
కిరణ్ ‘చివరి’ సంతకాలపై గవర్నర్ సమీక్ష?
నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఝలక్ ఇవ్వనున్నారా?
సాక్షి, హైదరాబాద్: నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఝలక్ ఇవ్వనున్నారా? ముఖ్యమంత్రిగా గత మూడు నెలల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలను.. రాష్ట్రపతి పాలనతో రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకున్న గవర్నర్ సమీక్షించనున్నారా? అధికార వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రిగా కిరణ్ గత డిసెంబర్ నుంచి.. రాజీనామా చేసిన రోజు ఫిబ్రవరి 19వ తేదీ వరకు తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ నరసింహన్ తిరగతోడనున్నట్లు అధికార వర్గాల సమాచారం. కిరణ్ సీఎం పదవిలో ఉన్న చివరి రోజుల్లో నిబంధనలను తుంగలో తొక్కి అనేక నిర్ణయాలను తీసుకున్నారని, నిబంధనలకు విరుద్ధంగా, అధికారులు వద్దన్నా పట్టించుకోకుండా కొన్ని కేసుల్లో భూముల కేటాయింపులు చేశారని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ భూముల కేటాయింపులకు సంబంధించి రెవెన్యూ శాఖ ఫైళ్లపై కిరణ్ సీఎంగా చివరి రోజుల్లో సంతకాలు చేశారు.
ళ పరిశ్రమలు, స్టాంపులు - రిజస్ట్రేషన్లు, విద్యాశాఖలకు సంబంధించిన పలు అంశాల ఫైళ్లపై కిరణ్ ముఖ్యమంత్రిగా చివరి రోజుల్లో సంతకాలు చేశారు. ఆయన రాజీనామా చేయటంతో ఆ సంతకాలు చేసిన ఫైళ్లకు సంబంధించిన జీవోలను అధికారులు జారీ చేయలేదు. ఆ ఫైళ్లను పక్కన పెట్టారు.
ళ కిరణ్ రాజీనామా చేయటానికి ఒక్క రోజు ముందు సామూహికంగా 600 మంది ఉపాధ్యాయులను ఒక్క సంతకంతో బదిలీలు చేయటానికి ఆమోదం తెలిపారు. ఆయన రాజీనామా చేయటంతో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలుపుదల చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో పైరవీలు, సిఫారసులతో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను బదిలీలు చేయటంతో విద్యార్థులకు చేటు జరుగుతుందని, కౌన్సెలింగ్ విధానానికి తూట్లు పొడిచారని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
ళ 800 మంది కాంట్రాక్టు రెసిడెంట్ టీచర్ల సర్వీసును క్రమబద్ధీకరణ చేస్తూ కిరణ్ సీఎంగా చివరి రోజుల్లో నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికశాఖ అధికారులు.. ఇలా సర్వీసు క్రమబద్ధీకరణ రాజ్యాగ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నప్పటికీ కిరణ్ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. ఈ ఫైలును కూడా విద్యాశాఖ అమలు చేయకుండా ఆర్థికశాఖకు పంపగా ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలుపుదల చేశారు.
ళ కమిషనర్ ఆఫ్ ఇంక్వైరీస్ అధికారుల పదవీ కాలం ఫిబ్రవరిలో ముగియనుండగా వారినే మరో రెండేళ్ల పాటు కొనసాగించేందుకు గత డిసెంబర్‌లోనే సీఎంగా కిరణ్ ఆమోదం తెలిపారు. వీటితో పాటు మరి కొన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులనూ కిరణ్ భర్తీ చేశారు. ఈ అన్ని అంశాలపై గవర్నర్ నరసింహన్ సమీక్షించనున్నట్లు అధికార వర్గాలు చెప్తున్నాయి.
గతంలోనూ కిరణ్‌తో గవర్నర్‌కు విభేదాలు...
ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న సమాచార హక్కు కమిషనర్ల నియామకం విషయంలోను, అలాగే ఇటీవల ఎమ్మెల్సీగా రఘురామిరెడ్డి నియామక నిర్ణయం విషయంలోను ఆయనతో గవర్నర్ నరసింహన్ విభేదించిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీగా రఘురామిరెడ్డిని నియమించాల్సిందేనని సీఎం లేఖ రాస్తూ సంబంధిత ఫైలును రెండోసారి గవర్నర్‌కు పంపటం.. దానిపై గవర్నర్ ఇప్పటి వరకు స్పందించకపోవటం విదితమే. అలాగే సీఎంగా కిరణ్ గతంలో గవర్నర్ నరసింహన్ వ్యక్తిగతంగా బాధపడేలా వ్యవహరించారు. తిరుపతి నుంచి చెన్నై వెళ్లటానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ కోరగా అందుకు కిరణ్ నిరాకరించినప్పుడు గవర్నర్ ఆవేదన చెందారు.
నేడు గవర్నర్ విలేకరుల సమావేశం..
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన నేపథ్యం లో.. రాష్ట్ర పాలనా యంత్రాంగం మొత్తం ఇకపై ఆయన కనుసన్నల్లో నడవాల్సి ఉన్న విషయం విదితమే. అందు లో భాగంగా రాష్ట్రపతి పాలన సమయంలో ఏ విధంగా వ్యవహారాలు ఉంటాయి, పాలన ఎలా కొనసాగుతుంది, పాటించాల్సిన నియమ నిబంధనలకు సంబంధించిన అంశాల గురించి గవర్నర్ వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న రాజీనామా చేసినప్పటి నుంచి సీఎం సహాయ నిధి నుంచి రోగులకు అందే సాయం అందడం లేదు. దీనిపై రోగులు క్యాంపు కార్యాలయం, సచివాలయం చుట్టూ తిరుగుతున్నా.. ఎవ రూ దీనిపై సరిగా స్పందించడం లేదు. రాష్ట్రపతి పాలన సమయంలో ఈ సహాయాన్ని ఎవరు అందిస్తారన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. గవర్నర్‌ను సాధారణంగా కలవడం సాధ్యం కానందున ఈ బాధ్యతలను గవర్నర్ ఎవరికైనా అప్పగిస్తారేమో వేచి చూడాల్సి ఉంది.