హైదరాబాదీలే టాపర్లు | Hyderabadies Topper in eamcet | Sakshi
Sakshi News home page

హైదరాబాదీలే టాపర్లు

May 22 2015 2:53 AM | Updated on Sep 4 2018 4:52 PM

అనిరుధ్ రెడ్డి(కుడి), అక్షిత్ రెడ్డి (ఎడమ) - Sakshi

అనిరుధ్ రెడ్డి(కుడి), అక్షిత్ రెడ్డి (ఎడమ)

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులను హైదరాబాదీలే కైవసం చేసుకున్నారు.

ఏపీ ఎంసెట్‌లో మెడిసిన్, ఇంజనీరింగ్ మొదటి ర్యాంకర్లిద్దరూ నగరవాసులే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులను హైదరాబాదీలే కైవసం చేసుకున్నారు. మెడికల్ విభాగంలో మొదటి మూడు ర్యాంకులను హైదరాబాద్ విద్యార్థులే సాధించడం విశేషం. అంతేకాదు ఇంజనీరింగ్, మెడికల్.. రెండు విభాగాల్లోనూ టాప్ ర్యాంకర్లే కాకుండా అత్యధిక ర్యాంకులు సాధించిన వారు హైదరాబాద్ కేంద్రంగా చదివిన వారు, లేదా హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నవారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్‌లో మొదటి పది ర్యాంకులను.. వ్యవసాయ, మెడికల్ విభాగంలో మొదటి పదిలో ఏడు ర్యాంకులను బాలురే సాధించారు.


అయితే, ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలురతో పోలిస్తే.. బాలికల శాతమే అధికంగా ఉండటం విశేషం. కాకినాడ జేఎన్‌టీయూ ఈ నెల 8న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ఎంసెట్- 2015 (ఇంజనీరింగ్, అండ్ అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌లు గురువారం కాకినాడలో విడుదల చేశారు. ఈ పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 1,70,681 మంది దరఖాస్తు చేయగా 1,62,817 మంది హాజరయ్యారు. వీరిలో 1,41,143 మంది అభ్యర్ధులు (77.42%) అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 84,732 మంది దరఖాస్తు చేయగా 81,010 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 79,398 మంది (89.89%) అర్హత సాధించారు.


ర్యాంకుల పరంగా బాలురదే పై చేయి కాగా, ఉత్తీర్ణతాశాతంలో మాత్రం బాలికలదే హవా. ఇంజనీరింగ్‌లో బాలురు 1,01,472 మంది పరీక్షకు హాజరవ్వగా 74.44 శాతంతో 75,532 మంది అర్హత సాధించారు. అదే బాలికల్లో 61,345 మంది పరీక్ష రాయగా 50,521 మంది (82.36%) అర్హులుగా నిలిచారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో బాలురు 29,515 మంది పరీక్షకు హాజరవ్వగా 25,819 (87.48%) మంది పాసయ్యారు. అదే బాలికల్లో 51,495 మంది పరీక్ష రాయగా 47,001 (91.27%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్‌పరీక్షా ఫలితాల వెల్లడి కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం, కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యేలు పిల్లి అనంతలక్ష్మి, వనమాడి కొండబాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉదయలక్ష్మి, వర్సిటీ వీసీ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇంజనీరింగ్‌లో అనిరుధ్ రెడ్డి..  మెడికల్‌లో శ్రీ విధుల్
ఇంజనీరింగ్ విభాగంలో జూబ్లీహిల్స్‌కు చెందిన కొండపల్లి అనిరుధ్‌రెడ్డి 157 మార్కులు సాధించి మొదటి ర్యాంక్ సాధించాడు. వరంగల్ జిల్లా హసన్‌పర్తికి చెందిన అక్షిత్ రెడ్డి 156 మార్కులతో రెండో ర్యాంకు, విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన కోసూరు జోషి 156 మార్కులతో మూడో ర్యాంక్ సాధించారు. మెడికల్ విభాగంలో శ్రీ విధుల్ మొదటి ర్యాంక్ సాధించగా, రాళ్లబండి సాయి భరద్వాజ్, దామిని 2, 3 స్థానాల్లో నిలిచారు. విధుల్‌కు 151 మార్కులు, సాయి భరద్వాజ్‌కు 151 మార్కులు, శ్రీరామ ధామినికి 150 మార్కులు వచ్చాయి. వీరు ముగ్గురు హైదరాబాద్‌కు చెందినవారే.

ఇంకా ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లా దిల్‌షుక్‌నగర్‌కు చెందిన ఆహ్వాన్ రెడ్డికి 4వ ర్యాంకు, విజయనగరం జిల్లా కె.ఎల్‌పురంకు చెందిన ఎం.సందీప్‌కుమార్‌కు 5వ ర్యాంకు, రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌కు చెందిన సాయిసందీప్‌కు 6వ ర్యాంక్, హైదరాబాద్, నాచారం వాస్తవ్యుడైన జి.శ్రీనివాసరావుకు ఏడో ర్యాంక్,  హైదరాబాద్, కూకట్‌పల్లికి చెందిన ఎం.యశ్వంత్‌కుమార్‌కు 8వ ర్యాంక్, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన ఒ.అఖిల్‌కు 9 వ ర్యాంక్, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన విద్యాసాగర్ నాయుడు 10వ ర్యాంక్ సాధించారు.

మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకర్ శ్రీవిధుల్, రెండో ర్యాంకర్ సాయిభరద్వాజ, 3వ ర్యాంకర్ దామిని, ఆరో ర్యాంకర్ అన్షుగుప్త, 8వ ర్యాంకర్ ఫతీమాలు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా శీలం ఛరిష్మా నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వారు. మెడికల్ విభాగంలో 4, 5, 7 ర్యాంకులు గుంటూరు జిల్లాకు చెందినవారికి రాగా, 10వ ర్యాంక్ సాధించిన అనుదీప్ వైజాగ్ వాసి. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లోనే చదువుకున్నారు.


 
తప్పులతో నష్టపోయాం
ఎంసెట్లో 160 ప్రశ్నలకు 2.30 గంటల్లో సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. అంటే ప్రతీ ప్రశ్నకు దాదాపు 55 సెకన్ల సమయం లభిస్తుంది. ఎంసెట్ 2015లో ఇంజనీరింగ్‌లో మూడు తప్పులు, మెడిసిన్‌లో 7 తప్పులు  దొర్లాయి. ఆ తప్పుల కారణంగా, ఆ ప్రశ్నలకు తాము కేటాయించిన విలువైన సమయాన్ని కోల్పోయామని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. దాంతో తమ ర్యాంకులు తగ్గాయని చెబుతున్నారు. 150 ప్రశ్నలకు ఆన్సర్ చేసి పది ప్రశ్నలు వదిలేసిన వారికీ, అన్ని ప్రశ్నలకూ ఆన్సర్ చేసిన తమకూ అవే ర్యాంకులు వచ్చాయన్నారు. ప్రశ్నాపత్రాల్లోని తప్పులను పక్కన పెట్టి ఇంజనీరింగ్‌ను 157 మార్కులకు, మెడిసిన్‌కు 153 మార్కులకు పరిమితం చేసి లెక్కించడం సరి కాదని కొన్ని కళాశాలల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

ఎంసెట్‌లో క్వాలిఫై.. ఇంటర్లో ఫెయిల్
ఎంసెట్‌లో అర్హత సాధించిన పలువురు ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. ఎంసెట్‌లో అర్హత సాధించినవారిలో ఇంజనీరింగ్‌లో 11,395 మంది, మెడికల్‌లో 4,093 మంది ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అయ్యారు. దాంతో ఎంసెట్‌లో అర్హత సాధించినప్పటికీ వీరిని మినహాయించి ర్యాంకులను ప్రకటించారు.
 
పేదలకు వైద్య సేవలు:  శ్రీవిధుల్
హైదరాబాద్ నాంపల్లి స్టేషన్‌రోడ్‌లోని మహేష్‌నగర్ ప్రాంతానికి చెందిన కంటి వ్యాధుల నిపుణుడు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ రమాదేవిల కుమారుడు శ్రీవిధుల్ ఏపీ ఎంసెట్-2015 మెడికల్ విభాగంలో మొదటి ర్యాంక్ సాధించాడు. వైద్యరంగంలో ఉన్నత చదువులు చదివి సమాజానికి మేలు చేయడమే కాకుండా, ఉచితంగా పేదలకు వైద్యసేవలు అందించడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా విధుల్ పేర్కొన్నాడు.
 
అనుకున్నట్లే ఐదు లోపు:  సాయి భరద్వాజ్
‘టాప్-5 లోపు ర్యాంకు వస్తుందని ఆశించాను. అనుకున్నట్లుగానే రెండో ర్యాంకు రావడం సంతోషకరం. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ కూడా చాలా బాగా రాశాను. అందులో కూడా ర్యాంకు తప్పనిసరిగా రావడం ఖాయం. ప్రస్తుతం ఎయిమ్స్, జిప్‌మర్‌కు ప్రిపేర్ అవుతున్నాను. వాటిలో మంచి ర్యాంక్ వస్తే అక్కడే మెడిసిన్ చేస్తాను’.
 
ఐఐటీలో కంప్యూటర్ సైన్స్: అనిరుధ్‌రెడ్డి
‘ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్నా. మాదాపూర్ కావూరి హిల్స్‌లోని శ్రీ చైతన్య-నారాయణ కాలేజీలో ఇంటర్ చదివాను. జేఈఈ మెయిన్స్‌లో 337 మార్కులు సాధించాను. అందులో ఆలిండియా థర్డ్ బెస్ట్ మార్కులు నావే. మా నాన్న శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణ జెన్‌కోలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాగా, అమ్మ మాధూరీలత గృహిణి. వారి ప్రోత్సాహంతోనే ఈ ర్యాంక్ సాధించా’.
 
ఐఏఎస్ లక్ష్యం: అక్షిత్‌రెడ్డి
హన్మకొండలోఎలక్ట్రికల్ మోటార్ రిపేర్ షాప్ నిర్వహించే దొంతుల రఘోత్తమ్‌రెడ్డి, రజిత దంపతుల మొదటి సంతానం అక్షితరెడ్డి. ఎస్‌ఎస్‌సిలో 9.8 జీపీయే పొదిన అక్షిత్ ఇంటర్‌లో 980 మార్కులు సాధించాడు. ‘ముంబైలో కంప్యూటర్ సైన్స్ విద్య చదివి ఐఏఏస్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా’ అని అక్షిత్‌రెడ్డి చెప్పారు.  
 
జాతీయ సంస్థలో మెడిసిన్ చేస్తా: దామిని
తల్లిదండ్రులు మాధవి,  మునిరత్నంల ప్రోత్సాహం, అధ్యాపకుల ఉత్తమ బోధన ద్వారానే మెడిసిన్‌లో మూడు ర్యాంకు సాధించానని శ్రీరామ దామిని చెప్పారు. ఎనిమిదో తరగతిలో ఉండగానే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ రాసి జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచారు. ‘ఇంతకన్నా మెరుగైన ర్యాంకు వస్తుందని ఆశించా. చివరకు మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ ఎంసెట్ కూడా రాశా. టాప్ ర్యాంకు దక్కుతుందని నమ్మకం ఉంది. స్థానిక కళాశాలల్లో కంటే జాతీయ విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement