంలోని అర్వకంత వీధిలో ప్రతిష్టించిన వినాయకుడి విగ్రహాన్ని గ్రామానికి సమీపంలో ఉన్న చెరువులో శనివారం మధ్యాహ్నం నిమజ్జనం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి గ్రామానికి తలారిమల్లప్ప, మొగులమ్మల కొడుకు కృష్ణ(8) మిత్రులతో కలిసి వెళ్లాడు. కార్యక్రమం ముగిసిన తరువాత అందరు ఇళ్లకు చేరుకున్నారు. కృష్ణ మాత్రం రాత్రి 7 గం టలు దాటినా ఇంటికి తిరిగిరాలేదు.
దీంతో కలతచెందిన కుటుంబసభ్యులు వెతికినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. చివరకు ఆదివారం ఆ బాలుడు చెరువులో మృతదేహమై కనిపించాడు. ఉదయం చేపల వేటకు వెళ్లిన కొందరు కృష్ణను గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. అయితే మృతుని తల్లిదండ్రులు బతుకుదెరువుకు ముంబాయిలో ఉంటుండగా, కృష్ణమాత్రం అమ్మమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. ఈ ఘటనతో దౌల్తాబాద్‌తో విషాదఛాయలు అలుముకున్నాయి.