కొల్లగొట్టింది కోటి టన్నులు!

Illegal mining in Palnadu - Sakshi

పల్నాడులో అక్రమ మైనింగ్‌ను కప్పిపుచ్చే యత్నాలు

31 లక్షల టన్నులు మాత్రమేనంటూ సర్కారు తప్పుడు లెక్కలు

శాటిలైట్‌ సర్వే నిర్వహించకుండా మొక్కుబడి తతంగం 

అధికార పార్టీ ఎమ్మెల్యేను కాపాడే యత్నం

సాక్షి, గుంటూరు: సున్నపురాళ్లలో కొల్లగొట్టింది కొండంత.. లెక్కల్లో చూపించేది మాత్రం గోరంత! పల్నాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే కనుసన్నల్లో  సాగుతున్న మైనింగ్‌ అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయి.

అక్రమాలపై సర్వే చేసిన అధికారులపైనే చర్యలు
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున సాగిన అక్రమ మైనింగ్‌ 31 లక్షల టన్నులు మాత్రమేనంటూ కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడంపై అనుమానాలు ముసురు కుంటున్నాయి. ఈ నివేదిక ఆధారంగా మైనింగ్‌ డీడీ, ఏడీలను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవంగా అక్కడ దోచేసిన సున్నపురాయి కోటి టన్నులకు పైగానే ఉంటుందని శాటిలైట్‌ సర్వేల ఆధారంగా అంచనా వేస్తున్నారు. దీన్ని దాచిపెట్టి కూలీలు, కార్మికులపై కేసులు బనాయించి అధికార పార్టీ ప్రజాప్రతినిధిని తప్పించే యత్నాలు సాగుతున్నాయి. మైనింగ్‌ వ్యవహారంలో బాధ్యులుగా చేస్తూ మంగళవారం రాత్రి సస్పెన్షన్‌ వేటు వేసిన మైనింగ్‌ డీడీ, ఏడీల నేతృత్వంలోనే అక్రమ క్వారీయింగ్‌పై సర్వే జరిగిన విషయం తెలిసిందే. మైనింగ్‌ ఏడీ జగన్నాధరావు ఫిర్యాదు ఆధారంగా 17 మందిపై కేసులు సైతం నమోదయ్యాయి. మైనింగ్‌ డీడీ, ఏడీలు నిజంగానే తప్పు చేసి ఉంటే వారి నేతృత్వంలో జరిగిన సర్వే కూడా తప్పేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులను కూడా పునఃపరిశీలించి మైనింగ్‌ మాఫియాలో కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

శాటిలైట్‌ సర్వే ప్రకారమే 68.53 లక్షల టన్నులు..
మైనింగ్‌ అధికారుల నివేదికను బట్టి చూస్తే పిడుగురాళ్ల మండలం సీతారాంపురం, దాచేపల్లి మండలం కేశానుపల్లి, నడికూడి ప్రాంతాల్లో మైనింగ్‌ మాఫియా కేవలం 31 లక్షల టన్నుల సున్నపురాయిని మాత్రమే తవ్వినట్లుగా చూపారు. అయితే నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) శాటిలైట్‌ సర్వే ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం 2017 జనవరి నాటికే 68.53 లక్షల టన్నుల తెల్లరాయిని దోచేసినట్లు మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి చెబుతున్నారు. ఈమేరకు సాక్ష్యాలను సైతం ఆయన హైకోర్టుకు అందించారు. 2017 జనవరి నుంచి 2018 జూలై 25వతేదీ వరకు అక్రమ మైనింగ్‌ జరుగుతూనే ఉంది. శాటిలైట్‌ సర్వే జరిగిన తరువాత 19 నెలల్లో సుమారుగా మరో 30 లక్షల టన్నుల సున్నపురాయిని దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం మూడు క్వారీల్లో కలిపి ఎమ్మెల్యే కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్‌ మాఫియా ఇలా ఏకంగా కోటి టన్నుల తెల్లరాయిని కొల్లగొట్టిందని అంచనా వేస్తున్నారు. దీని విలువ సుమారుగా రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మైనింగ్‌ లెక్కల ప్రకారం అక్రమంగా ఆర్జించిన సొమ్ముపై పది రెట్లు వరకు పెనాల్టీ విధించే అధికారం ఉంటుంది. మైనింగ్‌ మాఫియా దోచేసిన దాంట్లో నాలుగో వంతు కూడా మైనింగ్‌ అధికారులు లెక్కల్లో చూపకపోవడాన్ని బట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు, బాధ్యులైన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను రక్షించేందుకే ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

హైకోర్టు ఆదేశించినా పక్కదారి పట్టించే యత్నాలు 
మైనింగ్‌ మాఫియాలో అధికార పార్టీ ఎమ్మెల్యే పాత్ర స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఆయన జోలికి వెళ్లకుండా ప్రభుత్వ పెద్దలు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. శాటిలైట్‌ సర్వే నిర్వహించకుండా తూతూమంత్రంగా లెక్కలు చెబుతున్నారు. ఎమ్మెల్యే పేరు బయటకు రాకుండా అమాయకులకు నోటీసులు జారీ చేస్తూ విద్యుత్‌ మీటర్‌ రికార్డులు, 18 ఏళ్ల రికార్డులు చూపాలంటూ మిల్లర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మైనింగ్‌ మాఫియాలో సూత్రధారుల పేర్లు లేకుండా వారి వద్ద పనిచేసే కూలీలను, కార్మికులను కేసుల్లో ఇరికించి చేతులు దులుపుకొనే ప్రయత్నం జరుగుతోంది. కొందరు అధికారులను ఈ వ్యవహారంలో బలిపశువులుగా మార్చి వారిపై చర్యలు తీసుకున్నట్లుగా హైకోర్టుకు నివేదించేందుకు సర్కారు సిద్ధమైంది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తుందనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే సీఐడీకి విచారణ బాధ్యతలు అప్పగించి కేసును తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top