హ్యాండ్‌ ఇచ్చిన బాబు.. అవాక్కైన హర్షకుమార్‌!

Harsha Kumar Shocked By Chandra Babu - Sakshi

సీఎం చంద్రబాబు కాళ్లు పట్టుకొని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అభ్యర్థించడం ఆయన అభిమానులను హతాశులను చేసింది. వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ తనకంటూ ఓ ఒరవడిని ఏర్పరుచుకున్న ఈయన అలా సాగిలబడడమేమిటంటూ ఆయన అభిమానులు మనస్తాపానికి గురయ్యారు. వ్రతం చెడ్డా ఫలం దక్కకపోవడంతో తలపట్టుకుంటున్నారు హర్షకుమార్‌. ‘మొగుడు కొట్టాడని కాదు ... తోటికోడలు నవ్విందని’ వెనుకటికో కోడలు తెగ బాధపడిపోయినట్టుగా ... సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు జోరందుకోవడంతో మరింత అవమానానికి గురవుతున్నారు.

సాక్షి ప్రతినిధి, కాకినాడ : గత పది రోజులుగా జిల్లాలో టీడీపీకి చెందిన కీలక నేతలు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యాయి. నమ్మించి మోసగించడంలో చంద్రబాబు ఘనపాఠీ అని చెప్పకనే చెప్పారు. వెన్నుపోటు పొడవటంలో సిద్ధహస్తుడని ఆ పార్టీ నేతలకే స్పష్టమయింది. కానీ...రాజకీయాల్లో అపారమైన అనుభవం, సీనియర్‌ నాయకుడిగా, రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసిన హర్షకుమార్‌కు చంద్రబాబు నైజం తెలియకపోవడమేమిటని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తనకు టిక్కెట్‌ ఇస్తారని ఏ విధంగా అనుకున్నారని, వాడుకుని వదిలేసే నైజం గల చంద్రబాబు ఉన్న పళంగా అందలమెక్కిస్తారని ఎలా ఊహించారని, కష్టపడ్డ వారికే గుర్తింపు లేనప్పుడు రెండు రోజుల ముందు పార్టీలో చేరిన వ్యక్తికి పట్టం ఎలా కడతారని భావించారని బాబు వైఖరి తెలిసిన రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

మాజీ ఎంపీ హర్షకుమార్‌దీ అదే దుస్థితి...
మాజీ ఎంపీ హర్షకుమార్‌కు కూడా సీఎం చంద్రబాబు ఝలక్‌ ఇచ్చారు. ఆయన కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలనే అనుభవాలున్నా ఇంకా మోసపోతున్నవారి జాబితా పెరుగుతూనే ఉంది. టిక్కెట్‌ వస్తుందన్న ఆశతో... కాదు కాదు మధ్యవర్తుల రాయ‘బేరం’తో టీడీపీలో చేరిన హర్షకుమార్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. తొలుత ఎంపీ సీటు ఇస్తారని లీకులు ఇచ్చారు. తర్వాత అమలాపురం ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం చేశారు. ఆ తర్వాత పార్టీలో చేరబోతున్న హర్షకుమార్‌కు అమలాపురం ఎంపీ ఖాయమైందని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో హర్షకుమార్‌కు టిక్కెట్‌ ఖరారైందని, అందుకే పార్టీలో చేరుతున్నారని అంతా భావించారు. కానీ ‘డామిట్‌ కథ అడ్డం తిరిగి’నట్టుగా పార్టీలోకి చేరిన తర్వాత చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టారు. అమలాపురం ఎంపీ అభ్యర్థిగా గంటి హరీష్‌కు, అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావుకు ఖరారు చేసి హర్షకుమార్‌కు మొండిచేయి చూపించారు. ఈ టిక్కెట్‌ వస్తుందనే ఆశతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై కూడా హర్షకుమార్‌ నోరుపారేసుకున్నారు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.

చంద్రబాబు కాలు పట్టుకోవడంపై తీవ్ర అసహనం
కాకినాడలో రెండు రోజుల కిందట పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు కాలు పట్టుకోవడంపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ అభిమానులు, దళితులు, ప్రజా సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సీటు కోసం ఇంతగా దిగజారాలా అని పెదవి విరిచారు. నెటిజన్లయితే హర్షకుమార్‌ తీరుపై పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు. ఆయన సీనియారిటీని, స్థాయిని దిగజార్చుకుని వ్యవహరించడం సరికాదని ఆయన్ని అభిమానించేవారే పెదవి విరుస్తున్నారు.

చంద్రబాబు నమ్మక ద్రోహి. వెన్నుపోటు పొడిచాడు. టిక్కెట్‌ ఇస్తానని నమ్మించి మోసగించాడు. గెలిపించిన పార్టీని వదిలి టీడీపీలో చేరి తప్పు చేశాను. పశ్చాత్తాపం చెందుతున్నాను.
– ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వ్యాఖ్యలివీ...

చంద్రబాబు అన్యాయం చేశారు. పార్టీ కోసం కష్టపడ్డ ఎంపీ నరసింహంను అణగదొక్కేందుకు యత్నించారు. టిక్కెట్‌ ఇవ్వకుండా పార్టీ మోసం చేసింది. టిక్కెట్‌ సంగతి పక్కన పెడితే కనీసం నా భర్త ఆరోగ్యం ఎలా ఉందో ఆరాతీసే పరిస్థితి కూడా లేదు. 
– ఎంపీ నరసింహం భార్య తోట వాణి ఆవేదనిదీ.. 

టీడీపీలో బ్రోకర్లదే పైచేయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు లేదు. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశాడు. కాళ్లరిగేలా తిప్పుకుని మోసగించారు. కనీస గౌరవం ఇవ్వలేదు.
– పులపర్తి నారాయణమూర్తి, టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రోదనిదీ...

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top