రైలు ఆపి.. వందలాది ప్రాణాలు కాపాడి! 

Huge accident was missed to Padmavati Express - Sakshi

విరిగిన పట్టాలను గమనించి ఎర్రటి టీషర్ట్‌తో రైలుకు ఎదురెళ్లిన రైతు 

పద్మావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం 

రేణిగుంట: సోమవారం.. తెల్లవారుతున్న వేళ... పొలంలో నాట్లు వేసే పని నిమిత్తం ఓ రైతు మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో రైలు పట్టాలు దాటుతూ గుర్తించిన ఓ దృశ్యం, తర్వాత ఆయన చేసిన సాహసం... వందలాది మంది ప్రాణాలను నిలబెట్టింది. ప్రమాద ఘంటికలను మోగిస్తూ విరిగిపోయి ఉన్న రైలు పట్టాలను గమనించిన అన్నదాత ప్రమాదమని తెలిసినా ఎర్రటి టీషర్టు ఊపుతూ రైలుబండికి ఎదురెళ్లి ఆపేశాడు. చిత్తూరు జిల్లా రేణిగుంట–శ్రీకాళహస్తి రైల్వేమార్గంలో మండలంలోని వెదుళ్లచెరువు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనతో పెను ప్రమాదమే తప్పింది. 

వెదుళ్లచెరువుకు చెందిన రైతు మల్లికార్జున్‌ తన పొలంలో నాట్లు కోసం కూలీలను పిలిచేందుకు సోమవారం తెల్లవారుజామున ఎస్టీ కాలనీ వైపు వెళుతుండగా రైలు పట్టాలను దాటే సమయంలో ఎడమ వైపు ఉన్న ఓ రైలు పట్టా రెండుగా విరిగిపోయి ఉండటాన్ని గుర్తించాడు. సమీపంలో వెళుతున్న ఎస్టీ కాలనీకి చెందిన మచ్చ అంకయ్యను అరిచాడు. ఇంతలోనే సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వస్తున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ రైలు దూరంగా కూతపెడుతూ వస్తుండటాన్ని గమనించారు. రైలును ఎలాగైనా ఆపి ప్రమాదాన్ని తప్పించాలని వారిద్దరూ భావించారు.

అంకయ్య వేసుకున్న ఎర్రటి టీషర్టును విప్పి చేతితో ఊపుతూ రైలుకు ఎదురుగా పరుగులు పెట్టారు. గమనించిన రైలు డ్రైవర్‌ విరిగిన పట్టాలకు కొద్ది దూరంలో రైలును ఆపేశాడు. రైల్వే గ్యాంగ్‌మెన్‌ తేజకు విషయాన్ని తెలియజేయడంతో ఆయన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరగంటపాటు శ్రమించి తాత్కాలిక మరమ్మతులను చేసి ఆగి ఉన్న రైలును సురక్షితంగా పంపారు. తర్వాత విరిగిన పట్టాలను శాశ్వత మరమ్మతులు చేశారు. ఉన్నతాధికారులు పరిస్థితిని వాకబు చేసి తప్పిన ప్రమాదంతో ఊపిరి పీల్చుకున్నారు. మల్లికార్జున్‌ను రైల్వే అధికారులు, ప్రయాణికులతోపాటు గ్రామస్తులు ప్రశంసలతో ముంచెత్తారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top