క్వారీ.. ఘోరీ! | Illegal Quarries Turn Into Death Traps for Workers And Children | Sakshi
Sakshi News home page

క్వారీ.. ఘోరీ!

Nov 26 2018 2:06 PM | Updated on Nov 26 2018 2:06 PM

Illegal Quarries Turn Into Death Traps for Workers And Children - Sakshi

మృతిచెందిన పరమేశ్వరి, దుర్గ

సాక్షి, కంచికచర్ల(నందిగామ) : పాపం.. ఆ చిన్నారులకు తెలీదు, అది మృత్యులోయని.. ఆ తల్లికి ఊహకైనా అంది ఉండదు.. అది ప్రాణాలు మింగే అగాధమని.. బట్టలు ఉతుకుదామని వెళ్లారు.. తిరిగిరాని లోకాలకు చేరిపోయారు.

దొనబండ.. ఈ ఘోరానికి సాక్షిగా నిలిచింది. మాటలకందని విషాదం.. వర్ణింప వీలుకాని వేదన.. ఇష్టారీతిన తవ్వి వదిలేసిన ‘క్వారీ’ గొయ్యి ఇద్దరు చిన్నారులతో పాటు, మరో మహిళను బలితీసుకుంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఇబ్రహీంపట్నం మూలపాడులో విషాద  ఛాయలు అలముకున్నాయి.


నీటి కుంటలో సరదాగా ఆడుకుందామని దిగిన చిన్నారులను అదే నీటికుంట మృత్యుకుహరమై మింగేసింది. కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ క్వారీలో ఇబ్రహీంపట్నం మూలపాడు గ్రామానికి చెందిన దేవనం పరమేశ్వరి(ఏలేము జ్యోతి)(38)బడ్డీ కొట్టు పెట్టుకుని బతుకీడ్చుతుంది.

భర్త సుబ్రహ్మణ్యం రోజు కూలీగా క్వారీలో పనిచేస్తుంటాడు. ఆదివారం పరమేశ్వరీ బట్టలు ఉతికేందుకని క్వారీలో ఉన్న నీటికుంట వద్దకు వెళ్లింది. ఆమెతో పాటు కుమార్తె దేవనం మీనా(5), వరుసకు మనుమరాలు అయిన వల్లెపు దుర్గ(8)లు అక్కడకు వెళ్లారు. పరమేశ్వరి నీటి కుంటలో దిగి బట్టలు ఉతుకుతుండగా ఒడ్డున చిన్నారులు ఆటలు ఆడుకుంటున్నారు.

కొంత సమయం అయిన తర్వాత ఉల్లాసంగా ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా నీటికుంటలోకి దిగారు. ఆ నీటి కుంట లోతు ఎక్కువగా ఉండడంతో ముని గిపోతూ కేకలు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న పరమేశ్వరి వారిని కాపాడేందుకు ప్రయత్నించి నీటికుంటలోకి దిగింది. దీంతో చిన్నారులతో పాటు ఆమె కూడా మునిగిపోయి మృత్యువాత పడింది. 
రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు..
దేవనం సుబ్రహ్మణ్యం పరమేశ్వరి దంపతులు రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని కొండలు పిండిచేసి జీవనం చేస్తున్న నిరుపేద కుటుంబాలు. నిత్యం కాయకష్టం చేసుకుని తమ పిల్లలను పోషించుకుంటున్నారు.

అప్పటిదాకా కళ్లముందు ఆడుకున్న ఆ చిన్నారులతోపాటు పరమేశ్వరి కూడా నీటికుంటలో పడి మృత్యువాతపడడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపించారు. మరో 5నిముషాల్లో బట్టలు ఉతికి చిన్నారులతో సహా ఇంటికి వెళ్లదామనే లోపే ఈ సంఘటన జరగటంతో వారి శోకం వర్ణనాతీతంగా ఉంది. 


అడ్డదిడ్డంగా క్వారీల తవ్వకాలు..
పరిటాల శివారు దొనబండ క్వారీల్లో కాంట్రాక్టర్లు అడ్డదిడ్డంగా తవ్వకాలు జరపటంతో ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. క్వారీ బ్లాస్లింగ్‌ సమయంలోనూ ప్రమాదాలు జరిగిన ఘట నలు ఉన్నాయి. ఎక్కువ లోతులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నా.. అటు మైనింగ్‌ అధికారులు గానీ, ఇటు రెవెన్యూ అధికారులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. లోతైన నీటి కుంటల వద్ద ప్రమాద హెచ్చరికలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement