అద్దె ఇంట్లో దినం చేయొద్దని వివాదం | Sakshi
Sakshi News home page

అద్దె ఇంట్లో దినం చేయొద్దని వివాదం

Published Mon, Dec 17 2018 1:48 PM

House Owner Conflicts With Rentals - Sakshi

గుంటూరు, పెనమలూరు : ఓ వ్యక్తి మృతి చెందగా అతనికి చిన్న దినం అద్దె ఇంట్లో చేయరాదని ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులు బాధితులపై దాడి చేశారు. ఈ వ్యవహారం వివాదంగా మారటంతో న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పెనమలూరు పోలీస్‌స్టషన్‌ వద్ద ఆదివారం ఆందోళనకు దిగారు. పెనమలూరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కానూరు సనత్‌నగర్‌కు చెందిన కర్రి సన్యాసినాయుడు ఈ నెల 14వ తేదీన పటమటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులు సనత్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అతని మృతదేహాన్ని శనివారం తీసుకురాగా ఇంటి యజమానులు మృతదేహం తీసుకురావద్దని అభ్యంతరం తెలిపారు.

దీంతో రోడ్డుపైనే మృతదేహం ఉంచి అనంతరం దహన సంస్కారాలు పూర్తి చేశారు. కాగా ఆదివారం ఇంటి వద్ద చిన్న దినం చేయటానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇందుకుగాను ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇంటి యజమానులు దీనికి అభ్యంతరం తెలిపారు. మృతుడి కుమార్తె కర్రి హేమలతతో ఇంటి యజమానులు కొండలరావు, పొండూరు పద్మ, సుబ్బులమ్మ, బుల్లి.. తగాదాకు దిగి దాడి చేశారు. దీంతో ఉద్రిక్త పరిíస్థితి ఏర్పడింది. బాధితులు, స్థానికులతో కలిసి పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి తమపై అన్యాయంగా ఇంటి యజమానులు దాడి చేశారని న్యాయం చేయాలని నిరసనకు దిగారు. దీంతో సీఐ దామోదర్‌ ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించి బాధితులను శాంతింప చేశారు. కేసు నమోదు చేస్తానని హామీ ఇచ్చారు.

దాడిపై కేసు నమోదు..
మృతుడి కుమార్తె హేమలతపై ఇంటి యజమానులు దాడి చేయటంతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. హేమలత ఇచ్చిన ఫిర్యాదుతో కొండలరావు, పద్మ, సుబ్బులమ్మ, బుల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, చిన్న దినం కోసం చేసిన ఏర్పాట్లన్నీ చిందరవందర చేయడంతో ఆందోళనల మధ్యే కార్యక్రమాన్ని పూర్తి చేసి మమ అనిపించారు. 

Advertisement
Advertisement