ప్రతి వ్యక్తీ సంవత్సరానికి పది మొక్కలు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు.
	ప్రతి ఒక్కరూ పది మొక్కలు పెంచాలి
	ఐదు కోట్ల జనాభా   భాగస్వాములైతే భవిష్యత్ తరాలకు గ్రీనరీ
	కార్తీక వనమహోత్సవంలో    రాష్ర్ట ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడు
	 
	గుంటూరు : ప్రతి వ్యక్తీ సంవత్సరానికి పది మొక్కలు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. ఈ విధంగా రాష్ట్రంలోని ఐదు కోట్ల జనాభా మొక్కలు నాటితే మొత్తం 50 కోట్ల మొక్కలు పెరిగి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే గ్రీనరీ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తుళ్ళూరు మండలం అనంతవరం  గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్తీక వనమహోత్సవ   కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ విద్యార్థి దశ నుంచి వాతావరణ కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగించేందుకు ప్రతి పాఠశాలలో వివిధ దశల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు , అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.కె.ఫరీద తదితరులు ప్రసంగించారు.
	 
	మొక్కలు నాటిన ముఖ్యమంత్రి ...
	 తొలుత ముఖ్యమంత్రి  మొక్కలు నాటి కార్తీక వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కలిగించారు. వారితో ముఖాముఖి మాట్లాడారు. విద్యార్థులకు వేదికపై ప్రసంగించే అవకాశం కల్పించారు.చెట్ల పెంపకాన్ని ఒక బాధ్యతగా చేపడుతున్న అనంతవరం గ్రామానికి చెందిన బండ్లి పాపమ్మ అనే వృద్ధురాలిని  సీఎం సభాముఖంగా అభినందించారు. గ్రామ సర్పంచ్ రాజేష్, డ్వాక్రా గ్రూపు సభ్యులు గ్రామంలో చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపడుతుందీ లేనిదీ విద్యార్థుల నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారు. అనంతరం భవనచంద్ర పర్యావరణ పరిరక్షణ సమితి రూపొందించిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆ తరువాత కార్యక్రమంలో భాగస్వాములైన వారందరి చేత హరిత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, శాసనసభ్యు లు కొమ్మాలపాటి శ్రీధర్, జి.వి.ఎస్.ఆర్. ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జాయింట్ కలెక్టర్ ఎన్.శ్రీధర్, సంయుక్త కలెక్టర్ -2 ఎం. వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
