రోగుల ప్రాణాలతో చెలగాటం! | Hospitals Running Without NIOC in Visakhapatnam | Sakshi
Sakshi News home page

రోగుల ప్రాణాలతో చెలగాటం!

Jan 23 2019 7:35 AM | Updated on Jan 23 2019 7:35 AM

Hospitals Running Without NIOC in Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రైవేటు, ప్రభుత్వాస్పత్రులు.. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. విశాఖ నగరంలో 85 శాతం ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు లేకుండానే నడుస్తున్నాయి. అగ్నిమాపకశాఖ జారీ చేసిన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీలు) ఉంటేనే ఆస్పత్రులు నడవాలి. కానీ నగరంలో అలాంటి ఎన్‌వోసీలతో పనిలేకుండానే ఆస్పత్రుల యాజమాన్యాలు వాటిని నిరభ్యంతరంగా నడుపుతున్నాయి. ఏళ్ల తరబడి ఈ ఆస్పత్రులు ఎన్‌వోసీలు లేకుండా నడుస్తున్నా అగ్నిమాపకశాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. సంబంధిత ఆస్పత్రులకు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారు.

విశాఖ నగరంలో ప్రభుత్వ ఆస్పత్రులు 58, ప్రైవేటు ఆస్పత్రులు 213 వెరసి 271 ఉన్నాయి. వీటిలో కేవలం 44 (ప్రైవేటువి 38) ఆస్పత్రులు (15 శాతం) మాత్రమే ఎన్‌వోసీలను కలిగి ఉన్నాయి. మిగిలిన 227 ఆస్పత్రులు అగ్నిమాపకశాఖ నిర్ణీత ప్రమాణాలతో పనిలేకుండా నడుస్తున్నాయి. పలు ప్రైవేటు ఆస్పత్రులు నామమాత్రపు అగ్నిమాపక పరికరాలతో నడుపుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు ఎన్‌వోసీల కోసం దరఖాస్తు చేసినట్టు చెబుతున్నాయి. ఇంకా చాలా ఆస్పత్రులు ఇప్పటికీ దరఖాస్తే చేయడం మానేశాయి. కానీ నిబంధనల మేరకు అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఎన్‌వోసీలు పొందలేకపోతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. మరో విశేషమేమిటంటే ఇలా ఎన్‌వోసీలు పొందని ప్రభుత్వాస్పత్రుల్లో కేజీహెచ్‌తో పాటు విక్టోరియా (ఘోషా) ఆస్పత్రులు కూడా ఉన్నాయి.

ఇవీ నిబంధనలు..
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆస్పత్రుల్లో అగ్నిమాపక నిరోధక పరికరాలు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? అన్నదానిపై స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. వీటిని పర్యవేక్షించాలని కొన్నాళ్ల క్రితం అగ్నిమాపకశాఖ అధికారులను ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఆస్పత్రి ప్రతి ఫ్లోర్‌లోనూ ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో స్ప్రింక్లర్లు, ౖఫైర్‌ డిటెక్షన్‌ సిస్టం వంటివి ఏర్పాటు చేయాలి. వీటితో పాటు అత్యవసర మెట్ల మార్గం, ర్యాంపులు, ప్రత్యేక ఫైర్‌ పంపులు ఉండాలి. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో నిమిషానికి 1,620 లీటర్ల వేగంతో నీటిని పంప్‌ చేయగలిగే 50 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న నీటి ట్యాంకును ఏర్పాటు చేయాలి. కానీ చాలా ఆస్పత్రుల్లో ఇలాంటివేమీ లేవు. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు సంబంధిత ఆస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులకు కూడా రెండుసార్లు లేఖలు రాసినా అటు నుంచి స్పందన లేదని అగ్నిమాపకశాఖ అధికారులు చెబుతున్నారు. నిర్దేశిత ప్రమాణాలు లేకుండా నడుస్తున్న ఈ ఆస్పత్రుల్లో ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై ఆందోళన వ్యక్తమవుతోంది.

నగరంలో ఫైర్‌ ఎన్‌వోసీ పొందని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని..

ఆస్పత్రి పేరు                                 ప్రాంతం
ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌             హనుమంతవాక
లాజరస్‌ హాస్పిటల్‌                      వాల్తేరు మెయిన్‌రోడ్డు
సూర్య హాస్పిటల్‌                         మహరాణిపేట
శంకర్‌ ఫౌండేషన్‌ ఐ హాస్పిటల్‌         వేపగుంట
వాసన్‌ ఐ కేర్‌ హాస్పిటల్‌               రామ్‌నగర్‌
ఏఎంజీ రూత్‌ డిచ్‌మన్‌ హాస్పిటల్‌    నక్కవానిపాలెం
సెయింట్‌ జోసెఫ్‌ హాస్పిటల్‌            మహరాణిపేట
కనకదుర్గ నర్సింగ్‌హోం               జిల్లాపరిషత్‌  
గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌    రుషికొండ
అనిల్‌ నీరుకొండ ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్‌      సంగివలస
లైఫ్‌కేర్‌ మల్టిస్పెషాలిటీ హాస్పిటల్‌            కంచరపాలెం
ఏసియన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఈఎన్‌టీ ఆస్పత్రి    పెదవాల్తేరు    
వైష్ణవి హాస్పిటల్‌    కలెక్టరేట్‌–బీచ్‌రోడ్డు    లోటస్‌ హాస్పిటల్‌ గోపాలపట్నం
మాక్స్‌ విజన్‌ ఐ హాస్పిటల్‌                డైమండ్‌పార్క్‌
ఆర్కే హాస్పిటల్‌                              గాజువాక

రెండోసారి నోటీసులిస్తాం..
ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించని, ఎన్‌వోసీలు సమర్పించని ఆస్పత్రులకు ఇప్పటికే ఒకసారి నోటీసులు జారీ చేశారు. 30 నుంచి 50 రోజుల్లో వారి నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఇప్పటికీ చాలా ఆస్పత్రుల నుంచి స్పందన లేదు. వీటికి త్వరలోనే రెండోసారి నోటీసులిస్తాం. అప్పటికీ స్పందించకపోతే ప్రాసిక్యూషన్‌ కోసం ఫైర్‌ సర్వీస్‌ డైరెక్టర్‌ జనరల్‌కు సిఫార్సు చేస్తాం.
–ఇ. స్వామి, రీజనల్‌ ఫైర్‌ సేఫ్టీ అధికారి, జీవీఎంసీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement