కురుమతి రాయ గోవిందా.. గోవిందా


ఆత్మకూర్, న్యూస్‌లైన్: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం శనివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. ‘ఏడుకొండల వాడా వెంకట రమణ.. గోవిందా.. గోవిందా’ అంటూ శ్రీహరి నామస్మరణతో కురుమూర్తి గిరులు మార్మోగాయి. కురుమతి రాయుడి సన్నిధి భక్తజనసంద్రంగా మారింది. భక్తులు దాసంగాలతో దేవదేవుడికి నైవేద్యం సమర్పించారు. రెండో తిరుపతిగా పేరొందిన కురుమూర్తి కొండకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తులు పుష్కరి(కోనేటి)లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.



ముందుగా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లి గ్రామంలోని నెల్లి వంశస్తుల నుంచి కలియకుండ పూజలు నిర్వహించి వడ్డెమాన్‌కు చేరుకున్నారు. అలాగే పల్లమర్రి గ్రామం నుంచి ప్రత్యేంగా తయారుచేసిన చాటను ఆలయానికి తీసుకొచ్చారు. వడ్డెమాన్‌లోని పాదుకల కర్మాగారం(దేవాలయం)లో దళితులు తయారు చేసిన స్వామివారి పాదుకలకు(ఉద్దాలు)మధ్యాహ్నం ప్రత్యేకపూజలు నిర్వహిం చారు. అనంతరం వడ్డెమాన్‌లో భక్తుల దర్శనార్థం పాదుకలను ఉంచారు. పాదుకలను మోచేతుల మీదుగా ఊకచెట్టు వరకు ఊరేగించారు.

 

 పాదుకలు ఉంచిన చాట కింద దూరేందుకు భ క్తులు పోటీపడ్డారు. ఊకచెట్టు వరకు ఊరేగించి తిరునాళ్లు నిర్వహించారు. అక్కడి నుంచి పాదుకలను చాటలో ఉంచి తిర్మలాపూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరిం చిన వాహనంపై ఉద్దాలను కురుమూర్తి కొండ వరకు ఊరేగించారు. స్వామివారి పాదుకలు ఆలయం వద్దకు చేరుకోగానే ఆలయ ప్రాంగణం పరిసరాలు కురుమూర్తి నామస్మరణతో మార్మోగాయి. ఉదయం ఏడు గంటలకే కురుమూర్తికొండల పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. కోనేరు పరిసర ప్రాంతాలతోపాటు చుట్టూ ఎటుచూసినా దాసంగాలే దర్శనమిచ్చాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలో నిలబడ్డారు.

 

 దర్శించుకున్న ప్రముఖులు

 ఉత్సవాల సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఈఓ బాలచంద్రుడు, ఆలయ కమిటి సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తరలొచ్చి సామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా గద్వాల డిఎస్పీ గోవింద్‌రెడ్డి, ఆత్మకూర్ సీఐ గోవర్దనగిరి, ఎస్‌ఐలు షేక్‌గౌస్, అబ్దుల్జ్రాక్, శ్రీకాంత్‌రెడ్డి, నర్సిములు ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆర్చకులు వెంకటేశ్వర్లు, మక్తల్, ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే సీతమ్మ, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వావిళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు వజీర్‌బాబు, మహదేవన్‌గౌడ్, మాసన్న, ఆలయ కమిటీ సబ్యులు పాల్గొన్నారు.  

 

  గట్టి బందోబస్తు

 శ్రీశ్రీ కురుమూర్తిస్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్దాల ఉత్సవానికి జిల్లా, రాష్ట్ర న లుమూలల నుంచి సుమారు రెండు లక్షల మం దికిపైగా భక్తులు హాజరైనట్లు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. గద్వాల డీఎస్పీ గోవిందరెడ్డి, సీఐ గోవర్దనగిరి ఆధ్వర్యంలో 500మంది బలగాలతోపాటు రెండు స్పెషల్‌పార్టీ బలగాలతో గట్టి బందోస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ వారు ఆయా డిపోల నుంచి జాతరలో బస్‌స్టేషన్ ఏర్పాటు చేసి 200 ప్రత్యేక బస్సులు నడిపారు. జిల్లా కేంద్రంతో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అచ్చంపేట, కల్వకుర్తి డిపోల నుంచి ప్రత్యేకబస్సులు నడిపారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top