వ్యభిచారం చేయకపోతే చంపేస్తానంటున్నాడు

Husband Forced Wife For Prostitution - Sakshi

మాట వినకపోతే పిల్లల్ని వ్యభిచార గృహానికి అమ్మేస్తాడట..

15 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నానంటూ ఓ మహిళ ఆవేదన

పెద్దమనుషుల వద్దే పరిష్కరించుకోమని పోలీసుల సలహా

ఆశ్రయం కల్సించిన స్ఫూర్తి మహిళామండలి

సాక్షి, సాలూరు : ‘అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తే నా పాలిట శాపమయ్యాడు. అతని జల్సాల కోసం నన్ను వ్యభిచారం చేయమంటున్నాడు. కాదంటే కొడుతున్నాడు. చంపేందుకు కూడా ప్రయత్నించాడు. ఇద్దరు ఆడపిల్లలతో వేరుగా వుంటున్నా..., తాగివస్తూ వేధిస్తున్నాడు. అతని వల్ల నాకు.. నా బిడ్డలకు ప్రాణహాని వుంది. న్యాయం చేయండి’ అని పట్టణంలోని నాయుడువీధికి చెందిన మహిళ శనివారం పట్టణ పోలీసులకు పిర్యాదు చేసింది. అనంతరం ఆమె విలేకరుల వద్ద తన వేదన వివరించింది. విశాఖపట్నానికి చెందిన తనకు 17ఏళ్ల క్రితం సాలూరుకు చెందిన లారీడ్రైవర్‌ మేకల రమణబాబు(లక్ష్మణ)తో వివాహమైందని, రెండేళ్ల వరకు బాగానే కాపురం చేసినా, ఆ తర్వాత నుంచి వేధింపులు మొదలయ్యాయని తెలిపింది.

పనికి వెళ్లడం మాని, తాగుతూ జల్సాలు చేసేవాడని, కుటుంబం సుఖంగా వుండాలంటే లారీ యజమానితో వివాహేతర సంబంధం కొనసాగించాలని ఒత్తిడి చేశాడన్నారు. గత్యంతరంలేక ఆ పనికి ఒప్పుకున్నానని, దాన్ని సాకుగా చూపుతూ ఏకంగా భిచారమే చేయమంటున్నాడని వాపోయింది. పలుమార్లు హత్యాయత్నం కూడా చేశాడని, ఆ బాధలు తట్టుకోలేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డానని తెలిపింది. రెండేళ్ల క్రితం తన బిడ్డలతో కలసి ఇల్లు వదిలి బయటకు వచ్చేసానని, అయినా వేధింపులు కొనసాగాయని చెప్పింది. శుక్రవారం అర్ధరాత్రి ఇంటికివచ్చి, పెద్దగొడవ చేసాడని, తనను చంపేస్తానని, పిల్లలను వ్యభిచార గృహానికి అమ్మేస్తానని బెదించాడని వాపోయింది.

ఆదుకున్న స్ఫూర్తి మహిళా మండలి : తన కష్టాలను రెండురోజుల క్రితం స్థానిక స్ఫూర్తి మహిళా మండలి దృష్టికి తీసుకువెళ్లానని, ఆ విషయం తెలియడంతో వేధింపులు ఎక్కువయ్యాయని బాధితురాలు వాపోయింది. శుక్రవారం అర్ధరాత్రి గొడవ అనంతరం మహిళా మండలి అధ్యక్షురాలు బి.రాధ తనతో పాటు పిల్లలకు తన ఇంట్లో ఆశ్రయం కల్సించినట్టు తెలిపింది. పలుమార్లు పట్టణ పోలీసులకు తన కష్టాన్ని వివరించానని, పెద్దల వద్ద పరిష్కరించుకోవాలని చెప్పి పంపించేశారని బాధితురాలు తెలిపింది. సమస్య పరిష్కారానికి వచ్చిన పెద్దలు తమ పక్కలోకొస్తేనే న్యాయం జరిగేలా చూస్తామంటున్నారని కన్నీరుమున్నీరైంది. చివరి ప్రయత్నంగా స్ఫూర్తి మహిళా మండలిని ఆశ్రయించానని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top