పేదల పెన్నిధి.. సంక్షేమ సారథి

Implementation of schemes in YS Rajasekhara Reddy ruling - Sakshi

వైఎస్‌ హయాంలో స్వర్ణయుగాన్ని చూసిన రాష్ట్రం

రాజకీయాలకు అతీతంగా పథకాల అమలు

తొలి సంతకంతో చరిత్ర పుటల్లోకి..

నభూతో నభవిష్యత్‌ అన్నట్లు అమలైన పథకాలు

‘సంక్షేమం’లో మహిళలకు పెద్దపీట

సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి అడుగులు

పావలా వడ్డీకే రుణాలు వైఎస్‌ హయాంలోనే శ్రీకారం

అప్పుల ఊబి నుంచి అన్నదాతలకు మోక్షం

ఆయుష్షు పెంచిన ఆరోగ్యశ్రీ

మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన మహానేత

సాక్షి, అమరావతి: డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి జీవితాలు ఆరోగ్యంగా, సుభిక్షంగా ఉండేలా బాటలు వేసిన మహనీయుడు. ఆ మహానేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకమునుపు రాష్ట్ర ప్రజలు కనీస సదుపాయాల్లేక బతుకు భారమై బలవంతంగా తనువు చాలించాల్సిన పరిస్థితులు. ఆ సమయంలో రాష్ట్రానికి ఒక వేగుచుక్కలా.. ఒక దిక్సూచిగా వైఎస్‌ వచ్చారు. అంతకు ముందే కాదు.. ఆ తర్వాత కూడా ఎన్నడూ ఎవ్వరూ కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి సంక్షేమ పథకాలను వైఎస్‌ చేపట్టారు.

కులమత రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఆ ఫలాలు అందేలా అమలుచేయించిన మహనీయుడు వైఎస్‌. నిధులతో సంబంధం లేకుండా పేదలకు మేలు జరుగుతుందనుకుంటే ఎంత ఖర్చయినా ఆ సంక్షేమ కార్యక్రమాలను వైఎస్‌ ముందుండి అమలుచేయించారు. అందుకే వైఎస్‌ మరణించి ఇన్నేళ్లయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి చెరగని ముద్రవేశారు. ఉచిత విద్యుత్, జలయజ్ఞం, రుణమాఫీ, ఫీజు రీయంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు, 108, 104, అభయహస్తం, ఇందిరా క్రాంతిపథం ఇలా ఎన్నో.. ఎన్నెన్నో.

తొలి సంతకం నుంచే సంక్షేమానికి పెద్దపీట
ముఖ్యమంత్రిగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 మే 14న చేసిన తొలి సంతకం నుంచే సంక్షేమానికి బాటలు వేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు సాగుచేసే రైతన్నల వెతలు తీర్చేలా ఉచిత విద్యుత్‌పై ఆయన చేసిన తొలి సంతకం చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. అంతేకాక.. రూ.1,200కోట్ల వారి విద్యుత్‌ బకాయిలను కూడా ఒక్క సంతకంతో మాఫీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జలయజ్ఞాన్ని చేపట్టి అన్ని సాగునీటి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారు.

ప్రాంతాలకు అతీతంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని అన్ని పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేయించడానికి విశేష కృషి చేశారు. గతంలో ఎవరి ఊహకు రాని, తెలంగాణలోని ప్రాణహిత–చేవెళ్ల పథకానికి శ్రీకారం చుట్టించారు. ఇంకుడు గుంతల పేరిట అంతకు ముందు వేల కోట్ల నిధులను దోపిడీ చేసిన గత ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా రైతుల పొలాల్లోకి సాగునీరు పారేలా ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు.

మహిళలకు అగ్రతాంబూలం
మహిళలకు వైఎస్‌ పెద్దదిక్కుగా నిలిచారు. సంక్షేమ పథకాల్లో వారికి పెద్దపీట వేశారు. లక్షలాది ఇందిరమ్మ ఇళ్లను వారి పేరు మీదనే కట్టించారు. రాష్ట్రంలోని ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేనివారు ఉండకూడదన్న సంకల్పంతో ప్రతి గ్రామంలోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ప్రతినెల కొంత నగదు సమకూరేలా ఇందిరా క్రాంతిపథం, అభయహస్తం వంటి పథకాలతో మహిళలను ఆదుకున్నారు. రోజుకు ఒక్క రూపాయి చొప్పున నెలకు రూ.30 చెల్లిస్తే ఇలా చివరి వరకు ఆ మహిళ ఎంతమొత్తం కడితే అంతే మొత్తాన్ని ప్రభుత్వం అదనంగా జమచేసి ఆమె పేరున డిపాజిట్‌ చేస్తుంది. ఆ మహిళలకు 60 ఏళ్ల తరువాత ఈ మొత్తం ఆదుకునేలా ఏర్పాట్లు చేయించారు వైఎస్‌.

దాదాపు 1.50 కోట్ల మంది మహిళలకు ఈ పథకం లబ్ధిచేకూర్చింది. స్వయం సంఘాల్లో దాదాపు 90 శాతం మంది మహిళలు చేరి రూ.1,755 కోట్లు కట్టగా ప్రభుత్వం దానికి కొంత మొత్తాన్ని కలిపి రూ.3,951 కోట్లు జమ చేయించింది. వీరికి బ్యాంకులు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమం వైఎస్‌ హయాంలోనే ప్రారంభమైంది. అలాగే, 5061 కుటుంబాలు 4495.53 ఎకరాలు కొనుగోలు చేసుకుని వ్యవసాయం చేపట్టాయి. అంతేకాదు.. 30 లక్షల పంపుసెట్లకు ఐదేళ్లపాటు ఉచిత విద్యుత్‌.. రూ.32వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం.. అదనంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయడంతో అప్పటివరకూ కరువు కాటకాలతో అల్లాడిన రాష్ట్రం వైఎస్‌ హయాంలో పుష్కలంగా వర్షాలు పడి ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. 199 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడితో దేశంలోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.  

అన్నదాతలకు అండగా..
వైఎస్‌ హయాంలో 90 లక్షల మందికి పైగా రైతులకు రుణాలు అందడమే కాకుండా వారందరికీ గ్రామం యూనిట్‌గా పంటల బీమా పథకం అమలుచేశారు. రుణమాఫీ కింద 69 లక్షల మంది రైతులకు చెందిన రూ.12వేల కోట్ల అప్పులు మాఫీ చేయించారు. రుణమాఫీ పరిధిలోకి రాని 32 లక్షల మంది రైతులకు రూ.5వేల చొప్పున రూ.1,600 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలుచేయించారు. పేదలకు 6.04 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయించడమే కాకుండా దాని అభివృద్ధికి రూ.500 కోట్లు ఇచ్చారు. గిరిజనులకు 13 లక్షల ఎకరాలను పంపిణీ చేయించారు.  రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఎకరానికి  రూ.1800 చొప్పున ఇచ్చారు. పశుక్రాంతి పథకం కింద లక్షలాది మంది రైతులకు పాడి గేదెలు, ఆవులు, గొర్రెలను పంపిణీ చేయించారు. రైతుల పంట దిగుబడులకు కనీవినీ రీతిలో గిట్టుబాటు ధరలు కల్పించారు.

పింఛన్‌ పెంపు
వైఎస్‌ హయాంలో వృద్ధులు, మహిళలకు ఇచ్చే పింఛన్‌ను రూ.70 నుంచి రూ.200లకు పెంచారు. వికలాంగులు, 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఇచ్చే పింఛన్‌ మొత్తాన్ని మరింత పెంచారు. చంద్రబాబు కాలంలో పింఛనుదారుల సంఖ్య 16 లక్షలే. వైఎస్‌ ఆ సంఖ్యను 70 లక్షలకు చేర్చారు. మైనార్టీలకు విద్య ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయించడమే కాకుండా వారి స్కాలర్‌షిప్‌ బడ్జెట్‌ను రూ.127 కోట్లకు పెంచారు. విద్యుత్, బస్‌ఛార్జీలు పెంచకపోవడమే కాకుండా ఆ తరువాత కూడా మరో ఐదేళ్లు పెంచబోమని హామీ ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుంది.

ఆరోగ్య ప్రదాత
దేశంలోనే ఎక్కడా లేని విధంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.2 లక్షల వరకు ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించారు. 942 వ్యాధులను అందులో చేర్చి రోగులకు అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారిని, గ్రామాలు.. పట్టణాల్లో అనారోగ్యానికి గురైన వారిని క్షణాల్లో ఆసుపత్రులకు చేర్చేందుకు 108 అంబులెన్స్‌లను వైఎస్‌ ప్రవేశపెట్టారు. గ్రామాల్లోని రోగులకు మందులు అందజేసేందుకు 104 సేవలు ప్రారంభించారు.

నిరుద్యోగులకు సువర్ణయుగం
చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకాక.. ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి లేక నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడారు. వైఎస్‌ పాలనలో ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. 50 వేలకు పైగా టీచర్‌ పోస్టులు, 17వేలకు పైగా పోలీసు ఉద్యోగాలు భర్తీచేయించారు. మరో 53వేల టీచర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇప్పించడమే కాకుండా ఎంపికైన వారికి హామీపత్రాల ద్వారా పోస్టులు ఇప్పించిన ఘనత వైఎస్‌ది. ప్రైవేట్‌ రంగంలో సెజ్‌ల ద్వారా దాదాపు 25 లక్షల ఉద్యోగాల కల్పనకు బాటలు వేయించారు. యువత కోసం రాజీవ్‌ ఉద్యోగశ్రీ, రాజీవ్‌ యువశక్తి పథకాలను అమలుచేయించారు. జలయజ్ఞంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కలిగేలా చేశారు. అలాగే..

చౌకధరల దుకాణాల ద్వారా రూ.105కే బియ్యం, పప్పు, ఉప్పు, ఆయిల్, చింతపండు, కారం తదితర తొమ్మిది సరుకులు పంపిణీ చేయించారు.  
♦  పేదల పిల్లలు తమకు నచ్చిన ఉన్నత విద్యను అభ్యసించేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఫీజు రీయంబర్స్‌మెంటును ప్రవేశపెట్టారు. అంతేకాక, వారికి స్కాలర్‌షిప్పులను భారీగా వైఎస్‌ పెంచారు. గ్రామీణ నిరుపేదలకు ఉన్నత సాంకేతిక విద్య అందించేందుకు ఐఐఐటీలను నెలకొల్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమమే ఉండడంతో పేదలకు అన్యాయం జరుగుతోందని భావించిన వైఎస్‌.. ఆరు వేల సక్సెస్‌ స్కూళ్లకు శ్రీకారం చుట్టించారు.  
 ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల ఇళ్లను నిర్మించారు. రాజీవ్‌ గృహకల్ప కింద 1.75 కోట్ల మందికి 20వేల కోట్లతో ఇళ్లు సమకూర్చారు.
♦  జలయజ్ఞం ద్వారా రూ.1.33లక్షల కోట్లతో 86 ప్రాజెక్టులు చేపట్టారు. ఇందులో దాదాపు సగానికి పైగా పూర్తిచేయడమే కాకుండా మిగిలిన వాటిని చివరి దశ వరకూ తీసుకువచ్చారు.  
 చంద్రబాబు హయాంలో రూ.2 కిలో బియ్యాన్ని ఎత్తివేసి దాన్ని రూ.9కి పెంచేయగా వైఎస్‌ రాగానే మళ్లీ రూ.2కే కిలో బియ్యం పథకాన్ని చేపట్టడమే కాక.. అప్పటివరకు కుటుంబానికి 16 కిలోలుగా ఉన్న దాన్ని 20 కిలోలకు పెంచారు.  
 వైఎస్‌కు ముందు చంద్రబాబు జమానాలో ప్రభుత్వోద్యోగులు నానా అవస్థలు పడగా.. వైఎస్‌ వారికి అన్ని మేళ్లు సకాలంలో చేకూర్చారు. పీఆర్సీ అమలు, డీఏలు వంటివి సకాలంలో అందించారు. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు.  
 ఫీజు రీయంబర్స్‌మెంటు కింద ఒక్క 2009–10 ఏడాదిలోనే ఏకంగా రూ.2,300 కోట్లు విద్యార్థుల కోసం వెచ్చించారు.  
నేతన్నలకు, 60 ఏళ్లు పైబడ్డ మహిళలకు పింఛన్‌ను రూ.500 నుంచి రూ.2,200కు పెరిగేలా చేశారు.  
వైఎస్‌ హయాంలో రూ.6,500 కోట్లను విద్యుత్‌పై ఖర్చుచేసి వ్యవసాయ, పరిశ్రమ, సేవా రంగాలకు నిరంతర సరఫరా చేశారు.  
♦  ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకో స్పెషలైజ్డ్‌ యూనివర్సిటీలతో పాటు 17 కొత్త యూనివర్సిటీల ఏర్పాటుచేయించారు. ఐఐటీ, ట్రిపుల్‌ ఐటీలు, బిట్స్‌ పిలానీ వంటి కొత్త సంస్థలను నెలకొల్పించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top