జన భరోసా యాత్ర.. 

Huge public to the Ys Jagan prajasankalpayatra - Sakshi

వివిధ వర్గాల వారికి ధైర్యం చెబుతూ సాగిన జగన్‌ పాదయాత్ర  

ఏడాది తర్వాత కష్టాలు తీరతాయని ధైర్యం చెప్పిన ప్రతిపక్ష నేత 

జగన్‌ను పూల మీద నడిపించిన పోట్లదుర్తి, ప్రొద్దుటూరు ప్రజలు 

జనసంద్రంగా మారిన ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్‌ 

సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర వివిధ వర్గాల వారికి, ప్రభుత్వ బాధితులకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతోంది. శనివారం ఉదయం ఎర్రగుంట్ల శివారులోని బసలో భారతరత్న అబుల్‌కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి జగన్‌ నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రొద్దుటూరు బైపాస్‌ రోడ్డు దాకా జరిగిన ఐదవ రోజు పాదయాత్రలో పలు వర్గాల ప్రజలు జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నారు. ఫిజియోథెరపీ వైద్యులు, 108 ఉద్యోగులు, రాష్ట్రీయ బాల స్వస్త్య ఉద్యోగులు, ఆర్‌టీపీపీ, డిస్కం, జెన్‌కోలో 20 నుంచి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు, కాంట్రాక్టు లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు, వీఆర్‌ఏలు, వివిధ కుల సంఘాల నాయకులు జగన్‌కు కలసి వారి సమస్యలు వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరిస్తామని జగన్‌ భరోసా ఇవ్వడం వారికి కొండంత ధైర్యాన్నిచ్చింది.  

కష్టాలు వింటూ.. ధైర్యం చెబుతూ.. 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రారంభించగానే పోట్లదుర్తి వద్ద 108 ఉద్యోగులు ఆయన్ను కలిశారు. దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో తమ కుటుంబాలు ఆనందంగా బతికాయని, ఇప్పుడు జీతాలు కూడా రావడం లేదని తమ బాధలు వివరించారు. వైఎస్‌ హయాంలో ఎలాగైతే ఆనందంగా ఉండేవారో తాము అధికారంలోకి వచ్చాక అలానే ఉండేలా చూస్తానని వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు. దీంతో వారి ముఖంలో ఒక్కసారిగా ఆనందం కనిపించింది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ డాక్టర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గోసుల శివభరత్‌రెడ్డి నేతృత్వంలో ఫిజియోథెరపీ డాక్టర్లు జగన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఫిజియోథెరపీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసేలా ప్రయత్నం చేయాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీలో మోకాలిచిప్ప మార్పిడి శస్త్రచికిత్సను జత చేస్తామని, అప్పుడు ఫిజియోథెరఫిస్టుల అవసరం ఉంటుంది కాబట్టి.. అందరికీ న్యాయం జరుగుతుందని జగన్‌ చెప్పారు.

ఈ హామీ పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ‘మీ వెంట మేమున్నాం.. మీ సంకల్పం మంచిది.. అంతా జయం కలుగుతుంది..’ అని వారు జగన్‌కు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమంలో పని చేయడానికి 2016 డిసెంబర్‌ 13వ తేదీ నియామక పత్రాలు అందుకున్న వైద్య విభాగం ఉద్యోగులు వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఉద్యోగంలో చేరేందుకు వెళ్లగా ఆ ఉత్తర్వులు నిలిపివేయాలంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయని వారు వారు ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం 70శాతం నిధులిచ్చే ఈ పథకాన్ని కూడా ‘ప్రైవేట్‌’ చేతుల్లో పెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 1,800 మంది నష్టపోతున్నారని వారు జగన్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారంలోకి వచ్చాక సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. ఆర్‌టీపీపీ, డిస్కం, జెన్‌కోలో 20 నుంచి 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌ను కలిసి తమను రెగ్యులరైజ్‌ చేయించాలని కోరారు. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులు జగన్‌ను కలిసి తమ జీతాల పెంపు విషయం ఆలోచించాలని విన్నవించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానం రద్దు చేస్తామని చేసిన ప్రకటన తమ బతుకుల్లో ధైర్యం నింపిందని ఉపాధ్యాయులు జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్లు, ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు, వీఆర్‌ఏలు జగన్‌ను కలసి వారి సమస్యలను వివరించారు. వారందరి సమస్యలు ఓపిగ్గా విని వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని జగన్‌ వారికి హామీ ఇచ్చారు. 

కుల సంఘాల నేతల వినతులు..   
వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరుతూ ఆ సంఘం నాయకులు పోట్లదుర్తి వద్ద జగన్‌ను కలిసి కోరారు. దీనిపై జగన్‌ స్పందిస్తూ.. ఎస్టీ జాబితాలో చేర్చడం కోసం శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని, ఆపై పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. రాయలసీమలో వాల్మీకులకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు ఇచ్చి రాజకీయంగా గుర్తింపు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌కు మద్దతిచ్చి కేంద్రంపై పోరాడాలని ఆ సంఘం నాయకులు జగన్‌ను కోరారు. అధికారంలోకొచ్చాక రజకులకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు, రజక ఫెడరేషన్‌ను కార్పొరేషన్‌గా మార్చుతామని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని ఎమ్మార్పీఎస్‌ నాయకులు జగన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తమకు రాజకీయంగా గుర్తింపు ఇవ్వాలని కురబ సంఘం నాయకులు కోరారు.  

జనమే జనం.. 
ఐదవ రోజు శనివారం పాదయాత్ర  పోట్లదుర్తికి చేరుకోగానే ఒక్కసారిగా జనం ఉన్నట్లుండి రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ నేతలు ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని పట్టించుకోకుండా బయటకు వచ్చి.. జగన్‌కు ఘన స్వాగతం పలికారు. ఎర్రగుంట్ల మండలం నుంచి ప్రొద్దుటూరు శివారులోని అయ్యప్పగుడి వరకు జగన్‌కు జనం నీరాజనాలు పట్టారు. అక్కడి నుంచి బైపాస్‌ రోడ్డులో రాత్రి బసకు చేరుకునే వరకూ అడుగడుగునా జనం భారీగా రోడ్ల మీద నిలబడి జగన్‌ను చూశారు. అమ్మవారి శాల వీధిలోని రోడ్డు మొత్తం పూలు పరచి ప్రతిపక్ష నేతను ఆహ్వానించారు. పుట్టపర్తి సర్కిల్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉండగా.. 4 గంటల నుంచే జనం ఈ రోడ్డు మీద కిక్కిరిసిపోయారు. సాయంత్రం సభ ముగిసే దాకా జగన్‌ కోసం జనం రోడ్డు మీద నిలబడి పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. సభ ముగిశాక కూడా రోడ్డు మీద జనం బారులు తీరి జగన్‌ను చూడటానికి, ఆయనతో చేతులు కలపడానికి ఎగబడ్డారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన పాదయాత్ర రాత్రి 8.30 గంటలకు ముగిసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top