అక్రమంగా ఇసుక తరలింపు

Illegal Sand Mining In Srikakulam - Sakshi

సాక్షి, ఎచ్చెర్ల(శ్రీకాకుళం) : ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఇసుక  అక్రమ రవాణా జోరుగా కోనసాగుతోంది. ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా, వాహనాలు స్వాధీనం చేసుకున్నా,  ఇసుక నిల్వలు సీజ్‌ చేసినా, రీచ్‌ల చుట్టూ కందకాలు తవ్వించినా తదితర చర్యలు తీసుకున్నా అక్రమ రవాణా మాత్రం సాగుతోంది. ఎచ్చెర్ల మండలంలోని తమ్మినాయుడుపేట, పొన్నాడ, బొంతలకోడూరు, ముద్డాడపేట, పాతపొన్నాడ  ప్రాంతాల్లో నాగావళి నదిలో ఇసుక రీచ్‌లు ఉన్నాయి. తమ్మినాయుడుపేట, పొన్నాడ పంచాయతీ ముద్దాడపేట, పాతపొన్నాడ  తదిలర రీచ్‌లపై 24 గంటలు పర్యవేక్షణ సైతం ఉంది. అయినా ఇసుక రావాణా అగడం లేదు.

ట్రాక్టర్లు ద్వారా ఇసుక తరలించి జాతీయ రహదారికి అనుకొని, చిలకపాలెం, అల్లినగరం, ఎస్‌.ఎస్‌.ఆర్‌.పురం, కుశాలపురం, నవభారత్‌ జంక్షన్, కింతలిమిల్లు  వంటి ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా నిల్వచేస్తున్నారు. అనంతరం రాత్రిళ్లు  లారీల్లో తగరపువలస, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు ఇసుక తరలిస్తున్నారు. అనుకూల పరిస్థితులు చూసుకొని అక్రమంగా రవాణా చేస్తున్నారు.  నిఘా బృందాలు కొన్నిసార్లు దాడులు చేస్తున్నారు. విజిలెన్స్, రెవెన్యూ, పోలీస్, మైన్స్‌ తదితర ప్రభుత్వ శాఖలు ఇసుక నిల్వలు, వాహనాలు సీజ్, అక్రమ రవాణా, జాతీయ రహదారిపై నిఘా వంటివి కొనసాగు తున్నాయి. అయినా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా సాగిస్తుండడం గమనార్హం. కొన్నిసార్లు  నిఘా బృందాలు సైతం మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

లావేరు మండలం బుడుమూరు ఊటగెడ్డ నుంచి సైతం ఇసుక అక్రమంగా తరలిపోతోంది. ఇది ఆలా ఉండగా రణస్థలం మండలంలోని కొచ్చర్ల, దోణుపేట, కొవ్వాడ, ఎచ్చెర్ల మండలం కుప్పిలి, బుడగుట్లపాలెం తదితర ప్రాంతాల్లో సముద్రపు ఇసుకతో కలిపి కల్తీ చేసి విక్రయిస్తున్నారు. ఆయా ఇసుకను విశాఖపట్నం పరిసర ప్రాంతాలకు  తరలిస్తున్నారు.   ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అక్రమార్కులపై కఠిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ ఉంటేనే నియంత్రణ సాధ్యమని పలువురు చెబుతున్నారు. తీర ప్రాంతాల్లో సముద్రపు ఇసుక పోగులు వేసి, నది ఇసుక కల్తీ చేయడం సైతం చోటు చేసుకుంటుంది. ఇలా ఇసుక పోగులు కొన్ని ప్రాంతాల్లో నిల్వ చేసి అక్రమంగా రాత్రిళ్లు తరలిస్తున్నారు. ఇసుక అక్రమ నిర్మూలనపై ప్రభుత్వం ప్రస్తుతం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. దీంతో ఇసుక రవాణాకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయని పలువురు చెబుతున్నారు.

ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా
ఇసుక అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోంది. రీచ్‌లను నిరంతరం పరిశీలిస్తున్నాం. చిలకపాలెంలో తనిఖీ కేంద్రం సైతం ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలన కొనసాగుతోంది. జాతీయ రహదారిపై పట్టుబడ్డ ఇసుక వాహనాలను  సీజ్‌ చేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం. ఇసుక అక్రమ రవాణే పూర్తి నియంత్రణే లక్ష్యం.
–ఎంవీ రమణ, ఆర్డీవో, శ్రీకాకుళం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top