‘స్పందన’కు వినతుల వెల్లువ

Huge Requested Forms Came To Spandana Programme At Collectorate In Srikakulam - Sakshi

సాక్షి, శ్రీకాకుళం :  కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయనతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, ఇతర అధికారులు  జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డ్వామా పీడీ హెచ్‌.కూర్మారావు, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌ తదితరులు ఉన్నా రు. దసరా పండగ ముందురోజు కావడంతో ఈ వారం తక్కువగా వినతులు వచ్చాయి. ఎక్కువగా సామాజిక సమస్యలపై అందినట్టు తెలిసింది. ‘స్పందన’లో అందిన కొన్ని వినతులివీ.. 
తిత్లీ తుపానులో కొబ్బరి, జీడిమామిడి తదితర వాణిజ్య పంటలు నష్టపోయిన తమకు నేటికీ పరిహారం అందజేయలేదని, సాయం అందించాలని వజ్రపుకొత్తూరు మండల రైతులు టి.శ్రీనివాసరావు తదితరులు కోరారు.

హైవే విస్తరణలో భాగంగా రణస్థలం మండలం రావివలస, రణస్థలం, గరికపాలెం గ్రామా ల పరిధిలో సుమారు 63 ఎకరాల భూములు తీసుకున్నారని, సుమారు 200 మంది రైతులకు నేటి వరకు పరిహారం మంజూరు కాలేదని, పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతూ రైతులు లంక ప్రభాకరరావు, కె.మల్లేశ్వరరావు, పి.వెంకటరమణ, లక్ష్మణరావు, ఆర్‌.రాము, మహాలక్ష్మి వినతి ఇచ్చారు.

ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త జీవో ప్రకారం ఏపీఎస్‌ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులకు 58 నుంచి 60ఏళ్లకు పెంచిన రిటైర్మెంట్‌ వయోపరిమితి పద్ధతిని ఈ ఏడాది మే నెలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వర్తింపచేయాలని కోరుతూ జి.గణపతిరావు, ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం తదితరులు వినతి ఇచ్చారు. 

 తన భూమికి పట్టాదారు పాస్‌ బుక్‌ మంజూరు కోసం దరఖాస్తు చేసుకొన్నానని, అయితే ఆ భూమిపై ఎటుంటి వివాదం, న్యాయపరమైన వాజ్యాలు లేకపోయినా కేసులు ఉన్నట్టు తప్పుడు ఎండార్సుమెంటు ఇచ్చారని రేగిడి మండలం అప్పాపురం గ్రామానికి చెందిన ఎన్‌.అన్నపూర్ణమ్మ తరుపున ఆమె కుమారుడు స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ–పాస్‌ బుక్‌ కోసం 2018, జూన్‌ 6, ఇటీవల 2019 జూలై 22న ఫిర్యాదు చేసినా, న్యాయం జరగలేదని, ఫిర్యాదు చేశారు. 

రాజాం నగర పంచాయతీలోని బొబ్బిలిరోడ్డులో గల శాంతినగర్‌లో ఏర్పాటుచేయనున్న మద్యం దుకాణాన్ని నిలిపివేయాలని స్థానికురాలు బి.జయలక్ష్మి, సరోజా తదితరులు వినతి ఇచ్చారు. శ్రీకాకుళం మండలం సిలగాం సింగులవలస గ్రామం మధ్యలో కాకుండా శివారులో మద్యం దుకాణం ఏర్పాటుచేయాలని కోరుతూ స్థానికులు  సాయమ్మ, రాజేశ్వరి, తదితరులు వినతులిచ్చారు. ఆయా ప్రాంతాల్లోని బడి, గుడి, ఆస్పత్రి, నివాసగృహాలున్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటుతో ఇబ్బందులు తప్పవని, గ్రామానికి దూరంగా ఏర్పాటుచేయాలని వారు కోరారు. 

ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మద్యం షాపుల్లో సేల్స్‌మెన్‌ పోస్టుకు ఎంపికయ్యాయని, అపాయింట్‌ ఆర్డర్‌ అందుకున్నానని, అయితే తనకు వైకల్యం ఉన్నందున విధుల్లో చేర్చుకోనని పలాస ఎక్సైజ్‌ సీఐ తిప్పి పంపారని, న్యాయం చేసి ఆదుకోవాలని డి.బాలకృష్ణ ఫిర్యాదు చేశారు.

రిజిస్ట్రర్‌ వివాహం చేసుకున్న తన భార్య సరితను వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారని, నేటి వరకు ఆచూకీ లేదని ఆమదాలవలసకు చెందిన నూక విశ్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ నివాస్‌ జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసి, చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top