హైదరబాద్‌ పోలీసులకు చేదు అనుభవం | hyderabad police bad incident in anantapur district | Sakshi
Sakshi News home page

హైదరబాద్‌ పోలీసులకు చేదు అనుభవం

Nov 10 2017 7:56 AM | Updated on Aug 3 2018 3:04 PM

hyderabad police bad incident in anantapur district - Sakshi

వన్‌టౌన్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేస్తున్న స్వర్ణకారులు

అనంతపురం సెంట్రల్‌: హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ దొంగ చోరీ చేసిన బంగారును కొనుగోలు చేశారనే అభియోగంతో రికవరీ చేయడానికి గురువారం హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు జిల్లాకు వచ్చారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా వస్తారని స్వర్ణకారులంతా వారిని ప్రశ్నించారు. వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ను కూడా ముట్టడించారు. పలువురు స్వర్ణకారులు తెలిపిన వివరాల మేరకు... హైదరబాద్‌ సైబర్‌ పోలీసులు ఓ దొంగను వెంట పెట్టుకొని గురువారం జిల్లాకు వచ్చారు. నేరుగా పాతూరులో బంగారుగేరిలో వీరభద్ర జ్యువెలర్స్‌ షాపులోకి వెళ్ళారు. సదరు దొంగ నుంచి 28 తులాల బంగారు నగలు కొనుగోలు చేశారని అభియోగం మోపారు. దొంగ కూ డా సదరు వ్యక్తులకు విక్రయించి నట్లు తెలిపారు. దీనిని స్వర్ణకారులంతా వ్యతిరేకించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా దొంగ చెప్పినట్లుగా తమపై అభియోగాలు మోపడం ఏంటని ప్రశ్నించారు.

తాము దొంగల నుంచి ఎలాంటి బంగారు కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణా పోలీసులు వెనక్కు వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. అధిక సంఖ్యలో స్వర్ణకారులు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అనంతరం వన్‌టౌన్‌ సీఐ సాయిప్రసాద్‌ స్వర్ణకారుల సంఘం నాయకులతో చర్చలు జరిపారు. ఏమైనా ఇబ్బందులుంటే పరిష్కరించుకోవాలని, ఆందోళనలు చేయడం సరికాదన్నారు. దీంతో వెనక్కు తగ్గిన స్వర్ణకారులు ఆందోళన విరమించారు. పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గురువారం రాత్రి బంగారుగేరిలో సమావేశమయ్యారు. మరోవైపు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులు మాత్రం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నారు. దొంగ నుంచి కొనుగోలు చేసిన బంగారును రికవరీ చేసుకొని వెళ్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement