సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం

Grama Sachivalayam Exam Details In Kadapa District - Sakshi

ప్రతి పరీక్ష హాలులో వీడియోగ్రాఫర్‌

అభ్యర్థులూ పుకార్లను నమ్మొద్దు

జిల్లా కలెక్టర్‌ హరి కిరణ్‌

సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల తరహాలో గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించనున్నామని కలెక్టర్‌ హరి కిరణ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి 8వ తేది వరకు జరిగే ఈ పరీక్షల కోసం 419 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1,44,337 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. మొదటిరోజు 1,03,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు.

అధికారుల నియామకం
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ఏడు వేల మంది సిబ్బందిని నియమించామని కలెక్టరు తెలిపారు. పరీక్షా హాలులో వీడియోగ్రాఫర్లు ఉంటారన్నారు. 1141 మంది వీడియో గ్రాఫర్లను నియమించాలన్నారు. మహిళా అభ్యర్థుల తనిఖీకి అంగన్‌వాడీ వర్కర్లను నియమించామన్నారు.  అంధులు, రెండు చేతులు లేని వాళ్ల కోసం 86 మంది స్క్రైబ్స్‌ను నియమించామన్నారు. పదవ తరగతి పాసైన వారిని ఇందుకోసం వినియోగిస్తున్నామన్నారు. ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నాపత్రాలను జిల్లా ట్రెజరీలో భద్రపరిచామన్నారు. శనివారం వీటిని సంబంధిత పోలీసుస్టేషన్లకు పంపుతున్నామన్నారు. పోలీసుస్టేషన్‌లో డబల్‌ లాక్‌ గదిలో వీటిని భద్రపరుస్తామన్నారు. ఒక తాళం చెవి తహసీల్దార్‌ వద్ద, మరొకటి ఎస్‌ఐ వద్ద ఉంటుందన్నారు. పోలీసుస్టేషన్‌లో సీసీ కెమెరాలను అమర్చారని తెలిపారు. వీటిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందుకోసం 08562–244070 లేదా 244437 నెంబర్లు అందుబాటులో ఉంటాయన్నారు. విధి నిర్వహణలో అధికారులకు ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే కలెక్టరేట్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ రూముకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు.

ఉదయానికి ఓఎంఆర్‌ షీట్లు చేరవేత
సెప్టెంబరు 1వ తేది ఉదయం 6.00 గంటలకు ఓపెన్‌చేసి ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నాపత్రాలను గట్టి బందోబస్తు మధ్య పరీక్షా కేంద్రాలకు పంపుతామని హరికిరణ్‌ చెప్పారు. ఓఎంఆర్‌ షీట్‌లో బ్లాక్‌ లేదా బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్నతోనే రాయాల్సి ఉంటుందన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత అధికారులు ఓఎంఆర్‌ షీట్‌ తీసుకుని అభ్యర్థికి కార్బన్‌ షీట్‌ ఇస్తారన్నారు. కీ విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఆ తర్వాత ఫైనల్‌ కీ, ఫలితాలు విడుదల అవుతాయని తెలిపారు. ఈ పరీక్షలో ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేశారు. మెరిట్‌ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయన్నారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఇప్పిస్తామని వచ్చే మధ్యవర్తుల మాటలను నమ్మవద్దన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే కలెక్టరేట్‌లోని హెల్ప్‌డెస్క్‌కు ఫోన్‌ చేసి తెలుపాలన్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఫ్లయింగ్‌ స్వా్కడ్స్‌ను ఏర్పాటు చేశామని, అభ్యర్థులెవరూ మాల్‌ ప్రాక్టిసెస్‌కు పాల్పడరాదన్నారు. పరీక్ష ముగిసిన తర్వాత ఓఎంఆర్‌ షీట్లను జిల్లా పరిషత్‌లోని రిస్పెన్షన్‌ సెంటర్‌కు తీసుకు వస్తామన్నారు. ఏరోజుకు ఆరోజు వాటిని డీజీటీ వాహనాల్లో విజయవాడకు తరలిస్తామన్నారు.

అభ్యర్థులకు సూచన
పరీక్ష ప్రారంభానికి గంట ముందే అభ్యర్థులు తమతమ పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ 340 ప్రత్యేక బస్సులను నడుపుతోందన్నారు.  అభ్యర్థులు ఎలక్ట్రానిక్‌ గాడ్జెస్‌ తీసుకు రాకూడదన్నారు.  బాల్‌ పెన్ను, హాల్‌ టిక్కెట్, ఏదో ఒక ఐడీ ప్రూఫ్, ఒక రైటింగ్‌ ప్యాడ్‌ మాత్రమే తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ గౌతమి, రెండవ జేసీ శివారెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శ్రీవాస్‌ నుపూర్, డీఆర్వో రఘునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

పరీక్షల్లో జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి
సచివాలయ పరీక్షల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్‌ హరి కిరణ్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సభా భవనం, మీ కోసం హాలులో పరీక్షలకు సంబంధించిన చీఫ్‌ సూపరింటెండెంట్లు, సెంటర్‌ స్పెషల్‌ ఆఫీసర్లకు ఏర్పాటు చేసిన మెటీరియల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వివిధ అంశాలపై సూచనలు చేశారు. ఇతరుల సహాయంతో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం పదవ తరగతి ఉత్తీర్ణులైన వారినే సహాయకులుగా నియమించాలన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకునే సమయంలోనే అభ్యర్థులు పేర్కొని ఉండాలన్నారు. అలాంటి వారికే స్క్రైబ్స్‌ ఇవ్వాలన్నారు. ఎక్కడైనా వీడియోగ్రాఫర్ల సమస్య ఎదురైతే పరీక్షల ప్రారంభానికి ముందే జాయింట్‌ కలెక్టర్‌ గౌతమితో సంప్రదించాలన్నారు. ఓఎంఆర్‌ షీట్లతోపాటు నామినల్‌ రోల్స్‌ పంపుతామన్నారు. ప్రతి కేంద్రానికి ఇన్విజిలేటర్లు, హాలు సూపరింటెండెంట్లు 20 శాతం అదనంగా కేటాయించామన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌లో ఏర్పాటు చేసి రిసెప్షన్‌ సెంటర్‌ను కలెక్టర్‌ తనిఖీ చేశారు. 

జిల్లా వ్యాప్తంగా వచ్చే నెల(సెప్టెంబర్‌) ఒకటో తేదీన నిర్వహించే పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5 రాత పరీక్ష కీలకం కానుంది. నాలుగు పోస్టులకు గాను ఒకటే పరీక్ష కావడంతో.. ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. సాధారణ డిగ్రీ అర్హత కావడం కూడా ఎక్కువ దరఖాస్తులు రావడానికి మరో కారణమని చెప్పవచ్చు. కేటగిరీ–1లో పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌–5, మహిళా పోలీస్, సంక్షేమ కార్యదర్శి, వార్డు పరిపాలన కార్యదర్శి పోస్టులకు 70 వేలకు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. చిన్న పాటి మండల కేంద్రాల్లో సైతం కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో వారి సౌలభ్యం కోసం వెబ్‌సైట్‌లో నో యువర్‌ వెన్యూ పేరిట ఒక ఆప్షన్‌ ఏర్పాటు చేశారు. 

  • నో యువర్‌ వెన్యూను క్లిక్‌ చేయగానే ఒక కొత్త విండో ఓపెన్‌ అవుతుంది. అందులో జిల్లాను సెలక్షన్‌లో కడపను ఎంచుకోవాలి. అప్పుడు జిల్లాలోని పరీక్షా కేంద్రాల కోడ్‌లు వస్తాయి. హాల్‌టికెట్‌లో ఉన్న వెన్యూ కోడ్‌ను ఎంపిక చేయగానే క్లిక్‌ చేయాలి
  • అక్షాంశాలు, రేఖాంశాలతోపాటు పరీక్షా కేంద్రం ఫొటో వస్తుంది. దీంతోపాటు ఊరు, పరీక్షా కేంద్రం చిరునామా(అడ్రస్‌) కూడా చూడవచ్చు. 
  • అదే విండోలో చివరన క్లిక్‌ హియర్‌ అనే అప్షన్, పక్కనే వెన్యూ లొకోషన్‌ ఇన్‌ గూగూల్‌ మ్యాప్స్‌ అని కనిపిస్తుంది.
  • దాన్ని క్లిక్‌ చేయగానే కొత్త విండోలో మ్యాప్‌ వస్తుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న అభ్యర్థులు లొకేషన్‌ను చూసుకుని డైరెక్షన్స్‌ను సెట్‌ చేసుకుని కేంద్రాలకు వెళ్లవచ్చు. 
  • మ్యాప్‌ను సైతం ఇతర ఫోన్‌ నంబరు, మెయిల్‌కు కూడా పంపుకునే అవకాశం కల్పించారు. గూగుల్‌ మ్యాప్స్‌తో సులువుగా కేంద్రాన్ని చేరుకునేలా ఈ ఏర్పాటు చేశారు.
  • సూచనలు పరీక్షా రాసే అభ్యర్థులు ప్రభుత్వం చెప్పిన సూచనలు పాటించాల్సిన అవసరం చాలా ఉంది. 
  • పరీక్షలు రోజూ ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 2.30కు ప్రారంభం అవుతాయి. అభ్యర్థి కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరితే మంచిది. 
  • పరీక్షా కేంద్రంలోకి ఉదయం 9.30, మధ్యాహ్నం 2 గంటల తరువాత మాత్రమే అభ్యర్థులు ప్రవేశించేందుకు అధికారులు అవకాశం కల్పిస్తారు. ఉదయం 10, మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించరు. 
  • హాల్‌టికెట్‌తోపాటు కనీసం ఒక ఫొటో ఐడెంటిటీ కార్డును వెంట తెచ్చుకోవాలి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ, ఆధార్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగైతే గుర్తింపు కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను గుర్తింపు కార్డుగా తెచ్చుకోవచ్చు. 
  • హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోతే అటువంటి అభ్యర్థులు మూడు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలను గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించి తెచ్చుకుని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి. 
  • ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను తెచ్చుకోకూడదు. మొబైల్‌/సెల్‌ఫోన్, కాలిక్యులేటర్స్, ట్యాట్స్, బ్లూటూత్, పేజర్స్‌ వంటి పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. 
  • ప్రశ్నాపత్రాన్ని తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. పరీక్షా సమయం 150 నిమిషాలు. 
  • పరీక్షా పత్రాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. తదుపరి సరైన సమాధానాన్ని ఎంచుకుని ఓఎమ్మార్‌ షీట్‌లో బబుల్‌ చేయాలి. ఇందుకోసం బాల్‌ పాయింట్‌ పెన్‌ బ్లూ/బ్లాక్‌ మాత్రమే వినియోగించాలి. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌ పెన్‌ వినియోగిస్తే జవాబుపత్రాన్ని ఇన్‌వ్యాలిగ్‌గా పరిగణిస్తారు.
  • ఓఎమ్మార్‌ షీట్‌లో వైటనర్, ఇతర మార్కర్‌లను వినియోగిస్తే డిస్‌క్యాలిఫై చేస్తారు. ఓఎమ్మార్‌ షీట్‌లు రెండు ఉంటాయి. పై షీట్‌లో జవాబులను నమోదు చేయాలి. రెండో షీట్‌ను పరీక్ష అనంతరం అభ్యర్థి తెచ్చుకోవచ్చు. తమ సమాధానాలను చూసుకునే అవకాశం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. 
  • మరిన్ని వివరాల కోసం గ్రామసచివాలయం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించి తెలుసుకోవచ్చు.

నెగిటివ్‌ మార్కులున్నాయ్‌.. జాగ్రత్త

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ పోస్టులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల పద్ధతి పెట్టారు. సరైన సమాధానానికి ఒక మార్కు ఇస్తారు. అదే తప్పుగా సమాధానం రాస్తే 0.25 (1/4) మార్కును ఫెనాల్టీగా వేస్తారు. 

హాల్‌టికెట్ల వివరాలు ఇలా...
ఈ నెల 24 నుంచే కేటగిరి–1 పరీక్షకు సంబంధించిన హాల్‌టకెట్లను వెబ్‌సైట్‌లో ఉంచారు. అభ్యర్థులు  పుట్టిన రోజుతోపాటు దరఖాస్తు సమయంలో వచ్చిన ఒన్‌ టైం ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ నంబరు (ఓటీపీఆర్‌), దరఖాస్తు ఐడీ, ఆధార్‌ నంబర్‌లలో ఏదైనా ఒకటి ఎంటర్‌ చేసి పొందవచ్చు. 

ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
జిల్లాలోని పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 134 బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు నడుపుతున్నారు. ఇందులో కడప డిపో నుంచి 16, బద్వేలు 13, రాయచోటి 25, రాజంపేట 18, జమ్మలమడుగు 15, మైదుకూరు 14, ప్రొద్దుటూరు 17, పులివెందుల డిపో నుంచి 13 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. దీంతో పాటు అభ్యర్థుల సౌలభ్యం కోసం ఆర్టీసీ హెల్ప్‌లైన్లను సైతం నిర్వహిస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల నుంచి ప్రత్యేక సర్వీసులు ప్రారంభమవుతాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top