బెల్టుషాపుల రద్దుతో నాటు.. ఘాటు! | Gudumba Preparation In Villages With The Abolition Of Beltshops | Sakshi
Sakshi News home page

నాటు.. ఘాటు!

Jul 15 2019 11:22 AM | Updated on Jul 15 2019 11:22 AM

Gudumba Preparation In Villages With The Abolition Of Beltshops - Sakshi

ఇది కనగానపల్లి మండలం బద్దలాపురంలో నాటు సారా తయారీ స్థావరం. గ్రామ సమీపంలో ఉండే పొలాల్లోనే సారా కాస్తున్నారు. ఇక్కడ రోజుకు 1500 లీటర్ల సారా తయారు చేస్తున్నట్లు సమాచారం. గ్రామంలో 10 కుటుంబాలు దాకా ఇదే పని చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యర్థ పదార్థాలతో తయారుచేసే ఈ నాటు సారాను లీటరు రూ.100లతో విక్రయిస్తున్నారు. విషపూరితమైన నాటుసారా తాగి గ్రామంలో చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలను పొగొట్టుకొంటున్నారు. నాటుసారాకు బానిసైన  ఓ వ్యక్తి 15 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో బెల్టు షాపులు రద్దు కావటంతో నాటుసారా అన్ని చోట్లకు విస్తరిస్తోంది. కనగానపల్లి మండలంతోపాటు చెన్నేకొత్తపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో కూడా నాటుసారా తయారీ కేంద్రాలు ఉన్నాయి. ఈ మూడు మండలాల పరిధిలో సుమారు 15 గ్రామాల్లో  నాటుసారా తయారీదారులు ఉన్నట్లు సమాచారం. 

సాక్షి, కనగానపల్లి: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను మద్యం మత్తు నుంచి దూరం చేయాలని గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేసింది. అయితే నాటుసారా తయారీదారులు పేదల బతుకుల్లో కుంపటి పెడుతున్నారు. బెల్టు షాపుల రద్దు తర్వాత గ్రామాల్లో నాటు సారాయి తయారీ, అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. రాష్ట్రానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మద్యం మహమ్మారి నుంచి ప్రజలను కాపాడి, వారిని ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్య నిషేధాన్ని విడతల వారీగా అమలు చేయాలని చూస్తున్నారు.  

ప్రజారోగ్యం ప్రశ్నార్థకం 
కుళ్లిన పండ్లు, వ్యర్థ పదార్థాలతో ఈ నాటుసారా తయారు చేస్తుండటంతో ఇది చాలా మత్తుగా ఉండటంతో పాటు విష పూరితంగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నాటుసారా తయారీలో ఎక్కువగా కుళ్లిన అరటి పండ్లు, చెడిపోయిన బెల్లం, యూరియా వంటి పదార్థాలు వినియోగిస్తారు. దీనిని తయారు చేసేందుకు రూ.20(లీటర్‌కు) ఖర్చు వస్తే, తర్వాతా దీనిని రూ.100 లకు విక్రయిస్తూ తయారీదారులు మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అయితే దీనిని తాగేవారు మాత్రం ఆర్థికంగా నష్టపోవటంతో పాటు వారి ఆరోగ్యాలను కూడా పాడు చేసుకొంటున్నారు. బద్దలాపురంలో నాటుసారా ఎక్కువగా సేవించి ఆరోగ్యాలు పాడుచేసుకొని కొందరు ప్రాణాలను కూడా పొగొట్టుకొంటున్నారని గ్రామంలోని మహిళలు వాపోయారు.  

దాడులు చేస్తే ఒట్టు.. 
మండలంలో పలుచోట్ల నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగుతున్నా, దీనిని నివారించవలసిన ఎక్సైజ్‌ అధికారులు మండలంలో ఎక్కడా దాడులు చేయటం లేదు. 
దీంతో బద్దలాపురం, వేపకుంట, తూంచర్ల, పాతపాళ్యం వంటి గ్రామాల్లో విచ్చలవిడిగా నాటుసారా తయారీ, విక్రయాలు కొనసాగిస్తున్నారు. ఇక గ్రామాల్లో సాధారణ పోలీస్‌ సిబ్బంది కూడా కేవలం మద్యం బెల్టు షాపులపై మాత్రం దాడులు చేసి, నాటు సారా విక్రయాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించి నాటుసారా మహమ్మారి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.  

మద్యాన్ని ప్రజలకు దూరం చేయాలి  
మద్యపానంతో గ్రామాల్లో చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులను రద్దు చేయించినా కొన్ని గ్రామాల్లో నాటుసారా తయారీ చేసి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆర్థికంగా దెబ్బతినటంతో పాటు అనారోగ్యం పాలవుతున్నారు. బద్దలాపురంలోనే నాటుసారాకు అలవాటు పడి చాలా మంది అనారోగ్యాల పాలై ప్రాణాలు కూడా పోగొట్టుకొన్నారు.  ఎక్సైజ్‌ అధికారులు గ్రామాల్లో విసృతంగా తనిఖీలు చేసి నాటుసారా తయారీని అరికట్టాలి.
–నాగార్జున, బద్దలాపురం, కనగానపల్లి మండలం 

స్థావరాలపై దాడులు నిర్వహిస్తాం  
ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో మద్యం బెల్టు షాపులను పూర్తీగా నివారించాం. అయితే గ్రామాల్లో నాటుసారా తయారీ జరుగుతున్నట్లు మాకు ఎక్కడా సమాచారం లేదు. నాటుసారా తయారీ స్థావరాలు ఉన్నట్లు తెలిస్తే వెంటనే వాటిపై దాడులు చేసి, విక్రయదారులపై చర్యలు తీసుకొంటాం.    
  –తఖీబాషా, ఎక్సైజ్‌ సీఐ, చెన్నేకొత్తపల్లి  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement