11 రకాల గుర్తింపు కార్డులు

How to Vote Without Voter ID Card in Election Rules And Conditions - Sakshi

ఓటరు కార్డు లేకపోయినా.. వీటితో ఓటు వినియోగం

ఓటర్‌ స్లిప్‌ గుర్తింపు కార్డు కాదు

ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌

అరకు, పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 వరకు మాత్రమే..

జిల్లా వ్యాప్తంగా ఓట్లు 35,75,458

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.భాస్కర్‌

బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఓటర్‌ కార్డు లేనివారు ఎన్నికల సంఘం నిర్ణయించిన 11 రకాల గుర్తింపు కార్డులతో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.భాస్కర్‌ వెల్లడించారు. కలెక్టరేట్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11వ తేదీన జరిగే సాధారణ ఎన్నికల్లో జిల్లాలోని 35,78,458 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపా రు. ఓటర్‌ కార్డు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. 11 రకాల గుర్తింపు కార్డులతో ఓటును వినియోగించుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఫొటో కూడిన ఓటర్‌ స్లిప్‌ గుర్తింపు కార్డు కిందకు రాదని, అది కేవలం పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు నంబర్‌ తెలుసుకునేందుకే మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. జిల్లాలో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న వారిలో 3,43,619 మం దికి ఓటర్‌ కార్డులను పంపిణీ చేశామన్నారు. మరో 80 వేల ఓటరు కార్డులు సోమవారం నాటికి జిల్లాకు రానున్నాయన్నారు. వాటిని మం గళ, బుధవారాల్లో పంపి ణీ చేస్తామని వివరిం చారు. 

సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. గిరిజన ప్రాంతాలైన అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నట్టు చెప్పారు. పోలింగ్‌ సమయం ముగిసేప్పటికి ఎంత మంది లైన్లో ఉంటారో వారందరికీ స్లిప్స్‌ ఇచ్చి పోలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతిస్తామని, తదుపరి వచ్చిన వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు.

గుర్తులతో ఉన్న స్లిప్‌లు పంపిణీచేయరాదు
ప్రభుత్వం ఫొటోతో కూడిన ఓటర స్లిప్‌లను బీపీఎల్‌ ద్వారా పంపిణీ జరుగుతోంది. అయితే పార్టీలు సొంతంగా పంపిణీ చేయాలని భావిస్తే పార్టీ గుర్తులు లేని స్లిప్పులను మాత్రమే అందించాలన్నారు. అలా కాకుండా గుర్తులతో ఉన్న వాటిని ఎక్కడైనా పంపిణీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సమస్యాత్మక గ్రామాల గుర్తింపు:ఎస్పీ బాబూజీ
జిల్లా ఎస్పీ బాబూజీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 2,207 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా.. వాటిలో 256 సమస్యాత్మక, 83 అతి సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అరుకు, పాడేరు నియోజకవర్గాల్లో 469 పోలింగ్‌ కేంద్రాల్లో ఎల్‌.డబ్ల్యూ.ఈ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించినట్టు వివరించారు. ఆంధ్రా, ఒడిశా పోలీసుల సహకారంతో ఈ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రేహౌండ్, సెంట్ర ల్‌ పారా మిలటరీ, స్టేట్‌ ప్రత్యేక దళాల సహకారంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

19 కేంద్రాలకు హెలికాఫ్టర్లలో సిబ్బంది తరలింపు
గిరిజన ప్రాంతాలతోపాటు రోడ్డు మార్గంలోని 19 పోలింగ్‌ కేంద్రాలకు హెలికాఫ్టర్‌ ద్వారా సిబ్బందిని, పోలింగ్‌ సామగ్రిన్ని తరలించనున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల్లో తొలిసారిగా డ్రోన్లను వినియోగించి పటిష్టమైన నిఘా పెడుతున్నామన్నారు.

శరవేగంగా ఓటర్‌ కార్డు, స్లిప్స్‌ పంపిణీ
ఎన్నికల మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఓటర్లకు అవసరమైన ఓటర్‌ కార్డులు, ఓటర్‌ స్లిప్స్‌ను అధికారులు శరవేగంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3,71,520 నూతన కార్డు జారీ చేయగా.. ఇప్పటి వరకు 3,43,619 కార్డులను పంపిణీ చేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 35,78,458 ఓటర్‌ స్లిప్పులను జారీ చేయగా ఇప్పటి వరకు 26,94,821 స్లిప్పులు పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,286 మంది బ్‌లైండ్‌ ఓటర్లకు బ్రైయిలీ స్లిప్స్‌ జారీ చేయగా ఇప్పటి వరకు 6,563 పంపిణీ చేశారు.

కొత్తగా ఆరు పోలింగ్‌ కేంద్రాలు
ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 4052 పోలింగ్‌ కేంద్రాలు ఉండగ వాటికి అదనంగా మరో 6 కేంద్రాలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి జారీ చేసింది. దీనితో జిల్లా వ్యాప్తంగా మొత్తం 4058 కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక పోలింగ్‌ కేంద్రంలో 1600 ఓటర్లు దాటి ఉన్న 39 పోలింగ్‌ కేంద్రాలను విభజించాలని ఎన్నికల కమిషన్‌ను కోరగా.. అందులో కేవలం 6  కేంద్రాలకు కమిషన్‌ అనుమతి జారీ చేసింది. గాజువాక నియోజకవర్గంలో పోలింగ్‌ కేంద్రం నంబరు 54, 157ను, భీమిలి నియోజకవర్గంలో 224, 255, 289, 311 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ గుర్తుంపు కార్డులతో ఓటు వేయవచ్చు
ఆధార్‌ కార్డు
పాస్‌పోర్ట్‌
డ్రైవింగ్‌ లైసెన్స్‌
కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల, ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ కంపెనీల ఉద్యోగులు(ఫొటోతో కూడిన సర్వీస్‌ గుర్తింపు కార్డు)
ఫొటోతో కూడిన బ్యాంకు/పోస్టాఫీసు పాస్‌బుక్‌
పాన్‌ కార్డు
ఎన్‌ఆర్‌సీ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డులు
ఉపాధి హామీ జాబ్‌కార్డు
కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్‌ ఇన్యూరెన్స్‌ స్మార్ట్‌ కార్డు
ఫొటోతో కూడిన పెన్షన్‌ డాక్యుమెంట్‌
ఎంపీ, ఎమ్మెల్యేలకు జారీ చేయబడిన అఫిషీయల్‌ ఐడీ కార్డు

అదనంగా వీవీప్యాట్లు కావాలి: కలెక్టర్‌
ఈవీఎంలకు సంబంధించి అదనంగా వీవీ ప్యాట్లు అవసరం ఉందని, వాటిని అందజేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యాన్ని జిల్లా ఎన్నికల అధికారి కె.భాస్కర్‌ కోరారు. ఆదివారం సీఎస్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించామన్నారు. ఈ సమావేశంలో నగర్‌ పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా, ఎస్పీ బాబూజీ పాల్గొన్నారు.

శాంతి, భద్రతలకు పటిష్ట ఏర్పాట్లు పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా
ఎన్నికల నేపథ్యంలో శాంతి, భద్రతలు పటిష్టంగా అమలు పర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని విశాఖ పోలీసు కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా అన్నారు. సిటీ పరిధిలో 333 కేసులకు సంబంధించి 3,393 మందిని బైండోవర్‌ చేశామని, ఎంసీసీ అతిక్రమించినందుకు 64 కేసులను బుక్‌ చేశామన్నారు. 819 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. మొత్తం 5 వేల 922 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top